ఏపీ సీఎం చంద్రబాబునాయుడు జీవిత చరిత్రపై వస్తున్న చంద్రోదయం సినిమా ఏప్రిల్ 20న ఆయన పుట్టిన రోజు నాడు రిలీజ్ కానుంది. చంద్రబాబు పాత్రలో రఘువర్మ అనే నటుడు నటించినట్లు తెలుస్తోంది.
కాగా ఈ సినిమాకు కథ - దర్శకత్వం - నిర్మాత అంతా పసుపులేటి వెంకటరమణ. శుక్రవారం విజయవాడలోని ఘంటసాల ప్రభుత్వ సంగీత కళాశాలలో ఈ సినిమా టీజర్ విడుదల చేశారు. తెలుగుదేశం ప్రభుత్వ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ రాళ్లపల్లి సుధారాణి - సామాజిక ఆరోగ్య శాఖ చైర్మన్ నారా సుబ్రహ్మణ్యం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కాగా చంద్రబాబుకు ఇప్పటికే ఈ సినిమా టీజర్ చూపించారట. ఆయన ఓకే చెప్పడంతో ఆయన పుట్టిన రోజునాడే విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట. మరోవైపు విజయవాడ కేంద్రంగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేయడం కూడా ఆసక్తి రేపుతోంది. అయితే.. తొలిసారి చంద్రబాబుపై ఓ సినిమా వస్తుండడంతో ఇది ఎంతవరకు హిట్టవుతుందో అన్న చర్చ మొదలైంది. పార్టీ వర్గాల నుంచి ఆదరణ ఉంటుందన్న అంచనాలున్నప్పటికీ విడుదలైతే కానీ - సినిమా సత్తా ఎంతో చెప్పలేని పరిస్థితి.
మరోవైపు ఈ సినిమా టీజర్ రావడంతో సెటైర్ లూ మొదలయ్యాయి. దీనికి ఏపీ ప్రభుత్వం వినోదపు పన్ను రాయితీ ఇస్తుంది.. ఏపీలో ఈ సినిమా కోసం చంద్రన్న సినిమా టిక్కెట్ పథకం పెడతారని సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.