బాలయ్య ప్రసంగాలు మారవా?

Update: 2018-10-22 08:08 GMT
సినిమా వేడుకల్లో నందమూరి బాలయ్య వేదిక ఎక్కాడంటే చాలు.. ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడికి వెళ్తాడో ఎవ్వరికీ అర్థం కాదు. ఈ విషయంలో నందమూరి అభిమానులు ఫీలైనా ఇది వాస్తవం. సాధారణంగా బాలయ్య తన సినిమాల ఆడియో వేడుకకు వచ్చాడంటే.. ఎప్పుడూ ఒకే రకమైన ప్రసంగం చేస్తుంటాడు. ఆడియో విజయం సాధిస్తే.. సినిమా సగం విజయం సాధించినట్లే అని మొదలుపెట్టి.. సంగీతానికి ఉన్న ప్రాధాన్యాన్ని వివరిస్తూ.. విశ్వామిత్రుడు మేనక నృత్యానికి మైమరిచిపోయాడని.. శ్రీకృష్ణుడి వేణు గానానికి గోవులు మోకరిల్లాయని.. ఇలా పురాణాల్లోకి వెళ్లిపోయి ప్రసంగాన్ని ఎక్కడికో తీసుకెళ్తుంటాడు. కనీసం ఇప్పటిదాకా పది ఆడియో వేడుకల్లో బాలయ్య ఇదే ప్రసంగం చేసిన విషయం అందరికీ తెలుసు.

ఐతే ఇప్పుడు ‘అరవింద సమేత’ సక్సెస్ మీట్‌ కు వచ్చిన బాలయ్య అక్కడ సైతం ఇదే ప్రసంగాన్ని పునరావృతం చేయడం ఆశ్చర్యం కలిగించే విషయం. సంగీత దర్శకుడు తమన్ గురించి ప్రస్తావన రాగానే.. నేనెప్పుడూ చెబుతూ ఉంటాను అంటూ.. తన పాత స్టయిల్లోకి వెళ్లిపోయాడు బాలయ్య. విశ్వామిత్రుడు-మేనక.. శ్రీకృష్ణుడు-గోవుల మంద.. అంటూ తనదైన శైలిలో ప్రసంగాన్ని డైవర్ట్ చేసేశాడు. ఇక అభినందన సభ అనే మాటకు నిర్వచనం చెబుతున్నపుడు కూడా బాలయ్య ఎక్కడెక్కడికో వెళ్లిపోయాడు. మధ్యలో తన సినిమాల గురించి.. ఎన్టీఆర్ పాత్రల గురించి.. రాజకీయాల గురించి.. తెలుగుదేశం పార్టీ గురించి.. ఇలా సంబంధం లేని ఏవేవో విషయాల గురించి బాలయ్య మాట్లాడాడు. మధ్య మధ్యలో తన తెలుగు పాండిత్యాన్ని ప్రదర్శించాడు. ప్రసంగం మొత్తం డైవర్షన్లే. తన సినిమా వేడుకలో ఏం మాట్లాడినా ఓకే కానీ.. వేరొకరి సినిమాకు వచ్చినపుడు వాళ్ల సినిమా గురించి కాకుండా.. సంబంధం లేని ఏవేవో విషయాల గురించి మాట్లాడటం ఎంత వరకు సమంజసం? లక్షల మంది చూసే వేడుకల్లో ప్రసంగాల విషయంలో బాలయ్య కాస్తయినా కసరత్తు చేసి రావచ్చు కదా?
Tags:    

Similar News