టాప్ స్టోరి: `అమ్మ` గుండె‌కు గాయం.. ఇంకెన్నాళ్లు?

Update: 2021-04-14 06:30 GMT
టాలీవుడ్ ఎంద‌రికో ఉపాధినిస్తోంది. అన్నం పెట్టి బ‌తుకునిస్తోంది. 24 శాఖ‌ల‌ కార్మికుల‌తో పాటు స్టార్లు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఇత‌ర వ‌ర్గాల‌కు క‌ల్ప‌త‌రువు ఈ ప‌రిశ్ర‌మ‌. ఈ రంగంపై ఆధార‌ప‌డిన ఎగ్జిబిష‌న్ (థియేట‌ర్) వ్య‌వ‌స్థ‌పైనా ఎంద‌రో కార్మికులు ఆధార‌ప‌డి జీవిస్తున్నారు. ప్ర‌త్య‌క్ష ప‌రోక్షంగా వేలాది కార్మికులు చిత్ర‌ప‌రిశ్ర‌మ‌పైనే ఆధార‌ప‌డి జీవ‌నం సాగిస్తున్నారు. త‌మ‌కు సంవ‌త్సరాలుగా ఉపాధి క‌ల్పిస్తున్న టాలీవుడ్ ని అందుకే `అమ్మ‌`తో స‌మానంగా భావిస్తారు. ప‌రిశ్ర‌మ‌లో జీవించేవారు టాలీవుడ్ ని కించ‌ప‌రిచినా అస‌భ్యంగా మాట్లాడినా స‌హించ‌రు.

అలాంటిది ఏడాది కాలంగా క‌రోనా మ‌హ‌మ్మారీ ప‌దే ప‌దే అమ్మ గుండెకు గాయం చేస్తోంది. బిడ్డ‌ల జీవితాల్ని నాశ‌నం చేస్తోంది. ఉపాధి క‌రువై బ‌తుకు తెరువు లేని విధంగా మారుస్తోంది. ఇది ఇంకా ఎన్నాళ్లు?  మొద‌టి వేవ్ వ‌చ్చి వెళ్లింది. ఇండ‌స్ట్రీలో అల్ల‌క‌ల్లోలం స‌ద్ధుమ‌ణిగింది అనుకుంటే ఇప్పుడు సెకండ్ వేవ్ వ‌చ్చింది. ఇది కూడా తాత్కాలిక‌మే. కానీ అన్ని గాయాల్ని త‌ట్టుకుని అమ్మ (టాలీవుడ్) అక్క‌డే నిల‌బ‌డి ఉంది. ప‌రిశ్ర‌మ‌ను ఎవ‌రూ క‌ద‌ల్చ‌లేరు. ఎన్ని ఉత్పాతాలు వ‌చ్చినా అది నిల‌బ‌డే ఉంటుంది.

అయితే ఈ రంగంపై ఆధార‌ప‌డి జీవిస్తున్న వారికి తాత్కాలిక క‌ష్టం త‌ప్ప‌దు. చూస్తుంటే మ‌రో రెండు మూడు నెల‌ల పాటు క‌రోనా ఉధృతి ఇలానే ఉంటుందా..? ఇంకా ఎంత‌కాలం కొన‌సాగుతుంది? అన్న‌ది అర్థం కాని ప‌రిస్థితి. ఓవైపు షూటింగులు నిలిచిపోతున్నాయి. మ‌రోవైపు థియేట‌ర్ రంగంలో కుదుపు మొద‌ల‌వుతోంది. వ‌రుస‌గా సినిమాల రిలీజ్ ల‌ను నిర్మాత‌లు వాయిదాలు వేస్తున్నారు. వ‌కీల్ సాబ్ వ‌ర‌కూ ఇటీవ‌ల రిలీజై సేఫ్ అయిపోయింది. ఇక ముందు రావాల్సిన సినిమాల ప‌రిస్థితే సందిగ్ధంగా మారింది. మునుప‌టిలానే ఈసారి కూడా ఓటీటీల్ని నిర్మాత‌లు ఆశ్ర‌యిస్తామంటే ఇప్ప‌టికే కుదేలైపోయిన ఎగ్జిబిట‌ర్లు (థియేట‌ర్ య‌జ‌మానులు) అంగీక‌రించ‌ని ప‌రిస్థితి ఉంది. సంక్రాంతి త‌ర్వాత వ‌చ్చిన స‌క్సెస్ స్ట్రీక్ ఇక‌పైనా కొన‌సాగే పరి‌స్థితి ఉన్నా.. మ‌హమ్మారీ వ‌ల్ల పెద్ద చిక్కొచ్చి ప‌డింది. ఇప్పుడు వాయిదాల వ‌ల్ల మ‌ళ్లీ ఒకేసారి గంప‌గుత్త‌గా సినిమాల‌న్నిటినీ ఒకేసారి థియేట‌ర్ల‌లోకి వ‌దలాల్సిన ప‌రిస్థితి ఉంటుంది.

అది ఎవ‌రికీ అంత మంచిది కాదు. ఒకేసారి విడుదల చేయడం వల్ల బాక్సాఫీస్ వద్ద చాలా సినిమాలు ఘర్షణ పడితే ఫలితాలు చిత్రనిర్మాతలకు చాలా సంతృప్తికరంగా ఉండవు. ప్ర‌స్తుతానికి ఓటీటీలే సుర‌క్షితం అని భావించి రిలీజ్ చేసినా అది వేరే కోణంలో ఇబ్బందిక‌రం. ఇది ఎల్ల‌కాలం సుర‌క్షితం కాదు. థియేట‌ర్ వ్య‌వ‌స్థ బావుంటే‌నే ప‌రిశ్ర‌మ‌కు మ‌నుగ‌డ‌. మ‌రి దానికోసం టాలీవుడ్ ఏం చేయ‌బోతోంది? ఈ వ్య‌వ‌స్థ‌ల్ని బ‌తికించుకునేందుకు తెలుగు ప్ర‌భుత్వాలు ఏమేర‌కు స‌హాయ‌ప‌డ‌నున్నాయి? 50 శాతం సీటింగ్ టికెటింగ్ తో అయినా ఈ వ్య‌వ‌స్థ‌ను బ‌తికించే ఆలోచ‌న ఉందా? అన్న‌దే ఇప్పుడు చిక్కు వీడ‌ని ప్ర‌శ్న‌. థియేట‌ర్ల‌లోకి సినిమా రావాలా వ‌ద్దా?
Tags:    

Similar News