మరి బాలయ్యకు లేదా ఆ ఛాన్స్?

Update: 2018-01-07 06:38 GMT
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓవైపు తెలుగుదేశం ప్రభుత్వం మీద విమర్శలు చేస్తుంటాడు. తెలుగుదేశం నాయకులు కూడా పవన్ ను లక్ష్యంగా చేసుకుని కొన్ని విమర్శలు విసురుతుంటారు. కానీ పవన్ కు పరోక్షంగా తెలుగుదేశం ప్రభుత్వం సాయాలు చేస్తూనే ఉంటుంది. తాజాగా పవన్ కొత్త సినిమా ‘అజ్ఞాతవాసి’కి అలాంటి సాయమే చేసింది ఏపీ సర్కారు. ఈ చిత్రానికి రిలీజ్ రోజు నుంచి రాత్రి ఒంటి గంట నుంచి ఉదయం 10 గంటల మధ్య వారం రోజుల పాటు స్పెషల్ షోలు వేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. అంటే 24 గంటలూ ఈ సినిమాను నడిపించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారన్నమాట. మరి సంక్రాంతికి ఇంకో పెద్ద సినిమా కూడా వస్తోంది. అదే.. ‘జై సింహా’.

మరి ఈ చిత్రానికి ఇలాంటి స్పెషల్ బెనిఫిట్స్ ఏమీ ఉండవా.. అన్న విషయం చర్చనీయాంశం అవుతోంది. బాలయ్య.. స్వయంగా ఏపీ సీఎం చంద్రబాబుకు బావమరిది. ఆయన ఎమ్మెల్యే కూడా. కావాలనుకుంటే బాలయ్య సినిమాకు కూడా ఇలాంటి అనుమతులు క్షణాల్లో మంజూరవుతాయి. కానీ ‘అజ్ఞాతవాసి’ స్థాయిలో ఆ చిత్రానికి హైప్ లేదు. రెగ్యులర్ షోలు ఫుల్ అయి సినిమా బాగా ఆడితే చాలన్న ఫీలింగ్‌ లో నిర్మాత సి.కళ్యాణ్ ఉన్నట్లున్నాడు. ఐతే తాను ఎవరికీ తక్కువ కాదని.. తన స్థాయే వేరని అనుకునే ఆత్మవిశ్వాసం బాలయ్యది. మరి ‘అజ్ఞాతవాసి’కి స్పెషల్ షోలు వేయడానికి అనుమతి ఇవ్వడం చూసి తన సినిమాకు కూడా అలాంటి అవకాశం కల్పించాలని.. తన సినిమాను కూడా అర్ధరాత్రి దాటాక.. తెల్లవారుజామున ఆడించాలని బాలయ్య అడుగుతాడేమో చూడాలి.


Tags:    

Similar News