ట్రెండీ టాక్‌: NBK-భ‌ళ్లాల మ‌ల్టీస్టార‌ర్

Update: 2020-04-06 03:45 GMT
వెట‌ర‌న్ స్టార్లు రీమేక్ ల‌పై మోజు ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే కొణిదెల కాంపౌండ్ లో మెగాస్టార్ ప‌లు మ‌ల‌యాళ చిత్రాల రీమేక్ ల‌పై దృష్టి సారించ‌డం హాట్ టాపిక్ గా మారింది. తాజాగా మ‌రో వెట‌ర‌న్ నంద‌మూరి బాల‌కృష్ణ ఓ రీమేక్ లో న‌టించేందుకు సిద్ధ‌మ‌వుతుండ‌డం అభిమానుల్లో చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఇటీవ‌లే రిలీజై ఘ‌న‌విజ‌యం సాధించిన మలయాళ చిత్రం `అయ్యప్పన్ కోషియమ్` రీమేక్ లో బాల‌కృష్ణ క‌థానాయ‌కుడిగా న‌టించ‌నున్నార‌ని తెలుస్తోంది.

ఈ సినిమాని సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ అధినేత సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో మ‌రో కీల‌క పాత్ర‌కు ఓ టాలీవుడ్ యంగ్ హీరోని ఎంపిక చేయ‌నున్నార‌ని తొలుత క‌థ‌నాలు వ‌చ్చాయి. ఆ క్ర‌మంలోనే బాల‌య్య‌కు అత్యంత స‌న్నిహితుడైన మంచు హీరో ఇందులో న‌టించేందుకు వీలుంద‌ని ప్ర‌చార‌మైంది.

తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఆ పాత్ర‌కు విష్ణు స్థానంలో రానాను ఎంపిక చేశార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. రానాకు జాతీయ స్థాయిలో ఇమేజ్ ఉంది. అత‌డు బాహుబ‌లి చిత్రంతో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. భ‌ళ్లాల దేవుడిగా అభిమానుల గుండెల్లో స్థిర‌మైన స్థానం సంపాదించాడు. పైగా ఇప్పుడు రానా న‌టిస్తున్న‌వి అన్నీ పాన్ ఇండియా సినిమాలే కావ‌డంతో అది ఈ రీమేక్ చిత్రానికి ప్లస్ అవుతుంద‌ని ద‌ర్శ‌క‌నిర్మాత‌లు భావిస్తున్నార‌ట‌.

ఆ ఇద్ద‌రి పాత్ర‌లు ఏవి? అంటే మాతృక‌లో కీల‌క‌మైన‌ పోలీస్ అధికారిగా బిజూ మీనన్ న‌టించారు. ఆ పాత్రలో బాలయ్య న‌టిస్తారు. వేరొక లీడ్ పాత్ర‌లో రానా నటిస్తాడు. ఇంత‌కుముందు బాల‌య్య‌తో క‌లిసి ఎన్టీఆర్ బ‌యోపిక్ లో యంగ్ నారా చంద్ర‌బాబు నాయుడు పాత్ర‌లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు మ‌రోసారి అదే కాంబినేష‌న్ రిపీట‌వుతుండ‌డం ఆస‌క్తి క‌లిగించేదే. అయితే దీనికి సంబంధించి సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ నుంచి అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంటుంది.
Tags:    

Similar News