ఎస్వీఆర్ బుక్ స‌రే.. న‌ట‌వార‌సులెక్క‌డ‌?

Update: 2019-06-08 04:24 GMT
ఎన్టీఆర్ - ఏఎన్నార్ వంటి దిగ్గ‌జాల‌కు స‌మ‌కాలికుడిగా ఎస్వీఆర్ సుప‌రిచితం. స‌హ‌జ‌సిద్ధ‌మైన న‌ట‌న‌తో ఎన్నో విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌ల‌కు ప్రాణ‌ప్ర‌తిష్ఠ చేసిన గొప్ప న‌టుడిగా ఆయ‌న పేరు తెచ్చుకున్నారు. ఎస్వీ రంగారావు ఏ పాత్ర‌లో రంగ ప్ర‌వేశం చేసినా ఆ పాత్ర‌లో ఎమోష‌న్ అంత అద్భుతంగా పండించేవారు. అందుకే ద‌శాబ్ధాలు గ‌డిచినా అభిమానుల్లో నిరంత‌రం ఆయ‌నో హాట్ టాపిక్. అయితే ఎస్వీఆర్ జీవితంపై ఇప్ప‌టివ‌ర‌కూ పూర్తి స్థాయి పుస్త‌కం ఏదీ రాలేద‌న్న అసంతృప్తి అభిమానుల్లో ఉంది. ఆ అసంతృప్తిని తొల‌గించే ప్ర‌య‌త్నం నేటికి జ‌రిగింద‌ని చెబుతున్నారు సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ కం ర‌చ‌యిత సంజ‌య్ కిషోర్.

తాజాగా ఎస్వీఆరో ఫోటో బయోగ్ర‌ఫీని `మ‌హాన‌టుడు` టైటిల్ తో పుస్త‌క రూపంలో  నేడు మెగాస్టార్ చిరంజీవి చేతుల‌మీదుగా లాంచ్ చేస్తున్నామ‌ని ర‌చ‌యిత సంజ‌య్ వెల్ల‌డించారు. ``ప్ర‌స్తుతం మార్కెట్లో ఫోటో బ‌యోగ్ర‌పీలు ఉన్నా అవ‌న్నీ చిన్న కాపీ టేబుల్ బుక్స్ లా ఉన్నాయి త‌ప్ప పూర్తి స్థాయిలో లేవు. నా కాలేజ్‌ డేస్ లో యస్వీఆర్ పై `విశ్వనట చక్రవర్తి` అనే పుస్త‌కం రాశాను. దాన్ని గుమ్మడిగారు రిలీజ్‌ చేశారు. ఆ తర్వాత యస్వీఆర్‌ గారి ఫొటో బయోగ్రఫీ ప‌నులు ప్రారంభించాను. ఆ  టైమ్ లోనే ఏఎన్నార్ `నా పుస్తకం కూడా వేయకపోయావా` అనడంతో `మన అక్కినేని` పుస్తకం రాశాను. `విశ్వనట చక్రవర్తి` పుస్తకం రాసే సమయంలో సేక‌రించిన ఫొటోలతో స‌మ‌గ్రంగా బుక్‌ కోసం ఐదేళ్లు హార్డ్ వ‌ర్క్ చేశాను. ఆ ప‌ని అనంత‌రం మ‌రో బుక్ ని ఎస్వీఆర్ పై లాంచ్ చేస్తున్నాం. యస్వీఆర్ అభిమానులంతా లైబ్రరీలో దాచుకునేంత మంచి పుస్త‌క‌మిది`` అని తెలిపారు.

మ‌హాన‌టుడు బుక్ లాంచ్ సంద‌ర్భంగా ఎస్వీఆర్ అభిమానుల్లో మ‌రో ఆస‌క్తిక‌ర చ‌ర్చ మొద‌లైంది. ఎస్వీఆర్ ఫ్యామిలీ నుంచి ఆయ‌న మ‌న‌వ‌డు రంగారావు అప్ప‌ట్లో హీరో అయ్యారు. అయితే ఆశించిన విజ‌యాలు ద‌క్క‌లేదు. ఆ త‌ర్వాత రంగారావు కొన్ని క్యారెక్ట‌ర్లు చేశారు.. కానీ నిరాశే మిగిలింది. ప్ర‌స్తుతం ఆ కుటుంబం నుంచి ప‌రిశ్ర‌మ‌లో ఎవ‌రూ లేనేలేరు.. ఉనికి లేక‌పోవ‌డంపై ఫ్యాన్స్ లో కొంత నిరాశ ఉంది. ఎస్వీఆర్ పెద్ద మ‌న‌వ‌డు అప్ప‌ట్లో ఓ మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ.. తాత గారి పేరు నిల‌బెట్టాల‌ని భావించి సొంత బ్యాన‌ర్ స్థాపించామ‌ని... అయితే మా తండ్రి గారైన కోటేశ్వ‌ర‌రావు చిన్న వ‌య‌సులో ఉన్న‌ప్పుడే మ‌ర‌ణించ‌డంతో ఇండ‌స్ట్రీలో స‌రైన అండ‌దండ‌లు లేకుండా పోయాయ‌ని తెలిపారు. త‌న సోద‌రుడు ఎస్వీ రంగారావును హీరోగా ప‌రిచ‌యం చేస్తూ సొంత బ్యాన‌ర్ లోనే సినిమాని ప్రారంభించారు.  అయితే ఎందుక‌నో ఆ సినిమా ఆశించిన విజ‌యం సాధించ‌లేదు. అటుపై మ‌రోసారి ఎస్వీఆర్ ఫ్యామిలీ న‌టుల‌కు సంబంధించిన ఉనికి క‌నిపించ‌లేదు.  

    
    
    

Tags:    

Similar News