ఇక మిగిలింది చిరంజీవే..

Update: 2017-04-10 07:19 GMT
చిరంజీవి-బాలకృష్ణ-నాగార్జున-వెంకటేష్.. ఒక టైంలో టాలీవుడ్లో స్టార్ హీరోలంటే ఈ నలుగురే. దాదాపు రెండు దశాబ్దాల పాటు తెలుగు సినిమాల్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించారు ఈ నలుగురు హీరోలూ. ఐతే 2000 తర్వాత వీరి తర్వాతి తరం దూసుకొచ్చి.. సీనియర్ల జోరు నెమ్మదిగా తగ్గడం మొదలైంది. చిరంజీవి సినిమాల నుంచి నిష్క్రమించడం.. అదే సమయంలో మిగతా సీనియర్లను యువ హీరోలు దాటేయడంతో వీరి హవాకు దాదాపుగా తెరపడినట్లే కనిపించింది. కానీ ఈ మధ్య సీనియర్లు గట్టిగానే పుంజుకున్నారు. ట్రెండుకు తగ్గట్లుగా వైవిధ్యమైన సినిమాలతో యువ కథానాయకులకు పాఠాలు నేర్పుతున్నారు.

స్టార్ హీరోల సంగతి పక్కన పెట్టేద్దాం.. దేహమంతా చచ్చుబడిపోయి చక్రాల కుర్చీకి పరిమితమైన పాత్రను చిన్న స్థాయి హీరో అయినా చేస్తాడా..? కానీ అక్కినేని నాగార్జున లాంటి పెద్ద స్టార్ ‘ఊపిరి’లో ఇలాంటి పాత్ర చేసి అందరికీ పెద్ద షాకే ఇచ్చాడు. మన హీరోల ఆలోచనా ధోరణినే మార్చేసిన పాత్ర ఇది. స్టార్ హీరోలంటే హీరోయిజమే చూపించాలి.. ఫైట్లే చేయాలి అన్న రూల్స్ మారిపోయాయి. ఆ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ప్రోత్సాహం రావడంతో మరిందరు హీరోలు ఇలాంటి కొత్త పాత్రల వైపు అడుగులేస్తున్నారు. దీని తర్వాత నాగార్జున ‘ఓం నమో వేంకటేశాయ’ లాంటి మరో భిన్నమైన సినిమా చేశాడు. అది ఆయనకు అలవాటైన వ్యవహారమే కాబట్టి దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు ఓంకార్ లాంటి చిన్న దర్శకుడితో ‘రాజు గారి గది-2’ సినిమాలో నాగ్ మరో వైవిధ్యమైన పాత్ర చేస్తున్నాడు. ఇందులో ఆయన మోడర్న్ మాంత్రికుడి పాత్ర చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఓంకార్ లాంటి దర్శకుడితో నాగ్ పని చేయబోతుండటమే ఇక్కడ పెద్ద విశేషం.

సీనియర్లలో అందరి కంటే ఎక్కువగా రొటీన్ సినిమాలు చేస్తాడని పేరున్న నందమూరి బాలకృష్ణ కూడా ఈ మధ్యే గొప్ప మార్పు చూపించాడు. తన వందో సినిమాగా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ లాంటి సాహసోపేత చిత్రానికి ఆయన ఓటేశాడు. మామూలుగా వందో సినిమా అంటే అభిమానుల్ని దృష్టిలో ఉంచుకుని కమర్షియల్ చిత్రం చేస్తాడని అంతా అనుకున్నారు. బోయపాటి లాంటి మాస్ డైరెక్టర్ అందుకోసం రెడీ అయ్యాడు కూడా. కానీ బాలయ్య మాత్రం క్రిష్ దర్శకత్వంలో వైవిధ్యమైన సినిమా చేయడానికే ఓటేశాడు. వందో సినిమాగా ‘శాతకర్ణి’ లాంటి సినిమాను ఎంచుకోవడం పెద్ద సాహసమే. కానీ బాలయ్య వెనుకంజ వేయలేదు. ఆ సాహసానికి గొప్ప ఫలితమే నిలిచింది.

తాజాగా విక్టరీ వెంకటేష్ ‘గురు’లో ఒక షాకింగ్ క్యారెక్టర్ చేశాడు. నడివయస్కుడి పాత్రలో తెల్లగడ్డంతో కనిపించాడు. ‘దృశ్యం’ సినిమాలో ఈడొచ్చిన అమ్మాయికి తండ్రిగా నటించడానికి ఒప్పుకున్న వెంకీ.. ‘గురు’లో పెళ్లాం లేచిపోయిన కోచ్ పాత్రలో కనిపించాడు. ఇమేజ్ అని.. అభిమానులని అభ్యంతరాలు చెప్పకుండా వెంకీ చేసిన మంచి ప్రయత్నానికి మంచి స్పందనే వస్తోంది. సీనియర్ హీరోల్లో ముగ్గురు ఇప్పటికే మార్పు చూపించారు. వైవిధ్యమైన, సాహసోపేత చిత్రాలు చేశారు. ఇప్పుడిక చిరంజీవి వంతు వచ్చింది. ఆయన తన రీఎంట్రీ మూవీగా ‘ఖైదీ నెంబర్ 150’ లాంటి కమర్షియల్ సినిమానే చేశాడు. పునరాగమనం కాబట్టి కొంచెం జాగ్రత్త పడటంలో తప్పేం లేదు. ఐతే ఆ తర్వాత కూడా మరో కమర్షియల్ సినిమా ఎంచుకుని ఉంటే విమర్శలు వ్యక్తమయ్యేవి. ఐతే చిరంజీవి స్వాతంత్ర్య సమర యోధుడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. ఇది చిరుకు వైవిధ్యమైన సినిమా అవుతుందని భావిస్తున్నారు. ఒకప్పుడు రుద్రవీణ.. స్వయంకృషి.. ఆపద్బాంధవుడు ప్రయోగాత్మక చిత్రాలు చేసినప్పటికీ.. ఆ తర్వాత ఎక్కువగా కమర్షియల్ సినిమాలకే పరిమితం అయిపోయిన చిరు.. ఇప్పుడు మళ్లీ ఓ సాహసోపేత.. ప్రయోగాత్మక చిత్రానికి రెడీ అవుతుండటం విశేషం. ఉయ్యాలవాడ పాత్రలో మెప్పించి.. ఆయన కూడా టాలీవుడ్లో తమ తరం హీరోల ప్రత్యేకతను చాటి చెబుతాడేమో చూద్దాం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News