ఓటీటీలో 'బూతు' ఇక బంద్.. కేంద్రం ప్రత్యేక నిఘా

Update: 2020-11-11 08:10 GMT
ఒకప్పుడు ఏదైనా వివాదాస్పద అంశాన్ని సినిమాగా తీయడానికి ఇండస్ట్రీ పెద్దలు జంకేవారు. ఎందుకంటే అది పూర్తయిన తర్వాత విడుదలను అడ్డుకుంటామని భయం ఉండేది. అందుకే సినీ పెద్దలు వివాదాస్పద అంశాలు, బయోపిక్ లు, పురాణ, ఇతిహాసాలు వంటి వాటిని చిత్రాలుగా తీస్తే.. ఏదో ఒక అంశం మారిపోయింది అంటూ గొడవలు సృష్టించే అవకాశం ఉండడంతో నిర్మాతలు దర్శకులు సేఫ్ జోన్ లోనే సినిమాలు తీసుకునేవారు. ఇక సినిమాల్లో అశ్లీలత ఎక్కువగా ఉంటే సెన్సార్ బోర్డు సభ్యులు అటువంటి దృశ్యాలను తొలగించేవారు. లేకపోతే అసలు సినిమా విడుదలకు ఒప్పుకునేవారు కాదు. అందువల్లే నిర్మాతలు దర్శకులు కూడా రొమాన్స్ శాతం మరి శృతి మించకుండా జాగ్రత్తలు తీసుకునేవారు. అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది.

సోషల్ మీడియాలోనూ సినిమాలు ప్రదర్శించే స్థాయికి సాంకేతిక నైపుణ్యం పెరిగిపోయింది. ప్రతి ఒక్కరు చేతిలో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. కాగా కరోనా పరిస్థితుల నేపథ్యంలో థియేటర్లన్నీ మూతపడగా.. సినిమాల విడుదలకు ఓటీటీ వేదికలు దిక్కుగా మారాయి. దీంతో విడుదల ఆగిపోయిన సినిమాలు, కొత్త సినిమాలను ఇందులోనే విడుదల చేస్తున్నారు. కాగా ఓటీటీల్లో సినిమాలు, షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సీరిస్ ల ప్రదర్శనకు సెన్సార్ బోర్డు అనుమతులు అవసరం లేదు. దీంతో కొందరు అశ్లీల కంటెంట్ తో జనంలో ఆకట్టుకునేందుకు ఆ టైపు సినిమాలు తీయడం మొదలుపెట్టారు. రామ్ గోపాల్ వర్మ వంటి వారు వరుసగా అలాంటి సినిమాలు చేస్తూ ఓటీటీ ద్వారా విడుదల చేసుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. రొమాన్స్ పాళ్ళు పెంచుతూ ఇప్పుడు కొత్త కొత్త కథలు పుట్టుకు వస్తున్నాయి. అటువంటి సినిమాల నిర్మాణం ఊపందుకుంది. కొందరైతే అశ్లీల కంటెంట్ తో వెబ్ సిరీస్ లు ప్లాన్ చేస్తున్నారు.

సందట్లో సడేమియాగా డిజిటల్ మీడియా, వెబ్ పోర్టల్స్ లలో కూడా అశ్లీల దృశ్యాలు అధికమయ్యాయి. కొన్ని డిజిటల్ మీడియాల్లో ప్రత్యేకంగా బూతు కంటెంట్ ఉండే వీడియోలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక వెబ్ పోర్టల్ ఏది ఓపెన్ చేసినా ఓ పక్కన సెక్సీ ఇమేజ్ ఫోటోలు దర్శనమిస్తున్నాయి. మనం ఏ సమాచారం కోసమైన సెర్చ్ చేస్తున్నా, స్మార్ట్ ఫోన్లను తాకినా ఈ రొమాంటిక్ దృశ్యాలే కనిపిస్తున్నాయి.

ఇప్పుడు వీటన్నిటికి ఆట కట్టించేందుకు. కేంద్ర ప్రభుత్వం తాజాగా తెరలు చేపట్టింది. ఓటీటీలు, డిజిటల్ మీడియా, వెబ్ పోర్టల్స్ లో పెరిగిపోతున్న అశ్లీలత కట్టడికి కేంద్రం చర్యలు చేపట్టింది. ఆన్‌లైన్ ఛానళ్లు ఏ అంశాలను ప్రసారం చేస్తున్నాయి అనే విషయమై.. ఇకపై కేంద్రం ప్రత్యేకంగా నిఘా పెట్టనుంది. కొత్తగా ఎవరైనా ఆన్‌లైన్‌ ఛానల్స్‌ ప్రారంభించాలంటే అనుమతి తీసుకోవాల్సిందేనని తాజాగా ఆదేశాలు జారీ చేసింది. యూట్యూబ్‌ ఛానల్స్‌, ఓటీటీ కంటెంట్‌లను సమాచార శాఖ పరిధిలోకి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది.

ఓటీటీల్లో శృతి మించి అశ్లీలత కంటెంట్ ని ప్రదర్శిస్తున్నారని, సోషల్ మీడియాలో ఉప్పల్ యాప్ లు కూడా పనికట్టుకుని ఈ పనికి పాల్పడుతున్నాయని పలువురు విమర్శలు చేయడంతో పాటు, వాటికి కూడా సెన్సార్ ఉంటే మేలని డిమాండ్ చేయడంతో కేంద్రం ఈ చర్యలకు పూనుకుంది. ఇకపై కేంద్ర ప్రభుత్వం ఈ సోషల్ మీడియా యాప్ లు, డిజిటల్, వెబ్ పోర్టల్స్, ఓటీటీ లపై ఓ కన్ను వేయనుంది.
Tags:    

Similar News