‘లెజెండ్’ నటుడి హఠాన్మరణం

Update: 2018-03-14 09:17 GMT
నందమూరి బాలకృష్ణ ‘లెజెండ్’ సినిమాలో ఒక కేంద్ర మంత్రిని కలవడం.. ట్రైన్ కథ చెప్పడం.. ఆ సీన్ గుర్తుండే ఉంటుంది. ఆ సన్నివేశంలో కేంద్రమంత్రి పాత్రలో కనిపించే నటుడు హఠాత్తుగా కన్ను మూశాడు. ఈ ప్రముఖ బాలీవుడ్ నటుడి పేరు నరేంద్ర ఝా. ‘లెజెండ్’ కంటే ముందు ‘ఛత్రపతి’ సినిమాలోనూ నరేంద్ర నటించాడు. అందులో ఇంటర్వెల్ ఫైట్లో ప్రభాస్ చంపే పాత్ర చేసింది అతనే. 55 ఏళ్ల నరేంద్ర ఝా గుండెపోటుతో బుధవారం హఠాత్తుగా కన్నుమూశాడు. తెలుగులో ‘లెజెండ్’.. ‘ఛత్రపతి’ మాత్రమే కాక.. ‘యమదొంగ’లోనూ ఒక పాత్ర చేశాడు నరేంద్ర.

బాలీవుడ్లో నరేంద్రకు మంచి పేరే ఉంది. అతను గత ఏడాది సూపర్ హిట్టయిన హృతిక్ రోషన్ సినిమా ‘కాబిల్’ పోలీస్ ఆఫీసర్ పాత్రలో మెరిశాడు. ఆ పాత్ర అతడికి చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘రేస్-3’లో నరేంద్ర ఝా నటిస్తున్నాడు. అతడి పాత్ర చిత్రీకరణ ఇంకా పూర్తి కాలేద. అది మధ్యలో ఉండగానే నరేంద్ర చనిపోయాడు. 2002లో ‘ఫంటూష్’ సినిమాతో నటుడిగా పరిచయమమయ్యాడు నరేంద్ర. ఆ తర్వాత అతను ‘హైదర్’.. ‘రయీస్’.. ‘మొహెంజదారో’ లాంటి భారీ చిత్రాల్లో నటించాడు. ఇటీవలే శ్రీదేవి మరణంతో దిగ్భ్రాంతికి గురైన బాలీవుడ్ కు నరేంద్ర హఠాన్మరణం మరో షాకే.

Tags:    

Similar News