ఎన్టీఆర్‌, కృష్ణ స‌ర‌స‌న బాల‌య్య నిలుస్తాడా

Update: 2015-11-20 09:30 GMT
వంద సినిమాలు హీరోగా చేయ‌డమంటే ఆషామాషీ కాదు. ప్ర‌స్తుతం ఏడాదికి ఒకటి రెండు సినిమాలు చేస్తున్న హీరోలకు ఇక 100 సినిమాలు చేయ‌డం  దాదాపు అసాధ్య‌మే. అయితే టాలీవుడ్‌ లో 100 సినిమాలు కంప్లీట్ చేసిన వాళ్ల‌లో నిన్న‌టి త‌రం హీరోల్లో చాలామంది ఉన్నా వాళ్ల‌లో చాలా త‌క్కువ మందికి మాత్ర‌మే త‌మ 100వ సినిమా మ‌ధుర జ్ఞాప‌కంగా మిగిలిపోయింది. ఇప్పుడు న‌ట‌సింహం బాల‌య్య వందో సినిమా హిట్ కొట్టి వారి స‌ర‌స‌న నిలుస్తారా? అని అభిమానులు ఎంతో ఆశ‌తో ఎదురు చూస్తున్నారు.

క్రికెట్‌ లో ఎవ‌రైనా వందో టెస్టు ఆడుతుంటే.. అదో ప్ర‌త్యేక సంద‌ర్భంలా మిగిలిపోతుంది. ఎవ‌రైనా వందేళ్లు బతికారంటే..ఇప్పుడో గొప్ప విష‌యంగా చెప్పుకుంటున్నారు. మ‌రి సినిమాల్లో అయితే 100వ సినిమా చాలా స్పెష‌ల్‌. హీరోకి ఎంత స్పెష‌లో... అభిమానుల‌కు అంత‌కంటే ఎక్కువ‌. ఎన్ని సినిమాలు చేసినా కెరీర్‌ లో 25వ సినిమా - 50వ సినిమా - 100వ సినిమాలు ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంటారు. అభిమానులు గుర్తుంచుకునేవి కూడా అవే. అందుకే హీరోలు 100వ సినిమా క‌థ‌ - డైరెక్ట‌రు విష‌యంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. టాలీవుడ్‌ లో ఇప్ప‌టి వ‌ర‌కు 100 సినిమాలు కంప్లీట్ చేసిన వాళ్ల‌లో 100వ సినిమా హిట్ అయ్యి త‌మ కేరీర్‌ లో మ‌ధుర జ్ఞాప‌కంగా మిగుల్చుకున్న హీరోలు ఇద్ద‌రే ఇద్ద‌రు ఉన్నారు. వాళ్లే విశ్వ‌విఖ్యాత సార్వ‌భౌముడు నంద‌మూరి తార‌క‌రామారావు ఒక‌రు కాగా, సూప‌ర్ స్టార్ కృష్ణ మ‌రొక‌రు.

ఎన్టీఆర్ న‌టించిన 100వ సినిమా `గుండ‌మ్మ క‌థ‌`.  ఫ్యామిలీ ఎంట‌ర్‌ టైనర్‌ గా - చ‌క్క‌టి క‌థ - స్క్రీన్‌ ప్లే తో వచ్చిన ఈ చిత్రం ఇప్ప‌టికీ తెలుగు చ‌ల‌న చిత్రాల్లో క్లాసిక్‌ గా నిలిచిపోయింది. టాప్ 10 చిత్రాల్లో ఈచిత్రం తప్ప‌నిస‌రిగా ఉంటుంది. ఇక సూప‌ర్‌ స్టార్ కృష్ణ 100వ సినిమా `అల్లూరి సీతారామ‌రాజు`. ఈ చిత్రం అనూహ్య విజ‌యాన్నిసొంతం చేసుకుంది. అంతేగాక కృష్ణకు కెరీర్ లోనే గొప్ప మైలురాయిగా నిలిచింది.

ఇప్పుడు బాల‌య్య 100వ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ద‌ర్శ‌కుడు బోయ‌పాటి `గాడ్ ఫాద‌ర్‌` అనే టైటిల్‌ ను రిజిస్ట‌ర్ చేయించాడు. బోయ‌పాటి-త‌న‌ కాంబినేష‌న్‌ లో వ‌చ్చిన సింహా - లెజెండ్ చిత్రాల‌కు ధీటుగా బాల‌య్య 100వ సినిమా ఉండేలా బాల‌య్య ప్లాన్ చేస్తున్నార‌ట‌.ఈ సినిమాతో బాల‌య్య హిట్ కొట్టి తండ్రి ఎన్టీఆర్‌ - కృష్ణ స‌ర‌స‌న నిలుస్తాడ‌ని ఆశిద్దాం.
Tags:    

Similar News