మెగాస్టార్ బయోపిక్ గురించి నేనలా అన్లేదు!

Update: 2022-06-08 16:30 GMT
సీనియర్ నటుడు బెనర్జీ చాలామందికి తెలుసు. చాలా కాలం నుంచి ఆయన ఇండస్ట్రీలో ఉంటున్నారు. సీరియస్ గా ఉన్న పాత్రలను ఆయన చాలా బాగా చేస్తాడనే పేరుంది. ఆ తరహా పాత్రలను ఆయన చాలా సింపుల్  గా .. చాలా సహజంగా చేస్తూ ఉంటారు. ఆయన చేసే పాత్రలకి పెద్దగా డైలాగ్స్ కూడా ఉండవు. ఎందుకంటే కళ్లతోనే ఆయన తన భావాలను వ్యక్తం చేస్తూ ఉంటారు. అందువలన కెరియర్ ఆరంభంలో ఆయన ఎక్కువగా వర్మ సినిమాలు చేస్తూ వచ్చారు. ఆయన ఏ పాత్రను చేసినా అది చాలా నీట్ గా .. ఆ పాత్ర మాత్రమే కనపడేలా ఉంటుంది.

'మల్లీశ్వరి' సినిమాలో హీరోయిన్ ను చంపడానికి కోట పంపించగా వచ్చిన రౌడీలా ఆయన కనిపిస్తారు. ఇక ఇటీవల వచ్చిన 'ఆచార్య' సినిమాలో నక్సలైట్ గా ముఖ్యమైన పాత్రనే పోషించారు. సాధారణంగా ఆయన ఇండస్ట్రీలో నలుగురితో కలిసిపోయే కనిపిస్తూ ఉంటారు. అనవసరమైన విషయాలను గురించి ఆయన ఎప్పుడూ ఎక్కడా మాట్లాడిన దాఖలాలు కనిపించవు. తండ్రి కూడా సీనియర్ ఆర్టిస్ట్ కావడం వలన .. సినిమా వాతావరణంలో పెరగడం వలన ఎలా నడచుకోవాలనేది ఆయనకి బాగానే తెలుసు. అలాంటి ఆయన తాజాగా ఒక విషయంపై వివరణ ఇచ్చుకోవలసి వచ్చింది.

చిరంజీవి బయోపిక్ ను తాను తీస్తానని బెనర్జీ అన్నట్టుగా కొన్ని రోజులుగా ఒక వార్త షికారు చేస్తోంది. మెగాస్టార్ బయోపిక్ ను బెనర్జీ తీస్తానని అన్నాడనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. దాంతో బెనర్జీ వివరణ  ఇచ్చుకోవలసి వచ్చింది. "ఒక స్టేజ్ పై నేను చిరంజీవిగారిని గురించి మాట్లాడుతూ .. ఆయన అనుమతితో బయోపిక్ తీస్తే బాగుంటుందని అన్నాను.

ఇండస్ట్రీకి వచ్చిన తరువాత ఆయన పడిన కష్టాలు .. సాధించిన విజయాలు .. అందుకున్న అవార్డులు .. స్ఫూర్తి దాయకంగా ఉంటాయనే ఉద్దేశంతో ఆయన బయోపిక్ తీస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశానుగానీ .. అది నేనే తీస్తానని మాత్రం చెప్పలేదు" అంటూ క్లారిటీ ఇచ్చారు.

నిజానికి చిరంజీవి బయోపిక్ తీయడమనేది అంత తేలికైన విషయమేం కాదు. ఒక వైపున ఎన్టీఆర్ - ఏఎన్నార్, మరో వైపున కృష్ణ - శోభన్ బాబు, ఆ  తరువాత బలమైన వారసత్వంతో ఇండస్ట్రీకి వచ్చిన బాలకృష్ణ .. నాగార్జున .. వెంకటేశ్ లను ఎదుర్కుంటూ చిరంజీవి ముందుకు సాగారు. డాన్సులు .. ఫైట్ల విషయంలో కొత్త ట్రెండ్ ను క్రియేట్ చేశారు. ఎంతోమంది  దర్శకులతో .. రచయితలతో కలిసి పనిచేశారు.

ఆయన జీవితంలో ఎన్నో మలుపులు .. మరెన్నో గెలుపులు ఉన్నాయి. అంతటి స్పార్క్ తో వచ్చిన హీరో ఇంతవరకూ లేడు. అలాంటి ఆయన జీవితాన్ని తెరకెక్కించడం అంత ఆషామాషీ విషయమేం కాదు. అది ఆలోచన చేయకుండా బెనర్జీ మాటలను మార్చేసి వైరల్ చేయడం హాస్యాస్పదం.
Tags:    

Similar News