ఉదయ్ కిరణ్ పేరెత్తితే ఆమె బోరుమంది

Update: 2018-06-06 07:54 GMT
చిత్రం.. నువ్వు నేను.. మనసంతా నువ్వే.. ఒకదాన్ని మించిన హిట్ ఇంకోటి. మైలురాళ్ల లాంటి ఈ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లోకి చొచ్చుకెళ్లాడు ఉదయ్ కిరణ్. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ రంగంలోకి అడుగుపెట్టి శరవేగంగా ఎదిగాడు. హీరోగా మరో స్థాయికి వెళ్తాడనుకుంటే.. పాపం వరుస ఫ్లాపులు.. వ్యక్తిగత జీవితంలో ఒడుదొడుకులు తోడై మరుగున పడిపోయాడు. చివరికి అనూహ్య పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. అందరినీ విషాదంలో ముంచెత్తాడు. ఉదయ్ కష్టాల్లో ఉన్నపుడు ఇండస్ట్రీ జనాలు అతడిని పెద్దగా పట్టించుకోలేదు. చనిపోయాక మాత్రం అందరూ అయ్యో ఇలా అయిపోయాడే అనుకున్నారు. ఐతే ఇండస్ట్రీలో ఉదయ్‌ కి అసలు సన్నిహితులే లేరనేమీ అనుకోవడానికి లేదు. ఉదయ్ ని వ్యక్తిగతంగా కూడా అభిమానించి.. అతడిని ఆదరించిన వాళ్లలో సీనియర్ నటి సుధ ఒకరు.

ఉదయ్ కి తొమ్మిది సినిమాల్లో సుధ తల్లిగా నటించడం విశేషం. సినిమాల్లోనే కాక బయట కూడా ఉదయ్.. ఆమెను అమ్మా అనే పిలిచేవాడట. ఉదయ్ తన కడుపున పుట్టకపోయినా అతడిని కొడుకు లాగే చూసేదాన్నని సుధ తాజాగా ఓ కార్యక్రమంలో చెప్పారు. ఉదయ్ పేరెత్తితే తాను తట్టుకోలేనంటూ ఆమె బోరున ఏడ్చేశారు. తల్లిని కోల్పోయి.. తండ్రికి కూడా దూరమైన ఉదయ్ ను ఒక దశలో దత్తత తీసుకోవాలని అనుకున్నట్లు సుధ చెప్పారు. ఉదయ్ కెరీర్ ఏమంత బాగా లేనపుడు ఒక సినిమా షూటింగ్ సందర్భంగా వచ్చి అమ్మా అమ్మా అంటూ గట్టిగా పట్టుకుని ఏడ్చేసినట్లు సుధ చెప్పారు. కానీ ఏమైందో చెప్పమంటే మాత్రం ఏమీ చెప్పకుండా తన మనసులోనే బాధ దాచేసుకున్నాడని.. తర్వాత ఆ చెడు నిర్ణయం తీసుకున్నాడని సుధ చెప్పారు. తనకు అతడి బాధేంటో తెలిసి ఉంటే ఇలా జరగనిచ్చేదాన్ని కాదంటూ ఆమె తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
Tags:    

Similar News