'భోళా శంకర్' షూటింగులో మెగా సందడి!

Update: 2022-01-24 03:30 GMT
ఎప్పుడూ లేని విధంగా ఈ సారి చిరంజీవి ఒకేసారి వరుస ప్రాజెక్టులను లైన్లో పెట్టేశారు. ఆ సినిమాల్లో 'భోళాశంకర్' ఒకటి.  మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, ఇటీవలే రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టింది. ఇది ఎమోషన్స్ ను టచ్ చేస్తూ సాగే మాస్ యాక్షన్ కథ. తమిళంలో ఆ మధ్య అజిత్ చేసిన 'వేదాళం' సినిమాకి రీమేక్. కథ ఎక్కువగా అన్నాచెల్లెళ్ల సెంటిమెంట్ చుట్టూ తిరుగుతుంది. చెల్లెలి పాత్ర చాలా ముఖ్యమైనది  కావడం వలన, కీర్తి సురేశ్ ను తీసుకున్నారు. 'అన్నాత్తే'లో రజనీకి చెల్లెలిగా నటించిన చాలా తక్కువ సమయంలో, ఆమె చిరంజీవికి కూడా చెల్లెలిగా కనిపించనుండటం విశేషం.

ఇక ఈ సినిమాలో కథానాయికగా తమన్నాను తీసుకున్నారు. ఇంతకుముందు 'సైరా' సినిమాలో ఆమె చిరంజీవి సరసన నాయికగా నటించింది. అయితే ఆ సినిమాలో కథాపరంగా ఈ ఇద్దరి మధ్య డ్యూయెట్లు పెట్టడానికి అవకాశం లేదు. కానీ ఈ సారి ఈ ఇద్దరిపై డ్యూయెట్లు ఒక రేంజ్ లో ఉంటాయని తెలుస్తోంది. తమన్నా మంచి డాన్సర్ .. ఆ విషయంలో ఆమె చిరంజీవి నుంచి ప్రశంసలను అందుకుంది. ఆమెతో కలిసి డాన్స్ చేయాలని ఉందని ఆయన 'రచ్చ' సినిమా సమయంలోనే చెప్పడం తెలిసిందే. అందువలన ఈ సారి ఈ సినిమాకి వీరి స్టెప్పులు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

ఒక వైపున కరోనా తీవ్రంగా ఉన్నప్పటికీ, అనుకున్న సమాయానికి ప్రాజెక్టులను పూర్తి చేయాలనే ఉద్దేశంతో చిరంజీవి మొన్నటి నుంచి ఈ సినిమా షూటింగులో పాల్గొంటున్నారు. ఆయన కాంబినేషన్లోని కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సన్నివేశాలు సినిమా హైలైట్స్ లో ఒకటిగా కనిపిస్తాయని అంటున్నారు. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాకి మహతి స్వరసాగర్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. 'ఆచార్య' సినిమాకి మణిశర్మ సంగీతాన్ని అందించగా, ఆయన తనయుడు మహతి స్వరసాగర్ 'భోళా శంకర్' సినిమాకి బాణీలు కడుతుండటం విశేషం.

ఇక ఈ సినిమాతో పాటు చిరంజీవి 'గాడ్ ఫాదర్' .. 'వాల్తేరు వీర్రాజు' సినిమాలను లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. 'గాడ్ ఫాదర్' మలయాళ సినిమా 'లూసిఫర్' కి రీమేక్. మోహన్ రాజా ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమ చాలావరకూ చిత్రీకరణ జరుపుకుంది. ఈ సినిమాలో నయనతార ఒక కీలకమైన పాత్రలో కనిపించనుంది. ఇక బాబీ దర్శకత్వంలో 'వాల్తేరు వీర్రాజు' సెట్స్ పైకి వచ్చింది. ఈ సినిమాలో కథానాయికగా శ్రుతి హాసన్ పేరు వినిపిస్తోంది. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే, ఈ ఏడాది చిరంజీవి నుంచి వరుస సినిమాలు థియేటర్లకు దిగిపోనున్నాయి.    
Tags:    

Similar News