చరణ్‌ శంకర్‌ ల మూవీ రెగ్యులర్‌ షూటింగ్‌ అప్‌డేట్‌

Update: 2021-10-10 02:30 GMT
మెగా హీరో రామ్ చరణ్‌ మరియు సౌత్ స్టార్‌ డైరెక్టర్ శంకర్ ల కాంబోలో రూపొందుతున్న సినిమా ఇటీవలే లాంచనంగా పూజా కార్యక్రమాలు జరిగిన విషయం తెల్సిందే. రికార్డు బ్రేకింగ్‌ బడ్జెట్‌ తో దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. దిల్‌ రాజు బ్యానర్‌ లో ఇది 50వ సినిమాగా రూపొందుతుంది. కనుక ఆయన చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ సినిమాను ఆయన నిర్మిస్తున్నాడు. శంకర్ సినిమాలు అంటే భారీతనం.. భారీ సెట్‌ లు.. భారీ పాటలు ఉంటాయి. వాటన్నింటిని చరణ్‌ సినిమాలో ఎప్పుడెప్పుడు చూస్తామా అంటూ అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తి అయినట్లుగా తెలుస్తోంది.

ఇండస్ట్రీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ను దసరా తర్వాత ఇదే నెలలో అంటే అక్టోబర్ 21 నుండి ప్రారంభించబోతున్నట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్‌ శివారులో వేసిన భారీ సెటింగ్ ల్లో ఈ సినిమాను చిత్రీకరించబోతున్నారు. అయితే మొదటి షెడ్యూల్‌ ను మాత్రం పూణెలో ప్లాన్‌ చేయడం జరిగింది అంటూ యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. రికార్డు బ్రేకింగ్‌ బడ్జెట్‌ మరియు భారీ స్టార్‌ కాస్ట్‌ ఉన్న ఈ సినిమా షూటింగ్‌ కు చాలా సమయం పడుతుందని ముందు నుండే యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. శంకర్ సినిమా అంటే ఏళ్లకు ఏళ్లు పడుతుందని అంటారు. కాని ఈ సినిమాను వచ్చే ఏడాది చివరి వరకు ముగించేయాలనే పట్టుదలతో శంకర్ ఉన్నారు. ఈ సినిమాలో వీఎఫ్‌ఎక్స్ వర్క్‌ ఎక్కువగా ఉండదు కనుక ఏళ్లకు ఏళ్లు పట్టదనే నమ్మకంను కొందరు వ్యక్తం చేస్తున్నారు.

రామ్ చరణ్‌ ఆర్ ఆర్ ఆర్ సినిమా సంక్రాంతి ముందు విడుదలకు అంతా సిద్దం అయ్యింది. శంకర్ సినిమా మొదటి షెడ్యూల్‌ ను నవంబర్‌ లో ముగించుకుని ఆ తర్వాత నుండి సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో చరణ్ పాల్గొనబోతున్నాడు. శంకర్ తో రెండవ షెడ్యూల్ ను జనవరి చివర్లో మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మొత్తానికి చరణ్‌ శంకర్‌ మూవీ పట్టాలెక్కబోతున్న విషయం అభిమానులకు ఆనందంను కలిగిస్తుంది. ఈ సినిమాలో చరణ్‌ కు జోడీగా కియారా అద్వానీ నటించగా ముఖ్య పాత్రలో సునీల్‌ మరియు శ్రీకాంత్ లు నటించనున్నారు. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ సినిమా కథ ఏంటీ అనే విషయమై పలు రకాల చర్చలు నడుస్తున్నాయి. పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ సినిమా పై మెగా అభిమానులు చాలా ఆశలే పెట్టుకున్నారు.
Tags:    

Similar News