సినిమా చూసి డిసైడ్ చేయండి- చందూ మొండేటి

Update: 2016-10-03 17:42 GMT
‘ప్రేమ‌మ్’ లాంటి క్లాసిక్స్ ను రీమేక్ చేయ‌డం సాహ‌స‌మే అని చెప్పాలి. ఈ మ‌ల‌యాళ సినిమా సౌత్ ఇండియ‌న్ ఆడియ‌న్స్ మీద వేసిన ముద్ర అలాంటిలాంటిది కాదు. దీన్ని ఓ సినిమా లాగా కాకుండా ఒక ప్ర‌త్యేక‌మైన‌ అనుభూతి లాగా ఫీల‌య్యారు చాలామంది ప్రేక్ష‌కులు. ఈ నేప‌థ్యంలోనే ‘ప్రేమ‌మ్‌’ను తెలుగులోకి రీమేక్ చేయ‌డం కొంద‌రికి రుచించ‌లేదు.

దీంతో సోష‌ల్ మీడియాలో ట్రోల్స్ మొద‌లుపెట్టారు. ప్ర‌ధానంగా మ‌ల‌యాళ వెర్ష‌న్ కు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచిన మ‌లార్ పాత్రను పోషించిన శ్రుతి హాస‌న్ ను టార్గెట్ చేసుకున్నారు. ఈ విష‌య‌మై ద‌ర్శ‌కుడు చందూ మొండేటి ఓపెన్ అయ్యాడు. ముందే ఓ అభిప్రాయానికి రావ‌డం స‌రికాద‌ని.. ‘ప్రేమ‌మ్’ తెలుగు వెర్ష‌న్ చూశాక స్పందించాల‌ని కోరాడు.

‘‘ప్రేమ‌మ్ అనే కాదు.. ఏ సినిమాను రీమేక్ చేసినా ఒరిజిన‌ల్ తో పోలిక‌లు రావ‌డం స‌హజం. మేమేమీ ఇండ‌స్ట్రీకి కొత్త‌వాళ్లం కాదు. ఇలాంటి వాటికి బాధ‌ప‌డిపోం. నా దృష్టిలో మ‌న వాళ్లలో 5 శాతం మంది మాత్ర‌మే ‘ప్రేమ‌మ్’ మ‌ల‌యాళ వెర్ష‌న్ చూసి ఉంటారు. వాళ్లంద‌రికీ నేను చెప్పేదొక‌టే. ప్రేమ‌మ్ తెలుగు వెర్ష‌న్ చూశాక మేం స‌రిగా చేశామో లేదో డిసైడ్ చేయాలి’’ అని చందూ మొండేటి అన్నాడు.

స్వ‌త‌హాగా తాను రొమాంటిక్ స్క్రిప్టులు రాయ‌డంలో అంత ప‌ర్ఫెక్ట్ ఏమీ కాద‌ని.. ఐతే వేరొక‌రు రాసిందాన్ని మెరుగులు దిద్ద‌గ‌ల‌న‌ని చెప్పిన చందూ.. తొలి సినిమా ‘కార్తికేయ‌’ త‌ర్వాత‌ ‘ప్రేమ‌మ్’ త‌నేంటో రుజువు చేసుకోవ‌డానికి ద‌క్కిన మ‌రో అవకాశ‌మ‌ని చెప్పాడు.
Tags:    

Similar News