`మా` ఆఫీస్ అపార్ట్ మెంట్ ని కారుచౌకగానే..!

Update: 2021-07-03 06:29 GMT
`మా` ఎన్నికలు టాలీవుడ్ లోనే కాదు.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్ గా మారాయి. నిజానికి తారల మధ్య జరిగే పోటీని ప్ర‌జ‌లు ఆసక్తిగా గమనించటం మొదట్నించి వస్తున్నదే. అయితే.. ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగితే మహా అయితే సింగిల్ కాలమ్.. లేదంటే డబుల్ కాలమ్ వార్తగా మిగిలిపోయేది. ఎప్పుడైతే ఎన్నికలు.. పోటీ జరుగుతుందో అప్పుడు చాలానే అంశాలు తెర మీదకు వస్తాయి. తాజాగా ఎన్నిక‌ల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ప‌డిన వేళ మా గ‌త ఉదంతాలు ఒక్కొక్క‌టిగా తెర‌పైకొస్తున్నాయి.

ఇప్పటివరకు ‘మా’ అసోసియేషన్ కు సరైన భవనం లేదని.. దాన్ని  ఏర్పాటు చేసుకోలేదన్న విషయం ప్రతి ఎన్నికల సందర్భంలో చర్చకు వస్తుంది. ఒక దాని తర్వాత మరొక కార్యవర్గం మారినా.. మా అసోసియేషన్ బిల్డింగ్ కల మాత్రం మారదు. ఇదిలా ఉంటే.. గతంలో ‘మా’ అసోసియేషన్ ఆఫీస్ కోసం ఒక సింగిల్ బెడ్రూం ప్లాట్ ను కొనుగోలు చేయటమే కాదు.. దాన్ని అమ్మేశార‌న్న చాలా మందికి తెలీని ఓ కొత్త విషయం బయటకు వచ్చింది. అంతేకాదు.. ఈ సందర్భంగా జరిగిన డీల్ పైనా ఓ ప‌త్రికలో వ‌చ్చిన‌ క‌థ‌నం వేడి పెంచుతోంది.

స‌ద‌రు క‌థ‌నం వెల్ల‌డించిన వివ‌రాల‌ మేర‌కు.. నాగబాబు ‘మా’ అధ్యక్షుడిగా ఉన్న వేళ జూబ్లీహిల్స్ లోని ఒక ప్లాట్ ను రూ.45 లక్షలకు కొనుగోలు చేశారు.  దానికి రూ.50 లక్షల ఖ‌ర్చుతో ఇంటీరియర్స్ చేయించార‌ట‌. అయితే.. ఈ ఫ్లాట్ కొనుగోలు చేసే సమయంలో ప్రముఖ సీనియర్ నటుడు మురళీ మోహన్ తీవ్రంగా వ్యతిరేకించార‌ని స‌ద‌రు క‌థ‌నం వెల్ల‌డించింది. ఎగ్జిక్యూటివ్ కమిటీలో తీసుకున్న నిర్ణయం ప్రకారం దాన్ని కొనుగోలు చేసారట‌. అయితే ఈ ప్లాట్ పక్కనే మురికి కాలువ ఉండటంతో ఆఫీసుకు రావటానికి ఎవరూ ఇష్టపడే వారు కాదు. దీంతో నెలకు రూ.10వేల చొప్పున అద్దెకు ఇచ్చారు.

ఈ ప్లాట్ వల్ల వచ్చే అద్దె కంటే కూడా దానికి అవుతున్న ఖర్చులు ఎక్కువ అని తేల‌డంతో శివాజీ రాజా తాను అధ్యక్షుడిగా ఉన్న టైమ్ లో ఈ భవనాన్ని రూ.34లక్షలకు అమ్మేశారు.  అయితే అమ్మ‌కం ప్రాసెస్ లో కాస్త భిన్నంగా రిజిస్ట్రేషన్ ఖర్చును కొనేవాళ్లు కాకుండా `మా`నే భరించడం వివాదాస్ప‌ద‌మైంది. ఇంతకీ ఈ భవనాన్ని కొనుగోలు చేసింది ఎవరంటే.. `మా`కు డైరీలు ప్రింట్ చేసి ఇచ్చే వ్యక్తి అని స‌ద‌రు క‌థ‌నం పేర్కొంది. అందుకే కోటి రూపాయిలు ఖర్చు పెట్టిన ప్లాట్ ను కారుచౌకగా రూ.34 లక్షలకు అమ్మేశారని స‌ద‌రు క‌థ‌నం పేర్కొంది.  

ఈ అమ్మకంపై ఇప్పుడు ఎన్నిక‌ల వేళ‌ కొత్త‌గా విమర్శలకు ఆస్కారం ఉంది. పలువురు ఈ ఎపిసోడ్ ను తెరమీదకు తీసుకొచ్చి .. రూల్ పొజిషన్ ని చూస్తే.. బైలాస్ లో ఆస్తుల అమ్మకానికి సంబంధించి క్లాజ్ ఏదీ లేక‌పోవ‌డంపైనా చ‌ర్చ సాగుతోంది. దీంతో.. చట్టప్రకారం ఎలాంటి తప్పు లేనట్లే. కానీ.. ఎక్కువ విలువైన ఆస్తిని తక్కువ ధరకు అమ్మేయటంపైనా డిబేట్ జ‌ర‌గ‌నుంది.

నాగ‌బాబు హ‌యాంలో కొని శివాజీరాజా టర్మ్ లో అమ్మేయ‌డంతో దీనిపై ర‌చ్చ‌కు తెర తీయ‌నున్నార‌ట‌. రూల్ ప్రకారం ఎలాంటి కేసులు శిక్షలు ఉండవు కానీ.. ఎక్కువ రేటుకు ఆస్తిని కొని తక్కువ ధరకు అమ్మటాన్ని ప్రశ్నించే వీలుంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఎన్నికల సమయం ఈ టాపిక్ ని కూడా తెర‌పైకి తెస్తార‌ని గుస‌గుస‌ వినిపిస్తోంది. స‌ద‌రు ప‌త్రిక క‌థ‌నంపై నాగ‌బాబు కానీ శివాజీ రాజా కానీ స్పందిస్తారేమో చూడాలి. సెప్టెంబ‌ర్ లో మా అసోసియేష‌న్ ఎన్నిక‌లు జ‌ర‌గనున్న నేప‌థ్యంలో ఇంకా ఇలాంటి వేడెక్కించే క‌థ‌నాలెన్నో తెర‌పైకి రానున్నాయి.
Tags:    

Similar News