బాహుబలి-2.. ఒక సెన్సేషనల్ అప్ డేట్

Update: 2017-01-22 10:26 GMT
ఇండియన్ సినిమాలో టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రపంచ స్థాయి సాంకేతికతను అన్వయించుకుని అద్భుతాలు చేస్తున్నారు మన దర్శకులు. ఐతే సినిమాల్లో పెరుగుతున్న సాంకేతికతకు తగ్గట్లుగా థియేటర్ల ఆధునికీకరణ జరిగితేనే ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పొందుతారు. ఈ విషయంలో శంకర్.. రాజమౌళి లాంటి దర్శకులు చేస్తున్న ప్రయత్నాల గురించి గొప్పగా చెప్పుకోవాలి. రోబో సీక్వెల్ ‘2.0’ను త్రీడీలో తెరకెక్కిస్తున్న శంకర్.. ప్రపంచ స్థాయి త్రీడీ వినోదాన్ని ప్రతి ప్రేక్షకుడూ ఆస్వాదించాలన్న ఉద్దేశంతో దేశంలోని మెజారిటీ థియేటర్లు త్రీ హంగులు అమర్చుకునేలా యాజామాన్యాలతో సంప్రదింపులు జరుపుతున్నాడు. ‘2.0’ నిర్మాతలు ప్రస్తుతం ఆ పనిలోనే ఉన్నారు. ఈ ఏడాది దీపావళికి 2.0 విడుదలయ్యే సమయానికి ఈ పని పూర్తి చేయాలని ప్రయత్నిస్తున్నారు.

మరోవైపు బాహుబలి-2కు సంబంధించి కూడా ఇలాంటి మహా ప్రయత్నమే జరగబోతోంది. ‘బాహుబలి: ది బిగినింగ్’తో పోలిస్తే ‘బాహుబలి: ది కంక్లూజన్’ సాంకేతికంగా మరింత ఉన్నతంగా ఉండబోతోంది. ఇందులో గ్రాఫిక్స్‌.. విజువల్ ఎఫెక్ట్స్‌ కు మరింత ప్రాధాన్యం ఉంది. ఐతే సినిమా సాంకేతికంగా ఎంత ఉన్నతంగా ఉన్నప్పటికీ.. థియేటర్లలో దానికి తగ్గ క్వాలిటీ ప్రొజెక్టర్లు ఉండటం కూడా ముఖ్యమే. అప్పుడే ప్రేక్షకుడు వంద శాతం వినోదాన్ని పొందుతాడు. ఐతే బాహుబలి నిర్మాతలు ఈ విషయమై థియేటర్ల యాజమాన్యాలతో మాట్లాడారట. 4కె రిజల్యూషన్‌ ఉన్న ప్రొజెక్టర్లను అమర్చుకునేలా థియేటర్ల యాజమాన్యాల్ని ఒప్పించారట. ఒక్కో థియేటర్లో ఈ ప్రొజెక్టర్లను అమర్చుకోవడానికి కోటి రూపాయల దాకా ఖర్చవుతుందట. అయినప్పటికీ 200 థియేటర్ల యాజమాన్యాలు ముందుకొచ్చాయి.  బాహుబలి సినిమాను కేరళలోని తిరువనంతపురంలోని ఓ థియేటర్‌ లో 4కె స్క్రీన్‌ మీద ‘బాహుబలి’ని ప్రదర్శించడం వల్ల మిగతా థియేటర్లతో పోలిస్తే ఇక్కడ ప్రేక్షకుల సంఖ్య పెరిగిందట. భారీగా లాభం వచ్చిందట. అందుకే ఖరీదైన వ్యవహారమే అయినప్పటికీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని 4కె రెజల్యూషన్ ఉన్న ప్రొజెక్టర్లను అమర్చుకోవడానికి థియేటర్ల యాజమాన్యాలు ముందుకొచ్చాయి. సినిమా విడుదలకు ఇంకో మూడు నెలల సమయం ఉన్న నేపథ్యంలో మరిన్ని థియేటర్లు ఈ దిశగా ముందుకు కదులుతాయని భావిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News