వైజాగ్‌ లో బాలకృష్ణ ఫిలింస్టూడియో?

Update: 2018-08-22 06:01 GMT
సీఎం చంద్ర‌బాబు ప్ర‌స్తుతం వైజాగ్ లో ఫిలిం ఇండ‌స్ట్రీ ఏర్పాటుపై సీరియ‌స్‌ గా ఆలోచిస్తున్నారా? బీచ్ సొగ‌సుల విశాఖ‌లో కొత్త ఫిలిం ఇండ‌స్ట్రీ ఏర్పాటు గురించి తాడో పేడో తేల్చ‌నున్నారా? ఇన్నాళ్లు ఆగి ఆగి ఉన్న ఈ బృహ‌త్త‌ర కార్య‌క్ర‌మాన్ని ఇక‌పై పూర్తి స్థాయిలో తెర‌పైకి తెచ్చేందుకు సైర‌న్ మోగించారా? అంటే అవున‌నే తాజా స‌న్నివేశం చెబుతోంది. ఇన్నాళ్లు తామ‌ర తంప‌ర‌గా ఏవో స్పెక్యులేటెడ్ వార్త‌లు వ‌స్తున్నాయిలే అనుకున్న జ‌నాల‌కు .. ఇక ఆగేది లేద‌న్న సంకేతాల్ని నిన్న‌టి ప్ర‌క‌ట‌న తేల్చి చెప్పింది వైజాగ్‌ లో 316 ఎక‌రాల్ని కేటాయించేందుకు చంద్ర‌బాబు ప్ర‌భుత్వం జీవో విడుద‌ల చేసేందుకు రెడీ అవుతోంద‌న్న స‌మాచారం అందింది.

అయితే ఈ ప్ర‌తిపాద‌న ఇప్ప‌టిది కాదు. రాష్ట్రం విడిపోక ముందు నుంచి నానుతున్న‌దే. ఇప్ప‌టికి న‌వ్యాంధ్ర రాజ‌ధాని విష‌యంలో ఓ క్లారిటీ వ‌చ్చేశాక చంద్ర‌బాబు సినీస్టూడియోల నిర్మాణం - కొత్త ఫిలిం ఇండ‌స్ట్రీ ఏర్పాటుపై దృష్టిసారించార‌ని అర్థ‌మ‌వుతోంది. ఈసారి వైజాగ్‌ లో భారీ స్టూడియో నిర్మాణానికి చంద్ర‌బాబు వియ్యంకుడు - నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ పావులు క‌ద‌ప‌డం చ‌ర్చ‌కొచ్చింది. బాల‌య్య‌కు 10-20 ఎక‌రాల మేర స్టూడియో నిర్మాణానికి స్థ‌లం ఇచ్చే అవ‌కాశం ఉంద‌న్న ప్ర‌చారం సాగుతోంది. ఇక ఇదే వైజాగ్‌ లో ప్ర‌ఖ్యాత ఏవీఎం స్టూడియోస్ సైతం ఓ కొత్త స్టూడియో ఏర్పాటున‌కు ఆస‌క్తిగా ఉంద‌ని తెలుస్తోంది.

ఒక‌వేళ ఇదే నిజ‌మైతే - ఈ సెట‌ప్ వ‌ల్ల కొన్ని వేల కొత్త ఉద్యోగాలు అక్క‌డ క్రియేట్ అవుతాయ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఇది మంచి ప్ర‌య‌త్న‌మే. నిరుద్యోగ యువ‌త‌కు ఉపాధి పెంచే వీలుంది.  అభివృద్ధి ప‌రంగా వేగం పుంజుకుంటుంద‌ని ప్ర‌జ‌లు ఆశిస్తున్నారు. ఇప్ప‌టికే వైజాగ్ బీచ్ ఏరియాలో డి.రామానాయుడు స్టూడియోస్ కొలువు దీరి ఉంది. ఆ ఏరియాని ఫిలింహ‌బ్‌ గా తీర్చిదిద్దేందుకు సాగుతున్న ప్ర‌య‌త్నాల్ని అభినందించి తీరాలి. అయితే వైజాగ్‌ లో సినీస్టూడియోల పేరుతో ఖ‌రీదైన భూముల్ని అయిన‌వారికి ధారాద‌త్తం చేయాల‌న్న కుత్సిత బుద్ధితో సీఎం చంద్ర‌బాబు ఈ ప‌ని చేయ‌డం లేదు క‌దా? అన్న సందేహాల్ని వైజాగ్ వాసులు వ్యక్తం చేస్తున్నారు. మ‌రి దీనికి బాబు ఏం చెబుతారో?
Tags:    

Similar News