డిజిట‌ల్ రిలీజ్ ర‌క్షిస్తుందా రాజా?

Update: 2020-04-02 03:55 GMT
క‌రోనా జీవిత స‌త్యాల్ని ఆవిష్క‌రిస్తోంది. మాన‌వాళికి పాఠాల్ని నేర్పిస్తోంది. ఫ్యాక్ట‌రీలు మూత‌ప‌డ‌డంతో ఆక్సిజ‌న్ పెరిగింద‌ని ప‌ర్యావ‌ర‌ణ వేత్త‌లు చెబుతుండ‌డం ఉత్కంఠ పెంచింది. ఇదంతా స‌రే కానీ ప్ర‌పంచాన్ని అల్ల‌క‌ల్లోలం చేస్తున్న క‌రోనా అన్ని ప‌రిశ్ర‌మ‌ల‌కు నేర్పిన‌ట్టే టాలీవుడ్ కి బోలెడ‌న్ని పాఠాల్ని నేర్పిస్తోంది. చిన్నోడు పెద్దోడు అనే తేడా లేకుండా అంద‌రికీ వాత‌లు పెట్టేస్తోంది.

అపుడెపుడో క‌మ‌ల్ హాస‌న్ డైరెక్ట్ టు హోమ్ (డీటీహెచ్) అంటూ కొత్త కాన్సెప్టు తో ముందుకొస్తే టాలీవుడ్ లో ఆ న‌లుగురు స‌హా ప‌లువురు మోకాల‌డ్డేశారు. క‌మ‌ల్ కి దాస‌రి అండ‌గా నిలిచినా ప‌న‌వ్వ‌లేదు. ఇక‌పోతే నేటి స‌న్నివేశం చూస్తుంటే ఎవ‌రికి వారు క‌లుగులోని ఎల‌క‌ల్లా మీద ఏ బాంబ్ ప‌డుతుందోన‌ని భ‌య‌ప‌డి చ‌స్తున్నారు. ఇప్ప‌టికే సెట్స్ పై ఉన్న సినిమాల్ని ఎలా రిలీజ్ చేయాలి దేవుడా! అంటూ త‌ల‌ల ప‌ట్టుకుంటున్నారు. ఇప్పుడు ప‌రిస్థితి ఎంత అధ్వాన్నంగా మారిందంటే థియేట‌ర్లు ఇచ్చినా అఖ్క‌ర్లేదు. డిజిటల్ రిలీజ్ బెట‌ర్ రూట్!! అంటూ కొత్త దారిని వెతుకుతున్నారు. ఇక థియేట్రిక‌ల్ రిలీజ్ తో ప‌నేం లేదు అన్నంత‌గా బుర్ర‌ల్ని ట్యూన్ చేసేశార‌ని ఇదివ‌ర‌కూ తుపాకి వెల్ల‌డించింది.

ఇక ఈ ప్ర‌భావం ఓ యంగ్ హీరోపై తీవ్రంగానే ప‌డింద‌ని తెలిసింది. స‌ద‌రు యంగ్ హీరో కెరీర్ గ్రాఫ్ ఏమంత బాలేదు. వ‌రుస ఫ్లాపులు తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేసాయి. అత‌డి గ‌త చిత్రం వెట‌ర‌న్ నిర్మాత తీసిన‌దే అయినా ఏం ఉప‌యోగం? ఇక‌పోతే ఇదే హీరో న‌టించిన తాజా చిత్రం వేస‌వి లో రిలీజ్ కావాల్సి ఉన్నా ఇప్పుడున్న విప‌త్క‌ర ప‌రిస్థితి లో సాధ్య‌మ‌య్యే ప‌ని కాద‌ని నిర్ధార‌ణ‌కు వ‌చ్చార‌ట‌. మ‌రి థియేట్రిక‌ల్ రిలీజ్ చేయ‌క‌పోతే ఇంకెలా చేస్తారు? అంటే.. దానికి ప్ర‌త్యామ్నాయంగా డిజిట‌ల్ స్ట్రీమింగ్ వేదిక‌పై రిలీజ్ చేయ‌డ‌మే ఉత్త‌మం అని భావిస్తున్నార‌ట‌. అందుకు సంబంధించిన ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రంగా చేస్తున్నార‌ని తెలుస్తోంది. ఇక‌పోతే క‌రోనా వెళ్లిపోయినా దాని తాలూకా మూలాలు ఇంకా మిగిలే ఉంటాయ‌న్న భ‌యంతో జ‌నాలు థియేట‌ర్ల‌కు రాక‌పోతే అప్పుడు ప‌రిస్థితేమిటి? అన్న‌ది టాలీవుడ్ నిర్మాత‌లు.. ఎగ్జిబిట‌ర్స్ కం డిస్ట్రిబ్యూట‌ర్ల‌లో గుబులు రేపుతోంది. ఆ క్ర‌మంలోనే ఎంతో కొంత ద‌క్కిందే నారాయణా! అంటూ ముందు సినిమాల్ని డిజిట‌ల్ స్ట్రీమింగ్ యాప్ ల‌కు అమ్మేసే ప‌నిలో ప‌డ్డార‌ట‌. ఇంతేకాదు చాలా మంది హీరోలు.. నిర్మాత‌లు ఇదే దారి వెతుక్కుంటున్నార‌న్న గుస‌గుస‌లు వేడెక్కిస్తున్నాయ్. మిడిసిపాటు వ‌ద్దే వ‌ద్దు. సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ‌డమే ముద్దు అని ఎవ‌రికి వారు హైరానా ప‌డిపోతున్నార‌ట‌.
Tags:    

Similar News