'పుష్ప-1' తర్వాత 'ఐకాన్'.. బన్నీ లైనప్ పై బన్నీ వాస్ క్లారిటీ..!

Update: 2021-06-11 07:38 GMT
అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' అనే యాక్షన్ ఎంటర్టైనర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎర్ర చందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. కరోనా లాక్‌ డౌన్ నేపథ్యంలో షూటింగ్‌ ల‌కు ప‌ర్మిష‌న్ వచ్చిన వెంటనే 'పుష్ప 1' సినిమాను పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే దీని త‌ర్వాత బన్నీ చేయబోయే సినిమాల లైనప్ పై ఇంతవరకు క్లారిటీ రాలేదు. రోజుకో రూమర్ వస్తూనే ఉంది కానీ, బన్నీ టీమ్ దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే బన్నీ స్నేహితుడు, జీఏ2 నిర్మాత బ‌న్నీ వాస్ రీసెంట్‌ గా ఓ ఇంట‌ర్వ్యూలో స్టైలిష్ స్టార్ తదుపరి సినిమాలపై స్పష్టత ఇచ్చారు.

'పుష్ప 1' తర్వాత అప్పట్లో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ప్రకటించిన 'ఐకాన్ - కనబడుటలేదు' మూవీ చేయనున్నట్లు బన్నీ వాస్ వెల్లడించారు. ఆ తర్వాతే 'పుష్ప 2' సినిమా ఉంటుందని.. ఇదే క్రమంలో ఏఆర్ మురగదాస్ - బోయపాటి శ్రీను - కొరటాల శివ - ప్రశాంత్ నీల్ లతో ప్రాజెక్ట్స్ ఉండే అవకాశం ఉందని నిర్మాత తెలిపారు. బన్నీ వాస్ మాట్లాడుతూ.. ''పుష్ప చిత్రాన్ని రెండు భాగాలుగా మారుతుందని మేం ఊహించలేదు. ఇప్పుడు రెండో భాగానికి సంబంధించిన కథపై కసరత్తులు చేయాల్సి ఉంది. అందుకే 'పుష్ప 1' పూర్తి కాగానే 'ఐకాన్' ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తారు. ఇది పూర్తి కాగానే మళ్ళీ 'పుష్ప‌ 2' పై ఫోక‌స్ పెడ‌తారు. ఈ లైనప్ లో ఎలాంటి మార్పు ఉండదు'' అని అన్నారు.

''అలానే మురుగ‌దాస్ తో ఓ సినిమా చేయాల్సి ఉంది. గీతా ఆర్ట్స్ లో బోయపాటి శ్రీను తో ఓ సినిమా చేయాలి. ఈ రెండింటిలో ఏది ముందు సెట్స్ పైకి వెళ్తుందనేది అప్పటి పరిస్థితులను బట్టి ఉంటుంది. కొరటాల శివ తో చేయాల్సిన సినిమా కూడా ఖచ్చితంగా ఉంటుంది. ప్రశాంత్ నీల్ తో కూడా చర్చలు జరుగుతున్నాయి'' అని బన్నీ వాస్ చెప్పుకొచ్చారు. దీనిని బట్టి చూస్తే బన్నీ గ్యాప్ లేకుండా అగ్ర దర్శకులందరితో వరుసగా సినిమాలు చేయడానికి రెడీ అయ్యారని అర్థమవుతోంది.
Tags:    

Similar News