దక్షిణాది హవాకు చెక్ పెట్టేదెలా? YRF బిగ్ ప్లాన్స్!
అయితే ఈ రికార్డుల్ని బ్రేక్ చేయాలని ప్రతిసారీ బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ YRF ప్రయత్నిస్తూనే ఉంది. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ ఇదే కేటగిరీకి చెందినది.
గత కొంతకాలంగా ఉత్తరాదిన దక్షిణాది సినిమా హవా కొనసాగిస్తోంది. బాహుబలి, KGF, పుష్ప ఫ్రాంచైజీలు నార్త్ బెల్ట్ లో బాక్సాఫీస్ వద్ద ఆధిపత్యం చెలాయించాయి. అయితే ఈ రికార్డుల్ని బ్రేక్ చేయాలని ప్రతిసారీ బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ YRF ప్రయత్నిస్తూనే ఉంది. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ ఇదే కేటగిరీకి చెందినది.
YRF స్పై యూనివర్స్ పుట్టుకొచ్చే వరకు `బాహుబలి` భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన ఫ్రాంచైజీగా నిలిచింది. కేవలం రెండు సినిమాలతోనే రూ.2,300 కోట్లకు పైగా సంపాదించింది. పుష్ప సిరీస్ రెండు సినిమాల నుండి రూ.2,000 కోట్లతో ఎలైట్ క్లబ్‌లో చేరింది. తరువాత KGF రూ.1,500 కోట్లతో రేసులోకి వచ్చింది. బాలీవుడ్ నుంచి రోహిత్ శెట్టి కాప్ యూనివర్స్ సినిమాల(సింగం ఫ్రాంఛైజీ సహా)న్నీ కలుపుకుని రూ.1,430 కోట్లు వసూలు చేసాయి. శెట్టీస్ యూనివర్స్ ఫ్రాంచైజీలో రెండు కంటే ఎక్కువ సినిమాలు వచ్చాయి.
అయితే ఉత్తరాదిన దక్షిణాది హవాను తగ్గించడమెలా? అంటే వైఆర్ఎఫ్ తన స్పై యూనివర్శ్ తోనే సమాధానం చెప్పాలని బలంగా లక్ష్యం పెట్టుకుందని టాక్. ఇందులో భాగంగానే బాలీవుడ్‌లోని అతిపెద్ద స్టార్లు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్‌లను బరిలో దించింది. వీరి కలయికలో భారీ స్పై సినిమాలను నిర్మిస్తోంది. అయితే బాలీవుడ్ దిగ్గజ హీరోలంతా కలిసినా కానీ, దక్షిణాది హవాను ఆపలేని స్థితి. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ లోని అన్ని సినిమాలు కలుపుకుంటేనే ప్రపంచవ్యాప్తంగా రూ.2,900 కోట్లు వసూలు చేయగలిగాయి. దానికోసం యూనివర్స్‌లో ఐదు సినిమాలు చేయాల్సి వచ్చింది. సల్మాన్ ఖాన్ నటించిన మూడు టైగర్ సిరీస్ చిత్రాలు ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై , టైగర్ 3, హృతిక్ రోషన్ నటించిన వార్, షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ .. వీటన్నిటి వసూళ్లను కలుపుకున్నా 3000 కోట్లు సాధించలేకపోయింది.
వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ మూడు టైగర్ సిరీస్ చిత్రాలు కలిపి రూ. 1,366 కోట్లు ఆర్జించగా, షారుఖ్ ఖాన్ పఠాన్ ప్రపంచవ్యాప్తంగా రూ.1,050 కోట్ల వసూళ్లను నమోదు చేసింది. హృతిక్ రోషన్ `వార్` ఈ ఫ్రాంచైజీకి ప్రపంచవ్యాప్తంగా మరో రూ.475 కోట్లు జోడించింది. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ లో ఐదు సినిమాల వసూళ్లు కలుపుకుని ప్రపంచవ్యాప్తంగా రూ.2,900 కోట్లు మాత్రమే. నిజానికి వైఆర్.ఎఫ్ లో వచ్చిన ఈ సినిమాలన్నీ భారతీయ గూఢచారుల కథలతో విడివిడిగా వచ్చాయి. ప్రారంభంలో దీనిని యూనివర్శ్ కేటగిరీగా భావించలేదు. ఒకదానితో ఒకటి సంబంధం లేకుండానే సారూప్యత ఉన్న థీమ్‌లు ఉన్నాయి కానీ విశ్వం కాన్సెప్ట్ అప్పటికి ఆదిత్య చోప్రా మైండ్ లో లేదు. అయితే మహమ్మారి సమయంలో పరిస్థితి మారిపోయింది. స్పై కాన్సెప్టులతో వచ్చిన ఈ సినిమాలన్నిటినీ ఒక విశ్వంలో చేర్చి పాత్రలను, పాత్రధారులను కలిపి కొనసాగింపు కథలతో సినిమాలను తెరకెక్కించాలనే ఆలోచన వైఆర్.ఎఫ్ కి వచ్చింది. అదే క్రమంలో 2023లో `పఠాన్` అధికారికంగా క్రాస్ఓవర్లు , అతిధి పాత్రలతో ఫ్రాంచైజీని ఏకం చేసి వైఆర్ఎఫ్- స్పై యూనివర్స్‌కు పునాది వేసింది. ఆ తరవాత టైగర్ 3 కోసం ఫ్రాంఛైజీ కథలను కొనసాగిస్తోంది.
అయితే వైఆర్ఎఫ్ నుంచి వచ్చిన అన్ని సినిమాలను పుష్ప ఫ్రాంఛైజీ సవాల్ చేసింది. కేవలం ఏడాదిన్నర రెండేళ్ల గ్యాప్ లోనే పుష్ప తర్వాత పుష్ప 2 విడుదలై అద్భుత కలెక్షన్లతో సంచలనం సృష్టించింది. `పుష్ప 2 ది రూల్` సాధించిన విజయం చాలా ప్రశ్నలను లేవనెత్తింది. ఇప్పుడు వైఆర్ఎఫ్ బాలీవుడ్ గూఢచర్య సామ్రాజ్యం ఎంత ఎత్తుకు ఎగరగలదు? అన్నదానిపైనా ఆసక్తి నెలకొంది.
వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ ఈ సంవత్సరం రూ.3,000 కోట్లు, రూ.4,000 కోట్ల మైలురాళ్లను అధిగమించే వీలుంది. ఈ యూనివర్శ్ లో రెండు ప్రధాన చిత్రాలు ఈ ఏడాది భారీగా విడుదల కానున్నాయి. ఈ రెండూ రిలీజైతే, మొత్తం ఏడు సినిమాలతో వైఆర్ఎఫ్ సుమారు 4000 కోట్లను వసూలు చేసే వీలుంది. రానున్న చిత్రాల్లో మొదటిది వార్ 2. ఇందులో హృతిక్ రోషన్ కబీర్ పాత్రను తిరిగి పోషించగా, టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ ఇందులో కీలక పాత్ర పోషించడం సౌత్ లో వసూళ్లకు కలిసొస్తుందని అంచనా.. ఈ చిత్రం అక్టోబర్ 2025లో పాన్ ఇండియన్ కేటగిరీలో విడుదలవుతుంది. ఆ తర్వాత డిసెంబర్ 25న, ఫ్రాంచైజ్.. మొదటి మహిళా ప్రధాన చిత్రం `ఆల్ఫా`ను విడుదల చేస్తుంది. అలియా భట్ , శార్వరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఆల్ఫా వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్‌కు ఒక బోల్డ్ ఎటెంప్ట్ కానుంది. లేడీ స్పై పాత్రలతో ఇది కొత్త అధ్యాయాన్ని లిఖిస్తుందని అంచనా వేస్తున్నారు.