ఆహాలో పవర్ తుపాన్ హెచ్చరిక.. భీమ్లా రాక ఎప్పుడంటే..?

Update: 2022-03-05 07:38 GMT
పవన్ కళ్యాణ్ - రానా దగ్గుబాటి పోటీపడి నటించిన సినిమా ''భీమ్లా నాయక్''. ఫిబ్రవరి 25న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపుతోంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఓవర్సీస్‌ లోనూ భారీ వసూళ్లతో దూసుకుపోతోంది.

అహంకారానికి ఆత్మాభిమానానికి మధ్య మడపతిప్పని యుద్ధం అనే లైన్ తో వచ్చిన 'భీమ్లా నాయక్' చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ నేపథ్యంలో వారం రోజుల్లోనే మేకర్స్ ను లాభాల బాట పట్టించి.. సక్సెస్ ఫుల్ గా రెండో వారంలో అడుగుపెట్టింది.

బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న 'భీమ్లా నాయక్' చిత్రం.. ఈ వారాంతంలోనూ అదిరిపోయే వసూళ్ళు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ క్రమంలో బాలీవుడ్ లోనూ సత్తా చాటడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

థియేటర్లలో పవర్ స్ట్రామ్ సృష్టించిన పవన్ సినిమా.. డిజిటల్ వేదిక మీద అదరగొట్టడానికి రెడీ అవుతోందని తెలుస్తోంది. డిజిటల్ రంగంలో నూతన ఒరవడిని సృష్టించిన తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహా లో 'భీమ్లా నాయక్' చిత్రం స్ట్రీమింగ్ కానుందని సమాచారం.

ఎప్పటికప్పుడు ఫ్రెష్ కంటెంట్ ను స్ట్రీమింగ్ పెడుతూ వీక్షకులకు సరికొత్త వినోదాన్ని అందిస్తూ వస్తోంది 'ఆహా'. డైరెక్ట్ ఓటీటీ రిలీజులు - సూపర్ హిట్ సినిమాలతో పాటుగా టాక్ షోలు - వెబ్ సిరీస్ లను ప్రత్యేకంగా ప్రసారం చేస్తోంది.

ఇప్పుడు లేటెస్టుగా బ్లాక్ బస్టర్ 'డీజే టిల్లు' చిత్రాన్ని అందిస్తోన్న ఆహా ఓటీటీ సంస్థ.. ''భీమ్లా నాయక్'' మూవీ స్ట్రీమింగ్ హక్కులను ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో త్వరలోనే డిజిటల్ ప్రీమియర్ గా ప్రదర్శించడానికి ముహూర్తం ఫిక్స్ చేసిందని తెలుస్తోంది.

'భీమ్లా నాయక్' సినిమాని మార్చి నెల చివరి వారంలో ఓటీటీలో స్ట్రీమింగ్ పెట్టే అవకాశం ఉందని గత కొన్ని రోజులుగా వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఇప్పుడు ఆ డేట్ కూడా ఖరారైందని.. మార్చి 25న ఆహాలో రిలీజ్ కాబోతోందని టాక్ వినిపిస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు.

భీమ్లానాయక్ ఓటీటీ స్ట్రీమింగ్ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఏదేమైనా థియేటర్లలో ఘనవిజయం సాధించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్.. ఆహా ఓటీటీలోనూ సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు.

కాగా, 'భీమ్లా నాయక్' చిత్రంలో పవన్ కళ్యాణ్ - రానా దగ్గుబాటి పెర్ఫార్మన్స్ కు విమర్శకుల ప్రశంసలు అందుతున్నాయి. ఇందులో నిత్యా మీనన్ -  సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించగా.. సముద్ర ఖని - రావు రమేష్ - మురళీ శర్మ - శత్రు తదితరులు ఇతర పాత్రలు పోషించారు.

సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే తోపాటు డైలాగ్స్ అందించారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై యువ నిర్మాత సూర్య దేవర నాగవంశీ ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని నిర్మించారు.

ఎస్ఎస్ థమన్ అద్భుతమైన సంగీతం సమకూర్చారు. రవి కె చంద్రన్ ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ అందించగా.. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు.
    

Tags:    

Similar News