పూరీతో లేదు కానీ క‌ర‌ణ్ తో ఉందిట‌!

Update: 2022-10-26 07:34 GMT
భారీ అంచ‌నాల న‌డుమ రిలీజైన పాన్ ఇండియ‌న్ చిత్రం `లైగర్` పరాజయం తర్వాత విజయ్ దేవరకొండ- పూరి జగన్నాథ్ ల రెండవ చిత్రం `జన గణ మన`కు బ్రేక్ ప‌డింద‌ని క‌థ‌నాలొచ్చాయి. నెగెటివ్ ఫ‌లితం వ‌చ్చాక ట్రేడ్ నుంచి పాజిటివిటీని ఆశించ‌డం పెద్ద త‌ప్పిద‌మే అవుతుందని ఆ ఇద్ద‌రూ భావించి ప్ర‌స్తుతానికి ఈ ప్రాజెక్టును ప‌క్క‌న పెట్టేశారని గుస‌గుస వినిపిస్తోంది.

అయితే విజయ్ బాలీవుడ్ కెరీర్ ఇంత‌టితో ముగిసినట్టు కాదు. డిజాస్ట‌ర్ లైగ‌ర్ తో ఆరంభ‌మైంది. కానీ న‌టుడిగా అత‌డికి హిందీ ప‌రిశ్ర‌మ‌లో గుర్తింపు ద‌క్కింది. దానికి తోడు కరణ్ జోహార్- దేవ‌ర‌కొండ‌ల‌ మధ్య స్నేహం చెక్కుచెదరలేదు. తాజా క‌థ‌నాల‌ ప్రకారం ఈ జోడీ త్వరలో ఒక రొమాంటిక్ చిత్రం కోసం క‌లిసి ప‌ని చేయ‌నున్నార‌ని తెలిసింది.

లైగర్ లో అనన్య పాండే క‌థానాయిక కాగా.. సీనియ‌ర్ న‌టి రమ్య కృష్ణన్ - రోనిత్ రాయ్ త‌దిత‌రులు న‌టించారు. ఇది అండర్ డాగ్ MMA ఫైటర్ చుట్టూ జ‌రిగే సంఘ‌ట‌న‌ల స‌మాహారంగా తెర‌కెక్కింది. ఇంటర్నేషనల్ ఫైటర్ మైక్ టైసన్ కూడా ఈ సినిమాలో ప్రత్యేక పాత్ర‌లో కనిపించారు. కానీ పేలవమైన స్క్రీన్ ప్లే ప్రేక్షకులను థియేటర్ లకు ర‌ప్పించ‌డంలో విఫలమైంది. భారీ బడ్జెట్ చిత్రం ట్రేడ్ విశ్లేషకుల ప్రకారం నష్టాలను చవిచూసింది.

ఇలాంటి అనుభవం తర్వాత విజయ్ - పూరీల తదుపరి చిత్రం ఇప్ప‌ట్లో సెట్స్ కెళ్లే అవ‌కాశం లేద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. నిజానికి ఈ సినిమా కోసం పూజా హెగ్డే ను క‌థానాయిక‌గా ఫైన‌ల్ చేసారు. కానీ పూజాకు ఇప్పట్లో ఆ అవ‌స‌రం ప‌డ‌ద‌ని టాక్ వినిపిస్తోంది. తాజా స‌మాచారం మేర‌కు... విజయ్  ఈ సినిమా చేయడం లేదు. బ్రోమాన్స్ ముగిసింది.

పూరి కాల్స్ కూడా విజయ్ ఎత్త‌డం లేద‌ని హిందీ మీడియా క‌థ‌నాలు రాస్తోంది. న‌ష్టాల‌కు చెల్లింపుల‌ విషయంలో ఇద్దరి మధ్య అవగాహన కుదిరిందని కూడా సమాచారం. ఈ సినిమా విడుదల తర్వాత విజయ్ తన చెల్లింపులో కొంత భాగాన్ని పొందవలసి ఉంది. ఇప్పుడు పూరీ తన చెల్లింపు ఒప్పందాన్ని పూర్తి చేయలేని స్థితిలో ఉన్నాడని కూడా టాక్ వినిపించింది. కానీ కరణ్ - విజయ్ కలిసి మరో ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్నారు. ఇది అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీతో రొమాంటిక్ టింజ్ తో అల‌రించ‌నుంద‌ని స‌మాచారం.

విజయ్ ప్రస్తుతం తన త‌దుప‌రి ప్రాజెక్ట్ పై దృష్టి సారించాడు. సమంతా ప్రభుతో కలిసి శివ నిర్వాణ దర్శకత్వంలో అత‌డు ఖుషీ అనే చిత్రంలో న‌టిస్తున్నాడు. ఖుషి డిసెంబర్ 23 న తెలుగు- తమిళం- మలయాళం - కన్నడ భాషలలో విడుదల కానుంది. పోస్టర్ చూస్తుంటే కాశ్మీర్ నేపథ్యంలో సాగే ప్రేమ క‌థాంశ‌మ‌ని అర్థ‌మ‌వుతోంది. ఈ చిత్రాన్ని హిందీలోకి అనువ‌దించి రిలీజ్ చేసేందుకు అవ‌కాశం ఉంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News