బ్రహ్మి ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా?

Update: 2016-10-25 17:30 GMT
బ్రహ్మానందం మూడేళ్ల కిందటి వరకు ఎంత బిజీగా ఉండేవాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అప్పట్లో ఏ పెద్ద సినిమా అయినా బ్రహ్మానందం ఉండాల్సిందే. బ్రహ్మి లేకుండా ఏదైనా పెద్ద సినిమా వస్తే ఆశ్చర్యపోయేవాళ్లం. కానీ ఇప్పుడు పరిస్థితి తిరగబడింది. ఏదైనా పెద్ద సినిమాలో బ్రహ్మి ఉంటేనే ఆశ్చర్యపోతున్నాం. దశాబ్దాల తరబడి తీరిక లేకుండా పని చేసిన బ్రహ్మికి ఇప్పుడు చాలా రోజులే ఖాళీ దొరుకుతోందని సమాచారం. ఈ గ్యాప్‌ లో ఆయన ఓ సినిమాకు దర్శకత్వం చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారని.. ‘జబర్దస్త్’ భామలు అనసూయ.. రష్మి అందులో ముఖ్య పాత్రలు చేస్తారని రెండు రోజులుగా వార్తలు వస్తున్నాయి.

ఈ వార్తల మీద బ్రహ్మి స్పందించాడు. తాను డైరెక్షన్ చేయట్లేదని తేల్చేశాడు. తాను ప్రస్తుతం ఏం చేస్తున్నది కూడా బ్రహ్మి వెల్లడించాడు. ‘‘నేను డైరెక్షన్ చేయాలనుకోవడం లేదు. ఒకవేళ డైరెక్టర్ అవ్వాలనుకుంటే ఎప్పుడో అవ్వాల్సింది. ఇప్పుడు ఆ పని చేయాల్సిన అవసరం లేదు. నేను ఎన్నాళ్లుగానో పద్యాలు రాస్తున్నాను. ఇప్పుడూ రాస్తున్నాను. ఇప్పటివరకూ వాటిని బయటికి తేలేదు. త్వరలోనే వాటన్నింటినీ కలిపి ఒక పుస్తకంగా వేయాలని అనుకుంటున్నాను’’ అంటూ దర్శకత్వం గురించి వస్తున్న రూమర్లకు చెక్ పెట్టాడు బ్రహ్మి. ఓవైపు తన చేతిలో ఉన్న సినిమాలు చేసుకుంటూ.. మరోవైపు ఈ పద్యాలు రాసుకుంటూ.. ఇంకో వైపు తన కొడుకు గౌతమ్ చేస్తున్న కొత్త సినిమా వ్యవహారాల్ని పరిశీలిస్తున్నాడట బ్రహ్మి. కొత్త దర్శకుడు ఫణీంధ్ర నరిశెట్టి డైరెక్షన్లో గౌతమ్ ఓ సినిమా చేస్తున్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News