కాలా ఫంక్షన్.. రజనీపై తీవ్ర విమర్శలు

Update: 2018-05-09 04:17 GMT
రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్నానని ప్రకటించిన కొంత కాలానికే తనలోని రాజకీయ కోణాన్ని చూపించాడు సూపర్ స్టార్ రజనీ కాంత్. కావేరీ జల వివాదానికి సంబంధించిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన సగటు రాజకీయ నాయకుడి లాగే మాట్లాడాడు. తమిళనాట కావేరీ జలాలకు సంబంధించి ఆందోళనలు నడుస్తున్న నేపథ్యంలో జనాలు ఐపీఎల్ మ్యాచ్‌లను ఎంజాయ్ చేసే.. సెలబ్రేట్ చేసుకునే పరిస్థితి లేదని.. మ్యాచ్‌లను ఈ నగరం నుంచి తరలించాలని ఆయన డిమాండ్ చేశారు. మిగతా రాజకీయ పార్టీల స్వరం కూడా ఇలాగే ఉండటంతో చివరికి వాళ్ల డిమాండే ఫలించింది. చెన్నై సూపర్ కింగ్స్ ఆడాల్సిన ఐపీఎల్ మ్యాచ్‌లన్నింటినీ చెన్నై నుంచి పుణెకు తరలించేశారు. ఈ విషయంలో రజనీ వైఖరిని చాలామంది తప్పుబట్టారు.

కట్ చేస్తే.. శుక్రవారం రజినీ కొత్త సినిమా ‘కాలా’ ఆడియో వేడుకను చెన్నైలో నిర్వహించబోతున్నారు. ఈ వేడుకకు దాదాపు పది వేల మంది రజనీ అభిమానుల్ని ఆహ్వానించారు. రజనీ సినిమా వేడుకకు ఆ మాత్రం జనం వస్తే హంగామా ఎలా ఉంటుందో చెప్పేదేముంది? ‘కాలా’కు ఆశించిన స్థాయిలో బజ్ లేని నేపథ్యంలో కొంచెం గట్టిగానే ఈ కార్యక్రమం చేయాలనుకుంటున్నాడు నిర్మాత ధనుష్. మరి ఇప్పటికైతే కావేరీ సమస్య పరిష్కారం కాలేదు. ఇంకా తమిళనాట ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. మరి ఇప్పుడు తన సినిమా వేడుకను రజనీ ఎలా చేస్తాడన్న ప్రశ్న మొదలైంది. ఇప్పుడు మాత్రం జనాలు సెలబ్రేషన్ మూడ్లో ఉన్నారా అని ప్రశ్నిస్తున్నారు రజనీ వ్యతిరేకులు. ఇంకో నాలుగు వారాల్లో ‘కాలా’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రజనీ సినిమా వస్తే ఎలాంటి సెలబ్రేషన్స్ ఉంటాయో తెలిసిందే. అప్పటికి మాత్రం కావేరీ సమస్య పరిష్కారమైపోతుందా? మరి సినిమా రిలీజ్ చేసుకోవడానికి మాత్రం ఆ సమస్యతో సంబంధం లేదా అంటున్నారు. తన సినిమా విషయానికి వచ్చేసరికి స్వార్థం చూపిస్తున్నాడంటూ రజనీపై దుమ్మెత్తి పోస్తున్నారు ఆయన వ్యతిరేకులు.
Tags:    

Similar News