చరణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో..?

Update: 2022-09-13 05:08 GMT
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'ఆర్.ఆర్.ఆర్' సినిమాతో పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. రామరాజుగా అద్భుతమైన నటన కనబరిచి, అన్ని వర్గాల ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నాడు. అప్పట్లో 'తుఫాన్' మూవీతో బాలీవుడ్ లో భారీ డిజాస్టర్ చవిచూసిన చరణ్.. ఈసారి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకుని తన సత్తా ఏంటో చూపించాడు. దీంతో ఇప్పుడు చెర్రీ తదుపరి ప్రాజెక్ట్స్ పై అందరి దృష్టి పడింది.

RRR తర్వాత పాన్ ఇండియా క్రేజ్ ను కాపాడుకునేలా చరణ్ స్క్రిప్ట్స్ ఎంపిక చేసుకుంటున్నాడు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఓ భారీ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల కానుంది. అయితే దీని తర్వాత మెగా వారసుడు ఏ డైరెక్టర్ తో వర్క్ చేయబోతున్నాడనే దానిపై క్లారిటీ రావడం లేదు.

నిజానికి #RC15 తర్వాత 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి తో ఓ సినిమా చేస్తున్నట్లు చరణ్ గతేడాదే ప్రకటించారు. యూవీ క్రియేషన్స్ ఈ ప్రాజెక్ట్ ని బ్యాంక్ రోల్ చేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుందని భావిస్తుండగా.. చెర్రీ ప్రస్తుతానికి ఈ చిత్రాన్ని హోల్డ్ లో పెట్టాలని నిర్ణయించుకున్నాడని రూమర్స్ వినిపిస్తున్నాయి.

గౌతమ్ ఫైనల్ వెర్షన్ స్క్రిప్టు సంతృప్తికరంగా లేకపోవడమే దీనికి కారణంగా నివేదికలు పేర్కొంటున్నాయి. దీంతో ఇప్పుడు రామ్ చరణ్ తన తదుపరి ప్రాజెక్ట్ కోసం పలువురు దక్షిణాది దర్శకులతో సమావేశం అవుతున్నారని టాక్ నడుస్తోంది. ఓవైపు #RC15 పనులను పర్యవేక్షిస్తూనే.. మరోవైపు కొత్త కథలను వింటున్నాడని అంటున్నారు.

శంకర్ ఇటీవల 'ఇండియన్ 2' చిత్రాన్ని తిరిగి ప్రారంభించడంతో.. RC15 తాజా షెడ్యూల్ ను ముగించిన తర్వాత చెర్రీ కి కాస్త విరామం దొరికింది. అయితే ఈ బ్రేక్ టైమ్ లో వివిధ దర్శకులను కలుస్తూ తనకు దొరికిన సమయాన్ని చాలా ఎఫెక్టివ్ గా ఉపయోగించుకుంటున్నాడని తెలుస్తోంది. అయితే చరణ్ స్టార్ డైరెక్టర్స్ తో కాకుండా.. యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ తో చర్చలు చర్చలు జరుపుతున్నారు.

కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ తో చరణ్ ఓ మూవీ చేస్తారని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న దర్శకుడు.. భవిష్యత్ లో కచ్చితంగా చెర్రీ తో సినిమా ఉంటుందని స్పష్టం చేశాడు. కాకపోతే ఈ కాంబినేషన్ ఇప్పుడప్పుడే సెట్ అయ్యే అవకాశాలు లేవు.

ఈ నేపథ్యంలో మరో తమిళ టాలెంటెడ్ డైరెక్టర్ ఒకరు రామ్ చరణ్ తో ఓ పాన్ ఇండియా చేయడానికి ఆసక్తిగా ఉన్నారని.. ఇప్పటికే మెగా హీరోని కలిసి కథను వినిపించాడని టాక్ వచ్చింది. ఇక 'మఫ్తీ' తో సంచలనం సృష్టించిన కన్నడ దర్శకుడు నర్తన్.. ఓ సినిమా కోసం ఇటీవల రామ్ చరణ్ ను కలిసాడని వార్తలు వచ్చాయి.

అలానే పలువురు టాలీవుడ్ యువ దర్శకులు కూడా చరణ్ ను కలుస్తున్నారని.. అందులో 'ఛలో' ఫేమ్ వెంకీ కుడుముల కూడా ఉన్నారని అంటున్నారు. మెగాస్టార్ చిరంజీవితో ఓ ప్రాజెక్ట్ సెట్ చేసుకున్న వెంకీ.. ఆయన తనయుడిని కూడా ఓ మంచి స్క్రిప్ట్ తో మెప్పించాడని చెబుతున్నారు.

ఇలా రామ్ చరణ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ పై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కాకపోతే తదుపరి మూవీ ఎవరితో ఉంటుందనే దానిపై స్పష్టత రావడం లేదు. గౌతమ్ తిన్ననూరి సినిమా ఉందో లేదో తెలియక.. నెక్స్ట్ డైరెక్టర్ ఎవరో క్లారిటీ లేక మెగా అభిమానులు గందరగోళానికి గురవుతున్నారు. వీలయినంత త్వరగా #RC16 పై ప్రకటన చేయాలని వారు కోరుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News