`మా` ఎన్నిక‌ల సిత్రం.. క‌ల‌లో దాస‌రి ఏమ‌న్నారంటే!

Update: 2021-10-08 06:44 GMT
మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నిక‌ల్లో సిత్ర‌విసిత్రాలు స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి. ఇంత‌కుముందు ఎన్టీఆర్ ని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని కూడా ప్ర‌చారానికి వాడేయ‌డం చర్చ‌కు వ‌చ్చింది. ఇపుడు క‌ల‌లో దాస‌రి నారాయ‌ణ‌రావు అంటూ సీనియ‌ర్ న‌టుడు సీవీఎల్ ప్ర‌స్థావించ‌డం.. దానిని ఎంతో గొప్ప‌గా అభిన‌యించ‌డంతో బోలెడంత వినోదం పంచుతోంది ఆ వీడియో.

ఈ వీడియోలో మంచు విష్ణు ప్యానల్ కు మ‌ద్ధ‌తుగా సీవీఎల్ ప్రామ్టింగ్ ఆద్యంతం న‌వ్వించింది. ఇండస్ట్రీలోని పెద్దలందరూ కూర్చుని మాట్లాడుకుంటే ఎన్నికలు లేకుండానే ఈ సమస్య తీరిపోతుందని అందుకు కావాల్సిన ఏర్పాట్లను తాను చూస్తున్నాన‌ని అన్నారు సీవీఎల్.

ఆయన మాట్లాడుతూ.. `` స‌భ్యుల‌కు న‌మ‌స్కారం. దాసరిగారు నాకు కలలోకి వచ్చారు. అందరికీ ఇది కాస్త వెటకారంగానే ఉండొచ్చు. ఎందుకంటే మొన్న రాముడు.. ఇవాళ దాసరా? అనే డౌట్ రావ‌చ్చు. కానీ ఆయనని మరచిపోలేం. దాస‌రిని రెండుసార్లు క‌లిసాను. అప్పట్లో ఏవీఎస్ తో కలిసి స‌మ‌స్య‌ను తీసుకెళ్లి ప‌రిష్క‌రించుకున్నాం`` అని తెలిపారు.

దాస‌రి లేని లోటు ఇప్పుడు స్ప‌ష్ఠంగా క‌నిపిస్తోంద‌ని కూడా సీవీఎల్ కాస్త సెటైరిక‌ల్ గా అన్నారు. ఆ త‌ర్వాత దాస‌రి కొడుకు గా భావించే మోహ‌న్ బాబు పేరును సీవీఎల్ తెర‌పైకి తెచ్చారు. మోహ‌న్ బాబు కుమారుడు మాలో పోటీప‌డుతున్నారు కాబ‌ట్టి గెలిపించాల‌ని ఓట‌ర్ల‌ను కోరారు.

దాస‌రితో ఏంటండీ అని క‌ల‌లో అడిగితే.. ``మీరంతా నేను ఉన్నానని అంటుంటారుగా? మీరంతా ఏం చేస్తున్నారు. తండ్రికి మించిన తనయుడు.. గురువును మించిన శిష్యుడు అంటుంటారుగా? మోహన్ బాబు నన్ను తండ్రిగా అనుకున్నాడు. నేను అతన్ని కొడుకుగా శిష్యుడిగా భావించాను. నా కొడుకుకి కొడుకు విష్ణు ఉన్నాడు. అతడిని గెలిపించమని చెప్పడం లేదు.. కానీ నేను మోహన్ బాబుకి నేర్పిన సంస్కారం.. ఆయన వాళ్లబ్బాయికి నేర్పిన సంస్కారం తెలియంది కాదు. ఆ సంస్కారం వల్లే కదా.. పెద్దవాళ్లందరూ కలిసి తప్పుకోమంటే తప్పుకుంటానని అన్నాడు విష్ణు`` అంటూ గుర్తు చేశారు.

పెద్దాళ్లంతా కూచుని యునానిమ‌స్ చేసేయొచ్చుగా.. అని అన్నాను. దాస‌రి నీ ప్ర‌య‌త్నం నువ్ చేయ్ అన్నారు అంటూ చాలానే చెప్పుకొచ్చారు. ప‌రిశ్ర‌మ పెద్ద‌లు చిరంజీవి- బాలకృష్ణ- నాగార్జున- వెంకటేష్.. కృష్ణగారు- కృష్ణంరాజుగారు- విజయ్ చందర్‌.. అంద‌రినీ కూచోబెట్టి మాట్లాడాలి. ఒక గంట కేటాయించండి.. అని అన్నారు సీవీఎల్. ఇండ‌స్ట్రీ కుటుంబం ఏదో ఒక‌టి మాట్లాడి నిర్ణ‌యించుకోవాలి అని అన్నారు సీవీఎల్. అన్న‌ట్టు ఇంకో రెండ్రోజుల్లో ఎల‌క్ష‌న్ పెట్టుకుని ఆయ‌న ఏంటో ఈ సిత్రాలు! అంటూ రివ‌ర్స్ పంచ్ లు విసురుతున్నారు.

సీవీఎల్ ఈసారి ఎన్నిక‌ల్లో మా అధ్య‌క్షుడిగా పోటీప‌డాల‌ని భావించినా కానీ .. చివ‌రికి మ‌న‌సు మార్చుకుని పోటీ నుంచి వైదొల‌గారు. ఆరంభం తెలంగాణ క‌ళాకారులకు న్యాయం! అంటూ ఆయ‌న ఎత్తుకున్న ప‌ల్ల‌వి అంద‌రినీ విస్మ‌యానికి గురి చేసింది. తెలంగాణ ఆర్టిస్టుల‌కు అవ‌కాశాలు క‌ల్పించాల‌ని.. అలాగే తెలంగాణ ఆర్టిస్టుల సంఘం .. ఆంధ్రా ఆర్టిస్టుల సంఘం పేరుతో మా అసోసియేష‌న్ రెండుగా చీలాలని కూడా ఆయ‌న డిమాండ్ చేశారు.
Tags:    

Similar News