కిచ్చా సుదీప్ Vs అజయ్ దేవగన్..!

Update: 2022-04-27 13:57 GMT
ఇప్పుడు బాలీవుడ్ పై సౌత్ సినిమా డామినేషన్ కొనసాగుతోంది. మన సినిమాలు భాషాబేధం లేకుండా పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటుతున్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ.. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ళు కొల్లగొడుతున్నాయి. ఈ నేపథ్యంలో కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

ఇటీవల 'R' సినిమా ప్రారంభోత్సవంలో సుదీప్ మాట్లాడుతూ ''బాలీవుడ్ సినిమాలను తెలుగు, తమిళంలో డబ్బింగ్ చేస్తూ విజయం సాధించడానికి కష్టపడుతున్నారు. కానీ అది జరగడం లేదు. ఈ రోజు మనం ఎక్కడైనా సక్సెస్ అయ్యే సినిమాలు చేస్తున్నాము'' అని అన్నారు. 

అలానే 'కేజీఎఫ్ 2' బ్లాక్ బస్టర్ సక్సెస్ గురించి మాట్లాడుతూ ''హిందీ ఇకపై జాతీయ భాష కాదు'' అనే విధంగా కామెంట్స్ చేశారు. సుదీప్ వ్యాఖ్యలు నెట్టింట దుమారాన్ని రేపాయి. హిందీ వెర్సెస్ సౌత్ భాషలు అనే విధంగా సోషల్ మీడియాలో వార్ నడుస్తోంది. 

అయితే తాజాగా సుదీప్ కామెంట్స్ కు కౌంటర్ గా బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ చేసిన ట్వీట్ ఇప్పుడు అగ్నికి ఆజ్యం పోసినట్టుగా మారింది. సుదీప్‌ ను ట్యాగ్ చేస్తూ హిందీ ఇకపై జాతీయ భాష కాకపోతే.. కన్నడ చిత్రాలను హిందీలో ఎందుకు డబ్ చేస్తున్నారని ప్రశ్నించారు అజయ్ దేవగన్.

''సోదరా సుదీప్.. మీ అభిప్రాయం ప్రకారం హిందీ మన జాతీయ భాష కాకపోతే మీ మాతృభాషలో రూపొందే చిత్రాలను హిందీలో డబ్ చేసి ఎందుకు విడుదల చేస్తారు హిందీ ఇప్పటికీ, ఎప్పటికీ మన మాతృభాష.. జాతీయ భాష. జన గణ మన'' అని అజయ్ ట్వీట్ లో పేర్కొన్నారు.

అజయ్ ట్వీట్ కు సుదీప్ కూడా స్పందించారు. ''మన దేశంలోని ప్రతి భాషను నేను ప్రేమిస్తాను సార్. నేను ఆ మాటలను పూర్తిగా భిన్నమైన సందర్భంలో చెప్పాను. మీకు ఎల్లప్పుడూ చాలా ప్రేమ మరియు శుభాకాంక్షలు. త్వరలో మిమ్మల్ని కలుస్తానని ఆశిస్తున్నాను'' అని ట్వీట్ చేశారు.

''నమస్కారం అజయ్ దేవగన్ సార్.. నేను ఆ లైన్ ఎందుకు చెప్పాను అనేదానికి.. అది మీకు చేరిన విధానానికి పూర్తి భిన్నంగా ఉంది. వ్యక్తిగతంగా చూసినప్పుడు నేను ఆ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చానో బహుశా మీకు తెలుస్తుంది. ఇది బాధపెట్టడానికి, రెచ్చగొట్టడానికి లేదా ఏదైనా చర్చను ప్రారంభించడానికి చేయలేదు. అలా నేను ఎందుకు చేస్తాను సార్'' అని సుదీప్ మరో ట్వీట్ లో పేర్కొన్నారు.

''అజయ్ దేవగన్ సార్.. మీరు హిందీలో పంపిన టెక్స్ట్ నాకు అర్థమైంది. ఎందుకంటే మనమందరం హిందీని గౌరవించాము, ప్రేమించాము మరియు నేర్చుకున్నాము కాబట్టి. తప్పు లేదు సార్. కానీ నా రెస్పాన్స్ కన్నడలో టైప్ చేస్తే పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తున్నాను.!! మేము కూడా భారతదేశానికి చెందినవాళ్లమే కదా సార్'' అని సుదీప్ ట్వీట్ చేశారు. 

దీనికి అజయ్ దేవగన్ స్పందిస్తూ.. ''హాయ్ కిచ్చా సుదీప్.. మీరు ఒక స్నేహితుడిగా మిస్ అండర్ స్టాండింగ్ ని తొలగించినందుకు ధన్యవాదాలు. నేను ఎప్పుడూ సినిమా పరిశ్రమని ఒక్కటిగానే భావిస్తాను. మేము అన్ని భాషలను గౌరవిస్తాము. ప్రతి ఒక్కరూ మన భాషను కూడా గౌరవించాలని మేము ఆశిస్తున్నాము. బహుశా, అనువాదంలో ఏదో మిస్సై ఉండవచ్చు'' అంటూ ఈ ట్విట్టర్ డిబేట్ కి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు.
Tags:    

Similar News