బ్రహ్మి సారూ.. మరీ ఎక్కువైపోలేదూ

Update: 2018-01-29 23:30 GMT
సీనియర్ స్టార్ కమెడియన్ బ్రహ్మానందం ఒకప్పుడు ఎంత బిజీగా ఉండేవారో తెలిసిందే. కానీ గత రెండు మూడేళ్లుగా ఆయన జోరు కనిపించడం లేదు. ఇంతకుముందు బ్రహ్మి లేకుండా ఏదైనా పెద్ద సినిమా వస్తే ఆశ్చర్యపోయేవాళ్లు. కానీ ఇప్పుడు ఏదైనా సినిమాలో బ్రహ్మి ఉంటేనే ఆశ్చర్యపోతున్నారు. సినిమాలు తగ్గిపోవడంతో సినిమా వేడుకల్లో కూడా బ్రహ్మానందం కనిపించడం తగ్గిపోయింది. ఆయన చాన్నాళ్ల తర్వాత మోహన్ బాబు కథానాయకుడిగా నటించిన ‘గాయత్రి’ సినిమా ఆడియో వేడుకలో తళుక్కుమన్నారు. ఈ వేడుకలో మోహన్ బాబును బ్రహ్మి పొగిడిన తీరుకు అందరూ షాకైపోయారు.

ఈ నెలలో తాను మోహన్ బాబును పొగడ్డం ఇది మూడోసారో.. నాలుగో సారో అని.. జనాలు వీడికింకేం పనిలేదా ఎప్పుడూ మోహన్ బాబును పొగుడుతూనే ఉంటాడే అని అనుకున్నా పర్వాలేదని.. తాను మోహన్ బాబు గురించి గొప్పగా చెప్పాల్సిందే అని మొదలుపెట్టి మరీ కలెక్షన్ కింగ్ ను బ్రహ్మి పొగడ్డం విశేషం. ఈ మాటలన్నీ ఓకే కానీ.. మోహన్ బాబు ఫిలిం నగర్ దేవాలయాల ఛైర్మన్ కావడం గురించి స్పందిస్తూ.. మోహన్ బాబు క్రమశిక్షణకు మారు పేరు కాబట్టి ఆయన వస్తున్నాడంటే దేవుళ్లు సైతం వీడితే ఎందుకులే అనుకుని.. సర్దుకుని చక్కగా నిలబడతారేమో అని బ్రహ్మి వ్యాఖ్యానించేశాడు. దేవుళ్ల భయాన్ని అభినయించి కూడా చూపించాడు బ్రహ్మి. ఎంత సరదాకి అన్నా కూడా మోహన్ బాబును పొగడ్డానికి మరీ ఇంత ఫ్రీడమ్ తీసుకోవాలా.. దేవుళ్లను కూడా తగ్గించేయాలా అన్న అభిప్రాయాల్లో జనాల్లో వ్యక్తమవుతున్నాయి. అవకాశాలు లేని తనకు మంచు ఫ్యామిలీ ‘గాయత్రి’తో పాటు ‘ఆచారి అమెరికా యాత్ర’లో కీలక పాత్రలు ఇచ్చేసరికి బ్రహ్మి ఇలా మాట్లాడాడన్న కామెంట్లు పడుతున్నాయి సోషల్ మీడియాలో.
Tags:    

Similar News