పెళ్లిపీటలపై చిరిగిన చొక్కాతో చిరూ .. కారణమదేనట!

Update: 2022-07-16 03:30 GMT
చిరంజీవి ఒక్క పూటలో సుప్రీమ్ హీరో కాలేదు .. ఒక రోజులో మెగాస్టార్ కాలేదు. చిన్న చిన్న పాత్రలను వేస్తూ ఆయన తన కెరియర్ ను కొనసాగిస్తూ వెళుతున్నారు. నలుగురిలో ఒకరిగా చేస్తే మాత్రం మిగతావారికంటే భిన్నంగా .. ప్రత్యేకంగా కనిపించేవారు. 'మనవూరి పాండవులు' సినిమా చూసినవారికి కూడా అలాగే అనిపించింది.

ఆ సినిమాలో అల్లు రామలింగయ్య కీలకమైన పాత్రను పోషించారు. అందువలన ఆయన చిరంజీవిని చాలా దగ్గరగా చూశారు. ఆయనలో ఏదో స్పార్క్ ఉందనీ .. ఎప్పటికైనా పైకొస్తాడనే విషయం అనుభవాన్ని బట్టి ఆయనకి అర్థమైపోయింది.

దాంతో ఆయనకి తన కూతురు సురేఖను ఇచ్చి చేస్తే ఎలా ఉంటుందా అనే ఆలోచన కలిగింది. ఆ విషయాన్ని గురించి అరవింద్ దగ్గర ప్రస్తావించిన ఆయన, ఒకసారి చిరంజీవితో మాట్లాడమని చెప్పారట. అందుకు తగిన సమయం కోసం అరవింద్ ఎదురుచూస్తుండగా, 'పున్నమినాగు' ప్రివ్యూ  థియేటర్ లో చిరంజీవిని కలుసుకునే అవకాశం వచ్చింది. ఆ సమయంలోనే అరవింద్ తమ మనసులోని మాటను చిరంజీవికి చెప్పడం .. అందుకు ఆయన అంగీకరించడం జరిగిపోయాయి. అయితే ఇక్కడే ఇంకో ట్విస్ట్ ఉంది.

అప్పుడప్పుడు తమ డాబా పై నుంచి చిరంజీవిని చూసిన సురేఖ, ఆయన అంత స్టైల్ గా లేడని తండ్రితో చెప్పారట. కానీ కుర్రాడు బుద్ధిమంతుడనీ .. పైకొచ్చే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పడంతో ఆమె ఒప్పుకున్నారట.

అలా వారి పెళ్లి సెట్ అయింది. 1980 .. ఫిబ్రవరి 20వ తేదీన వివాహం జరిపించాలని నిర్ణయించుకున్నారు. అయితే అప్పటికి అల్లు రామలింగయ్యకి ఉన్న పేరు ప్రతిష్ఠల సంగతి తెలిసిందే. దాంతో చిన్న చిన్న పాత్రలు చేసే యాక్టర్ కి పిల్లనివ్వడమేంటి? అంటూ అంతా మాట్లాడుకోవడం మొదలైంది.

అయినా ఆ మాటలను అల్లు పట్టించుకోలేదు. తీరా ముహూర్తం అనుకున్న సమయానికి 'తాతయ్య ప్రేమలీలలు' సినిమా షూటింగులో చిరంజీవి ఉన్నారు. నూతన్ ప్రసాద్ డేట్స్ లేకపోవడం వలన షూటింగ్ కేన్సిల్ చేయలేని పరిస్థితి. అందువలన ఆ లొకేషన్ కి దగ్గరలోనే అరవింద్ పెళ్లి మంటపాన్ని ఏర్పాటు చేశారు. ఆ సినిమా షూటింగు నుంచి వచ్చిన చిరంజీవి అదే చొక్కాతో పెళ్లి పీటలపై కూర్చున్నారట. ఆ చొక్కా మోచేతి దగ్గర చిరిగి ఉందని అక్కడివారు అంటే, తాళి  కట్టడానికి అదేం అడ్డుకాదే అంటూ చిరంజీవి తన సింప్లి సిటీని చూపించారట. అల్లు రామలింగయ్య తన కూతురును చిరంజీవికి ఎందుకు ఇచ్చారనేది ఆ తరువాత కొంతకాలానికే అందరికీ అర్థమవుతూ వచ్చింది.
Tags:    

Similar News