మరి బాలయ్య ఒప్పుకుంటాడా బోయపాటీ?

Update: 2016-01-03 11:30 GMT
బాలయ్య వందో సినిమా.. దీని గురించి రెండు మూడేళ్ల నుంచి చర్చ జరుగుతోంది. తెలుగు పరిశ్రమలో మరే హీరో వందో సినిమాకు లేనంత హంగామా బాలయ్య సెంచరీ మూవీ గురించి ఉండబోతోందనడంలో ఎవరికీ సందేహాల్లేవు. ఈ సినిమాకు దర్శకుడెవరు.. నిర్మాత ఎవరు.. హీరోయిన్లుగా ఎవరు నటిస్తారు.. టైటిల్ ఏంటి.. బాలయ్య ఎలాంటి కథ ఎంచుకుంటాడు.. అని కొన్నేళ్ల నుంచి చర్చ నడుస్తోంది నందమూరి అభిమానుల్లో. ఇప్పుడిక 99వ సినిమాను కూడా పూర్తి చేసి 100వ సినిమా ముంగిట నిలిచాడు బాలయ్య. ఇంతకుముందు సింహా - లెజెండ్ సినిమాల్లో బాలయ్యను అద్భుతంగా చూపించిన బోయపాటే 100వ సినిమాకు కూడా దర్శకుడని ముందే తేలిపోయింది. ఆ సినిమాకు ‘గాడ్ ఫాదర్’ అనే టైటిల్ కూడా ప్రచారంలోకి వచ్చింది.

బాలయ్య ‘డిక్టేటర్’ పూర్తి చేసి ఖాళీ అయిపోతుండగా.. ఇంకో నెలా రెండు నెలల్లో బోయపాటి కూడా ‘సరైనోడు’ నుంచి ఫ్రీ అవుతాడు. ఆ తర్వాత బాలయ్య వందో సినిమా మొదలవడమే తరువాయి అనుకున్నారు. కానీ ఇప్పుడేమో సడెన్ గా బెల్లంకొండ శ్రీనివాస్‌ తో ఇంతకుముందు అనుకున్న సినిమాను మళ్లీ మొదలుపెట్టడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు బోయపాటి. మరి బాలయ్య వందో సినిమా సంగతేంటన్నదే అర్థం కావడం లేదు. బోయపాటి పూరి జగన్నాథ్ లాగా వారం రోజుల్లో స్క్రిప్టు రాసి.. రెండు నెలల్లో సినిమా పూర్తి చేసే టైపు కాదు. దేనికైనా బాగా టైం పడుతుంది. మరి శ్రీనివాస్ సినిమా పూర్తి చేసి.. ఆ తర్వాత బాలయ్య సినిమాకు స్క్రిప్టు రాసి సినిమా మొదలుపెట్టాలంటే ఏడాది పైనే పడుతుంది. మరి బాలయ్య దీనికి ఒప్పుకుని అంత కాలం బాలయ్య ఖాళీగా ఉంటాడా.. నందమూరి అభిమానులు ఊరుకుంటారా?
Tags:    

Similar News