లయన్‌.. ఏడేళ్ల ముందు కథ

Update: 2015-04-10 13:30 GMT
లెజెండ్‌ లాంటి బ్లాక్‌బస్టర్‌ తర్వాత బాలయ్య ఇంకో పెద్ద డైరెక్టర్‌, పెద్ద నిర్మాతతో సినిమా చేస్తాడని అంతా అనుకున్నారు. కానీ ఆశ్చర్యకరంగా ఓ కొత్త దర్శకుడు, చిన్న నిర్మాతతో కలిసి 'లయన్‌' సినిమా మొదలుపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు. విజయేంద్రవర్మ, మిత్రుడు లాంటి సినిమాలు కొత్త దర్శకులతో చేసి చేతులు కాల్చుకున్న బాలయ్య.. మళ్లీ ఓ డెబ్యూ డైరెక్టర్‌కు ఛాన్స్‌ ఇచ్చేసరికి అభిమానులు కొంచెం కంగారుపడ్డ మాట వాస్తవం. ఐతే ఇదో ప్రత్యేకమైన కథ అని.. ఐదారేళ్లుగా తన మస్తిష్కంలో ఈ కథ మెదులుతూనే ఉండటంతో ఈ సినిమా కచ్చితంగా చేయాల్సిందేనని పట్టుబట్టి చేశానని ఆడియో ఫంక్షన్లో చెప్పాడు బాలయ్య.

''సత్యదేవా చాలా ఏళ్ల కిందట నాకీ కథ చెప్పాడు. ఐదేళ్లుగా ఈ కథ నా మస్తిష్కంలో మెదులుతూనే ఉంది. కొందరు నిర్మాతలకు ఈ కథ చెబితే ఏంటండీ ఇది మరీ కొత్తగా ఉందని అన్నారు. ఐతే నేనెప్పుడూ కొత్తదనాన్ని కోరుకుంటాను. రుద్రపాటి రమణరావుకు కథ చెబితే ఆయన చాలా బాగుందని చెప్పి.. సినిమా చేయడానికి ముందుకొచ్చారు'' అని చెప్పాడు బాలయ్య. దర్శకుడు సత్యదేవా మాట్లాడుతూ.. ''ఏడేళ్ల కిందట బాలయ్యకు ఈ కథ చెప్పా. అప్పటికి సింహా మొదలు కూడా కాలేదు. కథ చెప్పిన ఆరు నెలల తర్వాత నన్ను పరిచయం చేసిన వ్యక్తికి ఫోన్‌ చేసి నా గురించి అడిగారు. తర్వాత నాకు ఫోన్‌ చేశారు. ఈ సినిమా చేద్దామన్నారు. ఐదేళ్లుగా ఆయనతో కలిసి ట్రావెల్‌ చేస్తున్నా. లెజెండ్‌ తర్వాత పిలిచి ఈ సినిమా మొదలుపెడదామన్నారు. ఇది రెగ్యులర్‌ మసాలా సినిమా కాదు. ఎవరూ ఊహించని విధంగా కొత్తగా ఉంటుంది. ఈ సినిమా సూపర్‌ హిట్‌ కావడం ఖాయం. రిలీజ్‌కుముందే చెబుతున్నా. ఈ సినిమా సక్సెస్‌ క్రెడిట్‌ మొత్తం బాలయ్యకే దక్కుతుంది'' అన్నాడు.

Tags:    

Similar News