రిజ‌ల్ట్ డే: సినీతార‌ల సీన్ సితారే!!

Update: 2019-05-23 17:30 GMT
ప్ర‌తి శుక్ర‌వారం సినిమాల రిజ‌ల్ట్ గురించి ఎదురు చూసే సినీతార‌లు ఈసారి ఎన్నిక‌ల‌ రిజ‌ల్ట్ కోసం అంతే ఆత్రంగా వేచి చూశారు. ఆంధ్ర ప్ర‌దేశ్ ఎన్నిక‌లు.. అలాగే ఇత‌ర రాష్ట్రాల ఎన్నికల్లో పోటీ చేసిన స్టార్ల‌లో ఎవ‌రు ఎక్క‌డ నుంచి పోటీ చేసి గెలుపోట‌ముల్ని ఎదుర్కొన్నారు? అన్న‌ది ప‌రిశీలిస్తే.. మెజారిటీ పార్ట్ తారా లోకానికి ఓట‌మి భారం త‌ప్ప‌లేద‌ని అర్థ‌మ‌వుతోంది.

ఈసారి వైకాపా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో విజ‌య‌దుందుభి మోగించింది. వైకాపాకు సినీగ్లామ‌ర్ అంటే రోజానే. త‌న‌దైన మాటతీరు.. పట్టుద‌ల‌తో ఈసారి ప్ర‌జ‌ల్లోకి వెళ్లిన రోజా ప్ర‌త్య‌ర్థిపై గెలుపొందారు. చిత్తూరు జిల్లా నగరి నుంచి సినీనటి ఆర్కే రోజా 2,681 ఓట్ల ఆధిక్యం తో గెలిచారు. అలాగే దేశ‌వ్యాప్తంగా ప‌రిశీలిస్తే ఇరుగుపొరుగున సుమ‌ల‌త‌.. జ‌య‌ప్ర‌ద‌.. ఊర్మిల వంటి న‌టీమ‌ణులు పోటీ చేశారు. మాండ్యా నియోజకవర్గం నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగిన సినీనటి సుమలత విజయం సాధించ‌గా.. ముంబై నార్త్ ఈస్ట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీకి దిగిన ఊర్మిళ తన ప్రత్యర్ధి అయిన గోపాల్ శెట్టి చేతిలో ఓట‌మి అంచుల్లోకి వెళుతున్నార‌ని తెలుస్తోంది. ఊర్మిల‌ రాజ‌కీయారంగేట్రం భారీ ఓట‌మితో నిరాశ త‌ప్ప‌ద‌ని తెలుస్తోంది. అలాగే సీనియ‌ర్ న‌టి జ‌య‌ప్ర‌ద రాంపూర్ నుంచి భాజ‌పా ఎంపీ అభ్య‌ర్థిగా పోటీకి దిగారు. త‌న ప్ర‌త్య‌ర్థి స‌మాజ్ వాదీ పార్టీ అభ్య‌ర్థి మహమ్మద్ ఆజం ఖాన్ చేతిలో ఓట‌మి త‌ప్ప‌లేద‌ని తెలుస్తోంది.  సమాజ్ వాదీ అభ్యర్థిగా 2004 - 2009 ఎన్నికల్లో గెలుపొందిన జ‌య‌ప్ర‌ద ఈసారి ఓడిపోక త‌ప్ప‌లేదు.

ఇక జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ ఓట‌మి అభిమానుల్ని తీవ్రంగా నిరాశ‌ప‌రిచింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో భీమ‌వ‌రం.. గాజువాక నియోజ‌క‌వ‌ర్గాల నుంచి పోటీ చేసిన ప‌వ‌న్ ఏదో ఒక‌చోట గెలుస్తాడ‌నే అభిమానులు భావించారు. కానీ ఆయ‌న రెండుచోట్లా ఓట‌మి పాల‌వ్వ‌గా.. ఆ రెండుచోట్లా వైసీపీ అభ్య‌ర్థులు గెలిచారు. న‌ర్సాపురం నుంచి మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు సైతం ఓట‌మి పాల‌య్యారు. విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్  బెంగళూరు సెంట్రల్ నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా బ‌రిలో దిగారు. కానీ అక్క‌డ భాజ‌పా అభ్యర్థి గాలి వీచింది. 6 లక్షలకు పైగా ఓట్ల తేడాతో ప్ర‌కాష్ రాజ్ ఓట‌మిపాల‌య్యారు. ఇక మాంద్య నియోజక‌వ‌ర్గంలో కర్ణాటక సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ ఓట‌మి పాల‌వ్వ‌డంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. నిఖిల్ గౌడ హీరోగానూ కెరీర్ ని సాగిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇక సినీ తార‌ల్లో హిందూపురం నియోజ‌క వ‌ర్గంలో న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ విజ‌యం వైపు దూసుకెళుతున్నార‌ని తెలుస్తోంది. అలాగే బాలీవుడ్ న‌టుడు స‌న్నీడియోల్  గురుదాస్ పూర్ బీజేపీ లోక్ సభ అభ్యర్థిగా గెలుపొంద‌నున్నార‌ని క‌డ‌ప‌టి స‌మాచారం అందింది. ఇంకా ప‌లు చోట్ల ప‌లువురు సినీతార‌లు ఈసారి ఎన్నిక‌ల్లో పోటీకి దిగారు. వారికి సంబంధించిన గెలుపోట‌ముల‌ వివ‌రాలు తెలియాల్సి ఉందింకా.


Tags:    

Similar News