సైప్‌కి 25ల‌క్ష‌లు మంజూరు ఎలా? బీమా కంపెనీపై డౌట్!

బాలీవుడ్ న‌టుడు సైఫ్ అలీ ఖాన్ కత్తిపోటు కేసు విచార‌ణ కొన‌సాగుతోంది. ఈ కేసులో ర‌క‌ర‌కాల ట్విస్టులు బ‌య‌ట‌ప‌డుతున్నాయి.

Update: 2025-01-27 04:15 GMT

బాలీవుడ్ న‌టుడు సైఫ్ అలీ ఖాన్ కత్తిపోటు కేసు విచార‌ణ కొన‌సాగుతోంది. ఈ కేసులో ర‌క‌ర‌కాల ట్విస్టులు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. ఇప్పుడు సైఫ్ అలీఖాన్ ఆస్ప‌త్రిలో చేరాక కొన్ని గంట‌ల వ్య‌వ‌ధిలోనే బీమా సంస్థ 25ల‌క్ష‌లు మంజూరు చేయ‌డంపై ప‌లువురు నిల‌దీస్తున్నారు. గత వారం బాంద్రాలోని లీలావతి ఆసుపత్రిలో నటుడు సైఫ్ అలీ ఖాన్‌కు నగదు రహిత చికిత్స కోసం రూ. 25 లక్షల త్వరగా మంజూరు చేయడంపై భారత బీమా నియంత్రణ మరియు అభివృద్ధి ప్రాధికార సంస్థ (IRDAI)ను ఏఎంసి నిలదీసింది. 14,000 మంది నిపుణులతో కూడిన అసోసియేషన్ ఆఫ్ మెడికల్ కన్సల్టెంట్స్ ని ఏఎంసిగా పేర్కొంటున్నారు.

సెలబ్రిటీలకు ఉన్న ప్రాధాన్య‌త‌, సామాన్యుల‌కు ఉంటుందా? అనే ప్ర‌శ్నను ఏఎంసీ లేవ‌నెత్తింది. గంటల్లోనే క్లెయిమ్ మంజూరు చేయ‌డ‌మెలా? అని ప్ర‌శ్నించింది. ఇంత వేగంగా క్లెయిమ్ ఆమోదం అనేది సామాన్య పాలసీదారులకు చాలా సందర్భాలలో సులువు కాదు. క్లెయిమ్ ని ఆమోదించ‌డంలో వ్యవస్థాగత అసమానతను ఇది ఎత్తి చూపిందని బీమా నిపుణుడు నిఖిల్ ఝా వ్యాఖ్యానించారు. సామాన్యుల విషయంలో బీమా కంపెనీ క్లెయిమ్ చెల్లించి ఉండేది కాదని కూడా ఆయన అన్నారు. డ‌బ్బు, ప‌లుకుబ‌డి ఉన్న హై క్లాస్ వ్యక్తులకు ప్రాధాన్యతను ఇవ్వడం ఆరోగ్య వ్యవస్థలో న్యాయం - సమానత్వం పై సందేహాల్ని లేవనెత్తుతుందని ఆయన వాదించారు. ``సైఫ్ అలీ ఖాన్ చికిత్స కోసం లీలావతి ఆసుపత్రికి బీమా కంపెనీ కొన్ని గంటల్లోనే 25 లక్షలు మంజూరు చేసింది. మెడికోలీగల్ కేసులలో FIR కాపీని అడగడం సాధారణ ప్రక్రియ. బీమా కంపెనీ దానిని ప‌ట్టించుకోకుండా 25 లక్షలకు నగదు రహిత అభ్యర్థనను వెంటనే ఆమోదించింది`` అని ఝా X పోస్ట్‌లో తెలిపారు.

సైఫ్ అలీ ఖాన్ చికిత్స సమయంలో ఆరోగ్య బీమా క్లెయిమ్ కి సంబంధించిన కీల‌క‌ వివరాలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. అత‌డు రూ. 35.95 లక్షల క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకోగా, రూ. 25 లక్షలు ఇప్పటికే ఆమోదించార‌ని బీమా సంస్థ ధృవీకరించింది. సెల‌బ్రిటీల‌కైతే ఒక రూలు, సామాన్యుల‌కైతే ఒక రూల్ ఉంటుందా? అంటూ ఇక ప్ర‌శ్న ఇప్పుడు స‌మాధానం లేనిదిగా మారింది. ఇది మ‌నుషుల్లో పేద ధ‌నిక తార‌త‌మ్యాన్ని, అస‌మానతను ఎత్తి చూపుతోంది.

Tags:    

Similar News