బాలయ్యది గొప్ప నిర్ణయమే..

Update: 2016-04-09 05:09 GMT
నందమూరి బాలకృష్ణ గత రెండు దశాబ్దాల్లో చేసిన సినిమాలన్నీ గుర్తు చేసుకోండి. అందులో నిజంగా వైవిధ్యమైన సినిమా ఏదైనా ఉందా..? ‘సమరసింహారెడ్డి’ లాంటి ట్రెండ్ సెట్టింగ్ మూవీ.. ‘శ్రీరామరాజ్యం’ లాంటి పౌరాణిక చిత్రం చేసిన మాట వాస్తవమే కానీ.. అవి బాలయ్యకు కంప్లీట్ మేకోవర్ అయితే కాదు. ఐతే వందో సినిమాగా ఎంచుకున్న చిత్రం మాత్రం బాలయ్యకు కచ్చితంగా కెరీర్ లోనే అత్యంత వైవిధ్యమైన సినిమా అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

‘గౌతమీపుత్ర శాతకర్ణి’ కథను బాలయ్య మరో దర్శకుడితో చేసి ఉంటే.. అది మామూలుగానే ఉంటుందేమో. కానీ క్రిష్ లాంటి దర్శకుడు ఈ సినిమాను రూపొందించబోతుండటమే దీని ప్రత్యేకత. క్రిష్ ఏ సినిమా చేసినా.. అందులో వైవిధ్యం ఉంటుంది. పాత్ బ్రేకింగ్ సినిమాలకు క్రిష్ పెట్టింది పేరు. ఏం తీసినా మనసు పెట్టి తీస్తాడు. అతడి శైలే భిన్నంగా ఉంటుంది. కాబట్టి అతడితో తన వందో సినిమా చేయాలని బాలయ్య తీసుకున్న నిర్ణయం భేష్ అంటున్నారు చాలామంది.

నందమూరి హీరోలు ఓ మూసలో వెళ్లిపోతారన్న అభిప్రాయం చాలామందిలో ఉంది. బాలయ్య ఒకప్పుడు వైవిధ్యమైన సినిమాలు చేసి ఉంటే ఉండొచ్చు కానీ.. గత రెండు దశాబ్దాల్లో మాత్రం ఎక్కువగా మూస సినిమాలే చేశాడు. సింహా - లెజెండ్ లాంటి సినిమాలు ఆయన గత సినిమాలతో పోలిస్తే భిన్నమే కానీ.. వైవిధ్యమైన సినిమాలు మాత్రం కావు. ఐతే బాలయ్య లాంటి హీరో క్రిష్ లాంటి దర్శకుడితో సినిమా చేయడం అన్నది అసలు ఊహకైనా అందని విషయం. కెరీర్లో ఈ దశలో క్రిష్ తో సినిమా చేయడం అన్నది ఒక సాహసమే అని చెప్పాలి. గొప్ప చారిత్రక కథతో తెరకెక్కుతున్న సినిమాలో బాలయ్య దర్శకుడి చేతుల్లోకి వెళ్లిపోయాడంటే.. ఆయనకిది మరపురాని సినిమా అవడం ఖాయం.
Tags:    

Similar News