హీరో కాకముందు సీరియల్లో నటించిన చిరూ!

Update: 2022-08-23 03:59 GMT
కొన్ని ప్రయోగాలు .. మరొకొన్ని సాహసాలు కలిసి పెట్టుకున్న పేరే చిరంజీవి. మెగాస్టార్ కి ముందు ఎన్టీఆర్ .. ఏఎన్నార్ .. కృష్ణ .. శోభన్ బాబు వంటి వారు తెలుగు సినిమాను తమదైన ప్రత్యేకతలతో పరుగులు తీయిస్తున్నారు. కొత్త హీరోలను  ప్రోత్సహించే ఆలోచనలో .. పరిచయం చేసే ప్రయత్నంలో దర్శక నిర్మాతలు ఎంతమాత్రం లేని రోజులవి. అలాంటి పరిస్థితుల్లో చిరంజీవి ఎన్నో ఆశలతో అడుగుపెట్టారు. సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి .. ఎలాంటి సినిమా నేపథ్యం లేని ఫ్యామిలీ నుంచి ఆయన వచ్చారు.

చామనఛాయ రంగు .. వంకీలు తిరిగిన జుట్టు  .. ఫిట్ నెస్ తో కూడిన శరీరం .. నటించగలననే నమ్మకం .. ఇవే ఆయనను ఇండస్ట్రీ లో అడుగుపెట్టేలా చేశాయి. చిరంజీవిలో ప్రత్యేకమైన ఆకర్షణ ఆయన కళ్లు. అంతటి పవర్ఫుల్ కళ్లు ఉన్న హీరోలు మనకి ఇంతవరకూ తగల్లేదనే చెప్పుకోవాలి.

ఆయన చూపులు శాసిస్తున్నట్టుగా .. ఆదేశిస్తున్నట్టుగా ఉంటాయి.  కెరియర్ ఆరంభంలో చిన్న చిన్న పాత్రలు చేస్తూ .. తప్పని సరి పరిస్థితుల్లో నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలను చేస్తూ ఆయన ముందుకు వెళ్లడం మొదలుపెట్టారు. ఆ తరువాత నలుగురు హీరోల్లో ఒకరిగా కనిపిస్తూ మరింత ముందుకు వెళ్లారు.

అలా తెలుగు తెరపై కాస్త పట్టు సంపాదించుకున్న ఆయన, పైకి పాకడానికి ఎక్కువ సమయం తీసుకోలేదు. తనకంటూ ఆయన ఒక స్టైల్ ను సెట్ చేసుకున్నారు. ఆయన బాడీ లాంగ్వేజ్ .. డైలాగ్ డెలివరీ .. డిఫరెంట్ గా ఉండేవి. అప్పటివరకూ ఏఎన్నార్ డాన్సులను చేస్తూ వచ్చిన ప్రేక్షకులకు తన మార్కు డాన్సులను చూపించారు.

కృష్ణ ఫైట్స్ చూస్తూ విజిల్స్ వేస్తున్నవారికి తన స్టైల్ యాక్షన్ ను రుచి చూపించారు. పొగరుబోతు భామలకు కళ్లెం వేసే హీరో పాత్రల్లోను .. విలనీ మామల భారతం పట్టే అల్లుడి పాత్రలల్లోను .. లుంగీ కట్టేసి తాగుబోతులా చిందులు వేసే పాత్రల్లోను ఆయన మాస్ ఆడియన్స్ మనసులు దోచేశారు.  

బైక్ ను స్టైల్ గా నడపడం  .. రెండు చేతులతో తుపాకులు కాల్చడం వంటి విన్యాసాలతో పాటు, కాస్ట్యూమ్స్ విషయంలోను ఆయన మరింత కొత్తదనాన్ని చూపిస్తూ వచ్చారు. అలాంటి చిరంజీవి హీరో కావడానికి ముందు హిందీలో 'రజని' అనే ఒక సీరియల్లో చేసినట్టుగా చాలామందికి తెలియదు. ఆ సీరియల్లో ఆయన ఒక ఎపిసోడ్ లో .. అదీ అతిథి పాత్రలో కనిపిస్తారు. ఆ తరువాత ఇక వెండితెరపై బిజీ కావడం వలన ఆయన బుల్లితెర వైపు రాలేదు. అలా అని చెప్పేసి ఆయన బుల్లితెరను తక్కువగా ఏమీ చూడలేదు. ఆ మధ్య హోస్టుగా కూడా ఆయన మెప్పించారు. చిరంజీవి అంటే ఒక పాఠమో .. ఒక అధ్యాయమో కాదు .. ఒక చరిత్ర అని నిరూపించారు.
Tags:    

Similar News