తారక్ - చరణ్ ఫ్రెండ్ షిప్ పై స్పందించిన మెగాస్టార్...!

Update: 2020-04-28 13:48 GMT
సినీ ఇండస్ట్రీలో నటీనటుల మధ్య ఎలాంటి విభేదాలు ఉండవు.. అలాంటివేమైనా ఉన్నా బయట పడకుండా జాగ్రత్త పడుతుంటారు అంటారు. ఒకవేళ గొడవలున్న వారు ఎక్కడైనా ఒకరినొకరు తారసపడ్డా చిరునవ్వులతో ఆలింగనం చేసుకుంటారు.. తమ మధ్య మంచి స్నేహ బంధం ఉందని నిరూపించే ప్రయత్నం చేస్తుంటారు. అయితే వారి అభిమానులు మాత్రం తరచూ గొడవలకు దిగుతుంటారు. ఇక మెగా - నంద‌మూరి కుటుంబాల మ‌ధ్య ఉన్న అంత‌రం.. అభిమానుల మ‌ధ్య శ‌త్రుత్వం గురించి కొత్త‌గా చెప్పాల్సిన ప‌ని లేదు. ఇది ద‌శాబ్దాల నుంచి న‌డుస్తున్న చ‌రిత్రే. మెగా - నందమూరి హీరోలు బయట సన్నిహితంగానే ఉంటారు. అప్పుడప్పుడు ఒకరినొకరు విమర్శించుకున్నా అది అప్పటికప్పుడే. అప్పట్లో చిరంజీవి - బాలయ్యల మధ్య బాక్సాఫీస్ పోరు మొదలైనప్పుడల్లా వీరి అభిమానులు యుద్ధ వాతారణాన్ని క్రియేట్ చేసేవాళ్ళు. ఆ తర్వాత రోజుల్లో ఎన్టీఆర్ - చరణ్ సినిమాల విషయంలో కూడా ఇలానే జరిగేది.

అలాంటిది ఈ రెండు కుటుంబాల‌కు చెందిన ఇద్ద‌రు స్టార్ హీరోలు క‌లిసి సినిమా చేస్తార‌ని ఎవరూ ఊహించి ఉండరు. కానీ అసాధ్యం అనుకున్న దాన్ని ఎన్టీఆర్ - చరణ్ కలిసి సుసాధ్యం చేశారు. ఇద్దరు కలిసి 'రౌద్రం రణం రుధిరం' (ఆర్.ఆర్.ఆర్) సినిమాలో నటిస్తున్నారు. వీరిద్దరిని కలిపిన ఘనత డైరెక్టర్ రాజమౌళికి కూడా దక్కుతుందని చెప్పవచ్చు. ఈ సినిమా స్టోరీ కూడా తారక్ (కొమరం భీమ్) - చరణ్ (సీతారామరాజు) ల మధ్య ఉండే ఫ్రెండ్ షిప్ నేపథ్యంలో ఉండబోతోందని తెలుస్తోంది. ఇలా ఆన్ స్క్రీన్ మీదే కాకుండా ఆఫ్ స్క్రీన్ లో కూడా వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటారనే విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో వచ్చే వీరికి సంభందించిన ఫోటోలు వీడియోలు వీరి స్నేహాన్ని రుజువు చేస్తాయి. అయితే వీరి ఫ్రెండ్ షిప్ విష‌యంలో ఫ్యాన్స్ ఎలా ఫీల‌వుతున్నారో తెలియదు కానీ.. రామ్ చ‌ర‌ణ్ తండ్రి మెగాస్టార్ చిరంజీవికి మాత్రం వీరి స్నేహంగా ఉండటం చాలా ఆనందాన్ని కలిగిస్తోందట. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన మెగాస్టార్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోలు వ్య‌క్తిగ‌తంగా స్నేహంగా మెల‌గ‌డం వ‌ల్ల ఎంతో మేలు జ‌రుగుతుంద‌ని.. త‌న వ‌ర‌కు అంద‌రితో స్నేహంగా ఉండ‌టానికే ట్రై చేసేవాడినని చెప్పుకొచ్చాడట.

అంతేకాకుండా తోటి హీరోలతో స్నేహంగా మెలిగే విష‌యంలో చ‌ర‌ణ్ తనని ఫాలో అవుతున్నాడని.. తార‌క్‌ తో అత‌డికి వ్య‌క్తిగ‌తంగా మంచి స్నేహం ఉంద‌ని మెగాస్టార్ చెప్పుకొచ్చాడు. వీరి ఫ్రెండ్ షిప్ త‌న‌కు ముచ్చ‌ట‌ గొలుపుతుంద‌న్న చిరు.. ప్ర‌స్తుతం హీరోలంద‌రూ బ‌య‌ట కూడా స్నేహితుల్లా మెల‌గ‌డం మంచి ప‌రిణామమని తెలియజేసాడు. ఇద్ద‌రు హీరోలు అన్న‌ద‌మ్ముల్లా మెలిగితే వాళ్ల‌ ఫ్యాన్స్ మ‌ధ్య కూడా అలాంటి వాతావ‌ర‌ణ‌మే ఉంటుంద‌ని.. అందుకే ఈ విష‌యంలో తాను ఎలా ఉండేవాడినో ఇండ‌స్ట్రీ జ‌నాలంద‌రికీ తెలుస‌ని మెగాస్టార్ చెప్పుకొచ్చాడు. వాస్తవానికి చిరంజీవి నాగార్జున వెంకటేష్ లాంటి స్టార్ హీరోల దగ్గర నుండి చిన్న హీరోల వరకు అందరితో మంచిగా మెలుగుతూ వస్తున్నాడు. అంతేకాకుండా చిరంజీవి ఇండస్ట్రీలో ఎవరితో మనస్పర్థలు వచ్చినా వాటిని క్లియర్ చేసుకుంటూ ఉంటాడు. మంచు మోహన్ బాబు - చిరంజీవి మధ్య జరిగిన సంఘటనల ద్వారా ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఎన్నో సార్లు పబ్లిక్ గా గిల్లికజ్జాలు పెట్టుకున్న వీరిద్దరూ ఇప్పుడు చాలా క్లోజ్ గా మెలుగుతున్నారు. ఏదేమైనా సినీ ఇండస్ట్రీలో హీరోలందరూ స్నేహంగా మెలగడమనేది శుభ పరిణామమని చెప్పవచ్చు.
Tags:    

Similar News