మెగాస్టార్ మెగా హ‌రిత‌హారం

Update: 2018-07-31 08:26 GMT
తెలంగాణ రాష్ట్రాన్ని ప‌చ్చ‌ద‌నంతో నింపేయ‌డ‌మే ధ్యేయంగా రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం - హ‌రిత‌హారం. మొక్క‌లు నాట‌డ‌మే దీని ఉద్ధేశ్యం. ఇందుకు మేము సైతం అంటూ ప‌లువురు సినీరాజ‌కీయ సెల‌బ్రిటీలు ముందుకొచ్చారు. మొక్క‌ను పెంచేవాడే సూప‌ర్‌ స్టార్ అన్న చందంగా ఎవ‌రికి వారు సినిమా తార‌లు ఏదో ఒక మొక్క‌ను నాట‌డం ఆ ఫోటోల్ని సామాజిక మాధ్య‌మాల్లో పోస్ట్ చేస్తుండ‌డంతో దీనికి రావాల్సినంత ప్రాచుర్యం వ‌స్తోంది. నిన్న‌నే కేటీఆర్ విసిరిన హ‌రిత‌హారం ఛాలెంజ్‌ ని స్వీక‌రించిన మ‌హేష్‌ - ఆ త‌ర్వాత త‌న గారాల ప‌ట్టీలు గౌత‌మ్‌ - సితార‌ల‌కు - ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లికి ఆ ఛాలెంజ్‌ ని బ‌ద‌లాయించారు. డాడ్‌ తో  క్యూట్ సితార మొక్క‌లు నాటే ఫోటోలు అంత‌ర్జాలాన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి.

తాజాగా మెగాస్టార్ చిరంజీవి హ‌రిత‌హారం ఛాలెంజ్‌ ని స్వీక‌రించారు. అన్న‌య్య మొక్క‌లు నాటుతున్న ఫోటోల్ని అధికారికంగా పీఆర్‌ వో స‌హా అభిమానులు ప్ర‌మోట్ చేస్తున్నారు. మెగాస్టార్ స్వ‌యంగా మొక్క‌ను  నాటి, దానికి నీళ్లు పోస్తున్న ఫోటోలు ప్ర‌స్తుతం సామాజిక మాధ్య‌మాల్లో జోరుగా వైర‌ల్ అవుతున్నాయి.

తాజాగా మెగాస్టార్ చిరంజీవి తాను మూడు మొక్క‌లు నాటారు. ఆ సంద‌ర్భంగా తాను కూడా ముగ్గురికి గ్రీన్ ఛాలెంజ్ ను విసిరారు. అందులో ఒక‌రు త‌మ్ముడు ప‌వ‌న్ క‌ల్యాణ్ అయితే.. మ‌రొక‌రు బిగ్ బీ అమితాబ్ కాగా.. మూడో వ్య‌క్తి మాత్రం మీడియా మొఘ‌ల్‌.. ఈనాడు సంస్థ‌ల అధినేత రామోజీరావు కావ‌టం విశేషం.

వీటిని మెగాభిమానులంతా షేర్ చేస్తూ ఎవ‌రికి వారు హ‌రిత‌హారం చేప‌ట్టాల‌ని ఉద్య‌మిస్తున్నారు. మంచి కోసం మేము సైతం అంటూ మెగాభిమానులు క‌దిలొస్తున్నారు. ఇది కికి కుకు ఉద్య‌మాన్ని మించి పెద్ద‌గా ఎద‌గాల‌ని ఆశిద్దాం. తెలుగు రాష్ట్రాలు ప‌చ్చ‌ద‌నంతో క‌ళ‌క‌ళ‌లాడాల‌ని ఆకాంక్షిద్దాం. జై హ‌రిత‌హారం.
Tags:    

Similar News