జమిలి జపం వదిలేసినట్లేనా ?

Update: 2021-05-29 02:30 GMT
'మూడేళ్ళు కళ్ళు మూసుకుంటే మళ్ళీ ఎన్నికలు వస్తాయి'..ఇది తాజాగా రెండు రోజుల మహానాడు సందర్భంగా నేతలను ఉద్దేశించి చంద్రబాబునాయుడు చెప్పిన మాటలు. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను విన్నతర్వాత గతంలో చేసిన జమిలి ఎన్నికల జపాన్ని వదిలేసినట్లే అర్ధమవుతోంది. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన కొద్దిరోజల నుండి తొందరలోనే జమిలి ఎన్నికలు వస్తాయనే జపాన్ని చంద్రబాబునాయుడు ఎన్నిసార్లు జపించారో లెక్కలేదే.

జమిలి ఎన్నికలు వచ్చేస్తాయి, వైసీపీ ఓడిపోతుంది, మనమే అధికారంలోకి రాబోయేది అంటు ఎన్నిసార్లు పార్టీ నేతలతో చంద్రబాబు చాలాసార్లే చెప్పారు. ఎందుకంటే ఒకానొక సమయంలో నరేంద్రమోడి కూడా జమిలి ఎన్నికలపై ఒకసారి మాట్లాడారు. దాంతో అదే విషయాన్ని చంద్రబాబు పదే పదే ప్రస్తావించారు. నేతలకు సంబంధించిన ఏ సమావేశమైనా అప్పట్లో జమిలి ఎన్నికలగురించి మాట్లాడకుండా సమావేశాన్ని ముగించేవారు కాదు.

అలాంటిది మహానాడు మొదటిరోజు మాట్లాడుతు మరో మూడేళ్ళు మనం కళ్ళు మూసుకుంటే ఎన్నికలు వచ్చేస్తాయని, టీడీపీనే అధికారంలోకి రాబోయేదని స్పష్టంగా చెప్పారు. చంద్రబాబు తాజా వ్యాఖ్యలు విన్నతర్వాత జమిలి ఎన్నికల జపానికి స్వస్తిచెప్పినట్లు అర్ధమైపోతోంది. ఎందుకంటే మొన్ననే జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి తలబొప్పి కట్టింది.

అతిపెద్ద రాష్ట్రమైన పశ్చిమబెంగాల్లో అధికారంలోకి రావటానికి నరేంద్రమోడి, అమిత్ షా శతవిధాల ప్రయత్నాలు చేశారు. అయితే మమతాబెనర్జీ ముందు వాళ్ళపప్పులుడకలేదు. ఇదే సమయంలో దేశంలో కరోనా వైరస్ మొదటి+రెండో విడత తీవ్రత పెరిగిపోవటంతో జనాల్లో మోడిపై విపరీతమైన వ్యతిరేకత వచ్చేసింది. ఐదురాష్ట్రాల ఎన్నికలు, కుంభమేళా కారణంగా కరోనా వైరస్ సెకెండ్ వేవ్ ను కావాలనే మోడి నిర్లక్ష్యం చేశారనే కోపం జనాల్లో బాగా పెరిగిపోతోంది. కాబట్టి జమిలి విషయంలో  మోడి వెనక్కు తగ్గినట్లే అనిపించటంతో బహుశా చంద్రబాబు కూడా షెడ్యూల్ ఎన్నికలకే ఫిక్స్ అయినట్లు అర్ధమవుతోంది.
Tags:    

Similar News