కేసీఆర్ నేషనల్ పాలిటిక్సు వెనుక బాబు స్కెచ్

Update: 2018-03-05 16:38 GMT
చిన్న రాష్ట్రాల్లో బీజేపీ నెరుపుతున్న రాజకీయం చూసి తెలంగాణ సీఎం కేసీఆర్‌ కు దడపుడుతోంది. ఆ రాజకీయ చక్రం తమవైపు కూడా ఎప్పుడో ఒకప్పుడు దూసుకురావొచ్చన్న భయం ఆయనకు మొదలైందని.. అందుకే ఇప్పుడీ రివర్స్ పాలిటిక్సు మొదలుపెట్టారని తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే ఏపీలో చంద్రబాబుకు ఈ సెగ మొదలవడంతో ఆయన కూడా కేసీఆర్‌ ను ముందు పెట్టి బీజేపీని ఎదుర్కొనే వ్యూహ రచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆ క్రమంలోనే కేసీఆర్ సడెన్‌ గా థర్డ్ ఫ్రంట్ ప్రస్తావన తెచ్చారని తెలుస్తోంది.
    
ఒకప్పుడు 42 లోక్ సభ సీట్లున్న ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కువ సీట్లు గెలిచిన పార్టీకి నేషనల్ పాలిటిక్సులో ఎప్పుడూ వెయిట్ ఉండేది. కానీ.. ఇప్పుడు ఏపీలో 25 - తెలంగాణలో 17 సీట్లు మాత్రమే ఉన్నాయి. పైగా టీడీపీ - టీఆరెస్‌ లకు గత ఎన్నికల్లో వచ్చినన్ని సీట్లు ఈసారి వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. దీంతో రాష్ట్రాలుగా విడిపోయినా రాజకీయంగా కలిసుండి జాతీయ పార్టీలను ఎదుర్కొనేందుకు ఇద్దరు చంద్రుళ్లు పథక రచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
    
ఏపీలో చంద్రబాబు - బీజేపీల పొత్తు తెగితే మోదీ-షా ద్వయం ఇంతకాలం వదిలేసినట్లుగా ఏపీని వదిలేయరు. త్రిపుర - యూపీ ఫార్ములాలన్నీ ఇక్కడా ప్రయోగించి చంద్రబాబును ఉక్కిరిబిక్కిరి చేయడం ఖాయం. అలాగే.. తెలంగాణలోనూ కేసీఆర్‌కు అక్కడ బీజేపీతో - కాంగ్రెస్ రెండిటితోనూ ముప్పు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ - టీఆరెస్‌ లు  ఏకతాటిపై ఉండి కనీసం ఒక 25 సీట్లు తెచ్చుకున్నా కొంత వెయిట్ ఉంటుందనే ఆలోచనకు వచ్చినట్లుగా తెలుస్తోంది.
    
అయితే... చంద్రబాబుకు దేశంలోని వివిధ పార్టీలతో మంచి సంబంధాలున్నాయి. అలాంటప్పుడు ఆయన కాకుండా కేసీఆర్‌ను ముందుకు పెట్టి థర్డ్ ఫ్రంట్ ఫార్మేషన్‌ కు వెళ్లరన్న వాదనా ఒకటుంది. కానీ.. చంద్రబాబు సామర్థ్యాన్ని నమ్మినా ఆయన్ను నమ్మని పార్టీలున్నాయి. మరీ ముఖ్యంగా ఆయన గత కొద్దికాలంగా మోదీని ఎదుర్కోలేక సతమతమవుతున్న తీరును దేశమంతా గమనిస్తోంది. ఈ నేపథ్యంలో కారణాలేవైనా మోదీకి ఆయన ఎదురునిలవలేరన్న భావన చాలా పార్టీల్లో ఉంది. అది చంద్రబాబుకు కూడా తెలుసు. ఆ కారణంగానే ఇప్పుడు కొత్త ముఖం కేసీఆర్‌ ను పెట్టి చంద్రబాబు రాజకీయం మొదలుపెట్టారన్న వాదన ఒకటి వినిపిస్తోంది. కేసీఆర్ ప్రకటనకు పార్టీల నుంచి వచ్చే స్పందన ఆధారంగా అవసరమైతే చంద్రబాబు కూడా బయటపడి కీలకమయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
Tags:    

Similar News