రామ్ చరణ్ కొత్త సినిమా ‘బ్రూస్ లీ’ ఇంకో మూడు వారాల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తమిళ మార్కెట్ పై కన్నేస్తున్న మిగతా హీరోల బాటలోనే రామ్ చరణ్ కూడా తన కొత్త సినిమాను భారీ స్థాయిలో తమిళనాట విడుదల చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఐతే ‘బ్రూస్ లీ’ టైటిల్ విషయంలో అతడికి పెద్ద చిక్కొచ్చి పడింది. తమిళంలో ఆల్రెడీ జి.వి.ప్రకాష్ కుమార్ హీరోగా ‘బ్రూస్ లీ’ టైటిల్ తో ఓ సినిమా మొదలైంది. అదో సెటైరికల్ కామెడీ. ఇప్పటికే ఆ టైటిల్ అక్కడ బాగా పాపులరైంది. మరి రామ్ చరణ్ ఏం చేయాలి? అందుకే బాగా ఆలోచించి చించి.. చివరికి ‘బ్రూస్ లీ-2’ అనే టైటిల్ పెట్టారు.
కానీ ఇదేదో బ్రూస్ లీ సినిమాకు సీక్వెల్ అన్నట్లు బ్రూస్ లీ-2 అని పెట్టడమే చిత్రంగా తోస్తోంది. బ్రూస్ లీ అనే టైటిల్ ఆల్రెడీ అక్కడ ఓ సినిమాకు పెట్టేసినపుడు ఇంకేదైనా పేరు పెట్టడం పెద్ద కష్టమా? అలా ఆలోచించకుండా బ్రూస్ లీ-2 అని పెట్టాలన్న ఆలోచన ఎవరిదో మరి. మొత్తానికి ఈ పేరు తమిళ ఆడియన్స్ కు అదోలా అనిపిస్తోందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. బాహుబలి తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్టవడం, శ్రీమంతుడు కూడా ఓ మాదిరి ప్రభావం చూపించడంతో ఆ ఊపులో ‘బ్రూస్ లీ-2’ కూడా రామ్ చరణ్ కు మంచి మార్కెట్ తెస్తుందని ఆశిస్తున్నారు. ఇప్పటికే రామ్ చరణ్ నటించిన మగధీర - రచ్చ - ఎవడు - గోవిందుడు అందరివాడేలే సినిమాలు తమిళంలోకి అనువాదమయ్యాయి.