కోబ్రా పోస్ట్‌: పార్టీల ప్ర‌చారానికి ఎవ‌రెంత నొక్కారు?!

Update: 2019-02-20 09:45 GMT
టైమ్ చూసి టైమ్ బాంబ్ పేల్చింది కోబ్రా పోస్ట్. రానున్న లోక్ స‌భ ఎన్నిక‌ల నేప‌థ్యంలో రాజ‌కీయ పార్టీలతో అంట‌కాగే సినిమా వాళ్ల‌ను గురి చూసి కొట్టింది. రాజ‌కీయాలు- రంగుల ప్ర‌పంచం మ‌ధ్య ఉన్న అవినాభావ సంబంధాల్లో కాసుల గ‌ళ‌గ‌ళ‌ల‌కు ఆస్కారం ఉన్న స‌రైన టాపిక్ ని ఎంచుకుని తెలివిగా ఆటాడింది. ఈ ఆట‌లో పావులుగా మారిన బాలీవుడ్ స్టార్లు ప్ర‌స్తుతం ఏం చేయాలో పాలుపోని స‌న్నివేశంలో గిజగిజ‌లాడ‌టం ప్ర‌ముఖంగా చ‌ర్చ‌కొచ్చింది. స్టింగ్ ఆప‌రేష‌న్ పేరుతో కోబ్రా పోస్ట్ ప‌లువురు తార‌ల పుట్టి ముంచేట్టే క‌నిపిస్తోంది.

ప్ర‌స్తుతం కోబ్రా పోస్ట్ ఆప‌రేష‌న్ వ్య‌వ‌హారంపై టీవీ చానెళ్ల‌లో వాడి వేడిగా డిబేట్ ర‌న్ అవుతోంది. సామాజిక మాధ్య‌మాల ద్వారా ప్ర‌జ‌ల్ని త‌ప్పు దోవ ప‌ట్టిస్తున్న‌ మొత్తం 36 మంది బాలీవుడ్ సెల‌బ్రిటీల పేర్ల‌ను బ‌య‌ట‌పెట్టింది కోబ్రా పోస్ట్. రాజ‌కీయ పార్టీల నుంచి ఎవ‌రెవ‌రు ఎంత తీసుకున్నారు? ఏఏ మార్గాల్లో ఆ సొమ్ము అందుతోంది? అన్న‌ది డీటెయిల్డ్ గా కోబ్రా పోస్ట్ ఆప‌రేష‌న్ బ‌య‌ట‌పెట్టింది. ఏదో ఆరోపించ‌డ‌మే కాదు.. పూర్తిగా వీడియో ఆధారాల్ని ఈ ఆప‌రేష‌న్ లో సేక‌రించ‌డం సంచ‌ల‌నాల‌కు తావిస్తోంది.

సోష‌ల్ మీడియా విలువ‌ల్లేని (అన్ ఎథిక‌ల్) ప్ర‌చారంలో ఇంత‌కీ ఏ స్టార్ ఎంత మొత్తం గుంజుతారు? అని ప్ర‌శ్నిస్తే.. అందుకు స‌మాధానం వ‌చ్చింది. ప‌లు పీఆర్ ఏజెన్సీలు, మ్యానేజ‌ర్లు అందించిన లీకుల ప్ర‌కారం.. అలాగే స్టార్లు డైరెక్టుగా డిమాండ్ చేసే దానిని బ‌ట్టి ఆప‌రేష‌న్ లో ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలే బ‌య‌ట‌ప‌డ్డాయి. బాలీవుడ్ శృంగార తార స‌న్నీలియోన్ నెల‌కు రూ.75 ల‌క్ష‌ల చొప్పున సోష‌ల్ మీడియా ప్ర‌మోష‌న్స్ కు అందుకుంటోంది. 90 శాతం క్యాష్ రూపంలోనే ఇది ముడుతోంది. స‌న్నీ ఏ రాజ‌కీయ పార్టీకి అనుకూలం అన్న‌ది తేలాల్సి ఉంది.

స్టార్ హీరో వివేక్ ఒబేరాయ్ నెల‌కు రూ.80ల‌క్ష‌లు అందుకుంటున్నారు. 85 శాతం క్యాష్ రూపంలోనే అందుతోంది. ప్ర‌ముఖ సీనియ‌ర్ న‌టుడు శ‌క్తి క‌పూర్ నెల‌కు రూ.75ల‌క్ష‌లు అందుకుంటున్నారు. 90 శాతం క్యాష్ రూపంలోనే ఇవ్వాలి. రోహిత్ రాయ్ నెల‌కు రూ.30 ల‌క్ష‌లు చొప్పున ట్వీట్ల‌కు అందుకుంటున్నారు. గాయ‌కుడు బాబా సెహ‌గ‌ల్ ఒక్కో ట్వీట్ కి రూ.2ల‌క్ష‌లు అద‌నంగా జీఎస్టీ మొత్తం అందుకుంటారు. ఇత‌ర స్టార్లు ఎంత మొత్తాలు అందుకుంటారు? అన్నది తెలియాల్సి ఉంది. కోబ్రా పోస్ట్ ఎడిట‌ర్ అనిరుధ బెహ‌ల్ కి ఈ ఐడియా ఎలా వ‌చ్చింది? అంటే .. కొంద‌రు రిపోర్ట‌ర్లు త‌న‌ని క‌లిసి ఈ ఐడియాని ఇచ్చార‌ట‌. ఇదేదో బావుంది అని ఆప‌రేష‌న్ షురూ చేశార‌న్న‌మాట‌!!
Tags:    

Similar News