RRR కి బిగ్ పంచ్..ఎటూ తేల‌ని ఏపీ టిక్కెట్టు ర‌డ‌గ‌

Update: 2022-01-01 10:30 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో టికెట్ ధ‌ర‌ల‌ లంప‌టం అంత తేలిగ్గా తేల‌డం లేదు. త‌గ్గించిన ధ‌ర‌ల‌తోనే ఈ సంక్రాంతి సినిమాల్ని ఆడించాల్సిన స‌న్నివేశం క‌నిపిస్తోంది. ఓవైపు చ‌ర్చ‌లు అంటూ ఊరిస్తున్నా ఏపీ ప్ర‌భుత్వం ఎక్క‌డా త‌గ్గిన‌ట్టు క‌నిపించ‌డం లేదు. చ‌ర్చ‌ల‌కు పిలుస్తున్నాం అంటూ ఊర‌ట క‌బుర్లు మాత్ర‌మే క‌నిపిస్తున్నాయ‌న్న ఆవేద‌న క‌నిపిస్తోంది. ఏపీలో సినిమా టికెట్ల ధరలు థియేటర్ల వర్గీకరణ అంశాలపై జనవరి 11న మరోసారి చర్చించి నిర్ణయం తీసుకుంటామని హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజీత్‌ నేతృత్వంలోని కమిటీ వెల్లడించినా కానీ దీనిపై స్ప‌ష్ఠ‌త లేదు. జీవో 35 ఇంకా కొన‌సాగుతూనే ఉంది. ప్ర‌స్తుతానికి హోంశాఖ ముఖ్యకార్యదర్శి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసినా టికెట్ ధ‌ర‌ల‌ పెంపుద‌ల‌పై ఇంకా ఏ నిర్ణ‌యం వెలువ‌డ‌లేదు.

ఆర్థిక- న్యాయ- రెవెన్యూ- పట్టణాభివృద్ధి శాఖల అధికారులతోపాటు ఎగ్జిబిటర్లతో ఏర్పడిన కమిటీ శుక్రవారం వర్చువల్ గా సమావేశమై టిక్కెట్టు అంశంపై చ‌ర్చించారు. ఈ చ‌ర్చ‌ల్లో ప్ర‌ధానంగా టికెట్ ధ‌ర ప‌ట్ట‌ణ ప్రాంతం.. గ్రామీణ ప్రాంతం .. టూటైర్ సిటీ ప‌రిధి అంటూ వ‌ర్గీక‌ర‌ణ‌పై డిస్క‌స్ చేశారు. అలాగే థియేట‌ర్ లో స‌దుపాయాలు స‌హా తినుబండారాలు కూల్ డ్రింగ్స్ పార్కింగ్ ఫీజుల గురించిన చ‌ర్చ సాగింది. టికెట్‌ ధరలు తగ్గించడాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారని సినీ గోయర్ల సంఘం ప్రతినిధులు వాదిస్తుండ‌గా.. పంపిణీ థియేట‌ర్ యాజ‌మాన్యాల వెర్ష‌న్ వేరుగా ఉంది. దీంతో జిల్లాల నుంచి జేసీల నివేదిక‌లు ఎలా ఉన్నాయో ప‌రిశీలించాల‌ని క‌మిటీ ఛైర్మ‌న్ విశ్వ‌జీత్ అన్నారు. దీనిపై 11న మరింత సమగ్రంగా చర్చిద్దామని ప్రతిపాదించారు. అంటే త‌దుప‌రి మీటింగ్ జ‌న‌వ‌రి 11న ఉంటుంది.

కానీ దీనివ‌ల్ల భారీ అంచ‌నాల‌తో వ‌స్తున్న ఆర్.ఆర్.ఆర్ కి తీవ్ర న‌ష్టం వాటిల్ల‌నుంది. 11న మీటింగ్ అంటే జ‌న‌వ‌రి 7న వ‌చ్చేస్తున్న ఆర్.ఆర్.ఆర్ ప‌రిస్థితేమిట‌న్న‌ది అర్థం కాని గంద‌ర‌గోళంలో ప‌డింది. ప్ర‌స్తుత ధ‌ర‌ల‌తోనే ఈ సినిమాని రిలీజ్ చేస్తే స‌న్నివేశ‌మేమిటో ఊహించ‌వ‌చ్చు. సంక్రాంతి బ‌రిలో వ‌స్తున్న భారీ చిత్రాల్లో ప్ర‌భాస్ - రాధేశ్యామ్.. ప‌వ‌న్ - రానాల భీమ్లా నాయ‌క్ కూడా చిక్కుల్లో ప‌డ‌నున్నాయి. ఇంత‌కుముందు వ‌కీల్ సాబ్ త‌ర‌హాలోనే హిట్ట‌యినా కానీ న‌ష్టాలు చ‌వి చూడాల్సి వ‌స్తుంద‌నే ఆవేద‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

ఏపీతో పోలిస్తే తెలంగాణ‌లో ప‌రిస్థితులు విభిన్నంగా ఉన్నాయి. ఇక్క‌డ టికెట్ పెంపున‌కు కేసీఆర్ ప్ర‌భుత్వం అనుమ‌తించింది. తెలంగాణ‌లో సినిమాని ఎంక‌రేజ్ చేస్తుంటే ఏపీలో తొక్కేయ‌డం స‌రికాద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అభిప్రాయ‌ప‌డుతున్నాయి. జ‌న‌వ‌రి 11న టికెట్ రేట్లు తేలుస్తామ‌ని చెబుతున్నా కానీ ఆరోజు కూడా స‌మ‌స్య ప‌రిష్కార‌మ‌వుతుంద‌న్న న‌మ్మ‌కం ఇప్ప‌టికి ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో లేదు. ఇది చ‌ర్చ‌ల‌కే ప‌రిమిత‌మ‌వుతుంద‌న్న ఆందోళ‌న నెల‌కొంది. ఇక ప్ర‌భుత్వంపై ప‌వ‌న్ క‌ల్యాణ్ - నాని - సిద్ధార్థ్ లాంటి హీరోలు బాహాటంగా విమ‌ర్శ‌లు గుప్పించ‌డం ఆ న‌లుగురు తీవ్ర ఆందోళ‌నను వ్య‌క్తం చేయ‌డం వ‌గైరా స‌న్నివేశాన్ని అమాంతం మార్చేశాయ‌న్న చ‌ర్చా సాగుతోంది. కొంద‌రు ఏపీ ప్ర‌భుత్వాన్ని దువ్వే ప్ర‌య‌త్నం చేసినా అదేదీ ఫ‌లించ‌డం లేదు. మీటింగుల‌తో కాల‌యాప‌న త‌ప్ప ప్ర‌యోజ‌నం క‌నిపించ‌డం లేద‌న్న ఆవేద‌న ప‌లువురిలో వ్య‌క్త‌మ‌వుతోంది.
Tags:    

Similar News