తెలుగు రాష్ట్రాలు సీఎంలు.. 'కృష్ణ'కు మాత్రమే సాధ్యమైంది

Update: 2022-11-17 03:58 GMT
సూపర్ స్టార్ కృష్ణ ఇప్పుడు గతమయ్యారు. భౌతికంగా ఆయన లేకున్నా.. ఆయన తలపులు తెలుగు ప్రజల్ని ఎప్పటికి వెంటాడుతూనే ఉంటాయి. ఆ విషయంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. తెలుగు సినిమా బతికి ఉన్నంత వరకు.. సూపర్ స్టార్ కృష్ణ ఉంటారు. తెలుగు సినిమాకు సంబంధించిన ఏ ప్రస్తావన వచ్చినా.. సూపర్ స్టార్ కృష్ణ గురించి మాట్లాడకుండా ఉండలేని పరిస్థితి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. మరణంలోనూ తనదైన స్పెషలాటిలిని ప్రదర్శించారు సూపర్ స్టార్.

చాలామంది నటులు రీల్ స్టార్లుగా ఉంటారు. కానీ.. రియల్ స్టార్ గా ఉండే నటులు చాలా అరుదుగా ఉంటారు. సూపర్ స్టార్ కృష్ణ రెండోకోవకు చెందిన వ్యక్తి. రెండు తెలుగు రాష్ట్రాలుగా ఏర్పడిన ఈ ఎనిమిదేళ్లలో చాలామంది ప్రముఖులు కాలం చేశారు. కానీ..

వారిలో చాలామంది విషయంలో చోటు చేసుకోనిది సూపర్ స్టార్ కృష్ణ విషయంలో చోటు చేసుకుందని చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సంగతి తెలిసిందే. ఎంతటి ప్రముఖుడు కాలం చేసినా.. ఆయన కాలు తీసి బయటకు పెట్టటానికి పెద్దగా ఇష్టపడరు. అలా అని తాను రాలేదు కాబట్టి.. జరగాల్సిన మర్యాదల విషయంలో ఏ మాత్రం లోటు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటారు.

కానీ.. సూపర్ స్టార్ కృష్ణ విషయంలో మాత్రం ఆయన.. ముందే వచ్చేశారు. కృష్ణ మరణం గురించి తెలిసినంతనే తన సంతాప సందేశాన్ని విడుదల చేసిన ఆయన.. కృష్ణ నివాసానికి రావటమే కాదు.. దాదాపు 20 నిమిషాలపాటు అక్కడే ఉండటం.. మహేశ్ బాబును ఆత్మీయంగా హత్తుకోవటం తెలిసిందే. మహేశ్ దంపతుల పక్కనే కూర్చొని. వారితో మాట్లాడటం.. ఈ సందర్భంగావారి మాటలకు అడ్డం తగిలే ప్రయత్నం చేసిన నరేశ్ ను నిలువరించి.. వారితో మాట్లాడిన వైనం తెలిసిందే.

సూపర్ స్టార్ కృష్ణను ఆఖరిసారి చూసేందుకు సీఎం కేసీఆర్ రావటం ఒక ఎత్తు అయితే.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం హాజరు కావటం ఆసక్తికరంగా మారింది. ఇలా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరు పరామర్శలకు వచ్చిన వైనాలు దాదాపుగా లేవనే చెప్పాలి.

అలాంటి తొలి సందర్భం ఇదేనన్న మాట వినిపిస్తోంది. ఇలా.. తన మరణంలోనూ రోటీన్ కు భిన్నంగా.. రెండు తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చి మరీ నివాళులు అర్పించటం సూపర్ స్టార్ కృష్ణకు మాత్రమే సాధ్యమవుతుందని చెప్పక తప్పదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.


Tags:    

Similar News