ఇండ‌స్ట్రీ దిక్కులేనిదే అయ్యింది!

Update: 2019-05-04 04:35 GMT
ఇండ‌స్ట్రీ పెద్ద దిక్కు.. ద‌ర్శ‌క‌ర‌త్న డా.దాస‌రి నారాయ‌ణ‌రావు మ‌ర‌ణానంత‌రం టాలీవుడ్ స‌న్నివేశ‌మేంటి? అంటే ఓ ర‌కంగా ఇండ‌స్ట్రీ దిక్కులేనిదే అయ్యింద‌న్న‌ది 24 శాఖ‌ల‌ కార్మికుల వెర్ష‌న్! ఆయ‌న లేని లోటు అలానే ఉంది! ఇప్ప‌టికీ స‌మ‌స్య వ‌స్తే ప‌రిష్క‌రించే నాధుడే లేక‌పోయార‌న్న ఆవేద‌న క‌నిపిస్తోంది. ఆయ‌న త‌ర్వాత మ‌ళ్లీ అంత‌టి క‌రిష్మా.. మాట‌కారిత‌నం కానీ.. లేదా చొర‌వ .. డామినేష‌న్ ఇలా ఏ కోణంలో చూసినా అంత‌టివాడు ఇంకొక‌రు ప‌రిశ్ర‌మ‌లో లేర‌ని చెబుతున్నారు.

పాదాల‌కు చెప్పుల్లేకుండా మ‌ద్రాసులో అడుగుపెట్టిన దాస‌రి... తెలుగు ప్ర‌తిభ‌కు ఐడెంటిటీని తెచ్చారు. అక్క‌డ ఉండ‌గానే ఏకంగా తంబీల ఇండ‌స్ట్రీనే షేక్ చేసే సినిమాలు తీశారు. లెజెండ‌రీ ద‌ర్శ‌కర‌చ‌యిత‌గా.. న‌టుడిగా .. బాల‌చంద‌ర్ .. భార‌తీ రాజా స‌హా ఎంద‌రో దిగ్ధ‌ర్శ‌కులంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయేంత‌గా ఎదిగారు. కళాత‌ప‌స్వి కె.విశ్వ‌నాథ్ అంత‌టి వారు దాస‌రి ప‌నిత‌నం గురించి ఎన్నో సంద‌ర్భాల్లో వేదిక‌ల‌పైనే కీర్తించారు. దాస‌రిలోని ట్యాలెంట్ .. క్రియేటివిటీ .. ఎదుగుద‌ల అన్న కోణం అలా ఉంటే ప‌రిశ్ర‌మ‌లో ఎంద‌రికో ఉపాధినిచ్చిన దేవుడు ఆయ‌న‌. త‌న‌లాగా పేద‌రికం నుంచి వ‌చ్చిన వారిని.. అన్నార్తుల్ని ఆదుకుని అవ‌కాశాలు క‌ల్పించారు. త‌న కాంపౌండ్ లో అడుగుపెట్టిన వారికి ఆక‌లి తీర్చిన దేవుడు అయ్యారు. ఆయ‌న వ‌ద్ద శిష్యుల్లో ఎంద‌రో ద‌ర్శ‌కులు అయ్యారు. మ‌రో కోణంలో ప‌రిశీలిస్తే.. ఇండ‌స్ట్రీ 24 శాఖ‌ల కార్మికుల‌కు ఏ స‌మ‌స్య వ‌చ్చినా ఆయ‌న ద‌శాబ్ధాల పాటు పెద్ద‌న్న‌గా ఉండి ప‌రిష్కరించారు. అందుకే ఆయ‌న వెళ్లాక నేటి అధునాత‌న క‌మ‌ర్షియ‌ల్ వ‌ర‌ల్డ్ లో చిన్న‌వాళ్ల‌ను ఆదుకునే దిక్కే లేదు అన్న క‌ల‌త స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.

ఏదైనా స‌మ‌స్య వ‌స్తే ఇప్ప‌టికిప్పుడు ప‌రిష్క‌రించే పెద్ద‌లున్నారా? అంటే శూన్యమే క‌నిపిస్తోంది ఇక్క‌డ‌. స‌మ‌స్య వ‌చ్చినా ఎవ‌రూ క‌ల‌గ‌జేసుకోరు... ప‌ట్టించుకోరని ఓ కార్మిక పెద్ద అన‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించ‌క మాన‌దు. ఇక ఎవ‌రైనా క‌లుగ‌జేసుకుని ప‌ట్టించుకోవాల‌ని చూసిన వారిని ఇంకెవ‌రూ ఖాత‌రు చేయ‌ని స‌న్నివేశం నెల‌కొందిట‌! ఇండ‌స్ట్రీలో ఏం జ‌రుగుతోందో ఎవ‌రికీ తెలీని ధైన్యం .. శూన్యం ఉందిప్పుడు. కీల‌క‌మైన థియేట‌ర్ల రంగంలో  ఎవ‌రిష్టం వ‌చ్చిన‌ట్టు వాళ్లు ఆడుతున్న వైనం బ‌య‌ట‌ప‌డుతోంది.. ఇండ‌స్ట్రీ పెద్ద‌న్న‌లంతా బిజినెస్ మైండెడ్.. ఎవ‌రు ఎలా పోతే మాకేంటి.. బిజినెస్ క‌లిసి రావాలి! అని ఆలోచిస్తార‌ని ప‌లువురు చిన్న నిర్మాత‌లు వేదిక‌ల‌పైనే విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇక దాస‌రి ఉన్నంత‌కాలం థియేట‌ర్ మాఫియా పై ఉరుములా విరుచుకుప‌డేవారు. ఇప్పుడు అడిగే నాథుడే లేక‌పాయే.. ! అంటూ ఓ చిన్న నిర్మాత ఇటీవ‌ల వాపోయారు. ఇది క‌నిపించ‌ని చాలా సీరియ‌స్ స‌మ‌స్య‌.. అని ప‌లువురు వ్యాఖ్యానించ‌డం ఆస‌క్తిక‌రం. బూర్జువా ప్ర‌పంచంలో బ‌ల‌వంతుడి రాజ్యంలో పేద కార్మికుల స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కార‌మే లేని వైనం క‌నిపిస్తోంద‌ని చెబుతున్నారు.

నేడు దాస‌రి జ‌యంతి. ఆయ‌న వెళ్లాక రెండో జ‌యంతిని శిష్యులు ఘ‌నంగానే నిర్వ‌హిస్తున్నారు. ఇటీవ‌లే దాస‌రి శిష్యుల్లో ఒక‌రైన తుమ్మ‌లప‌ల్లి రామ‌స‌త్య‌నారాయ‌ణ `దాస‌రి మెమోరియ‌ల్ అవార్డ్స్` కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. దాస‌రికి అత్యంత స‌న్నిహితులు.. కార్మికుల్లో ప్ర‌తిభావంతుల‌కు పుర‌స్కారాల్ని అందిస్తార‌ట‌. ప్ర‌తియేటా ఈ వేడుక‌ల్ని నిర్వ‌హించ‌నున్నారు. ఇక ఈటీవీలో దాస‌రి జ‌యంతిని పుర‌స్క‌రించుకుని ఆయ‌న తెర‌కెక్కించిన క్లాసిక్స్ ని నేడు ప్ర‌దర్శిస్తున్నారు. 7ఏఎం - కోరిక‌లే గుర్రాలైతే.. 10 ఏఎం-తూర్పు ప‌డ‌మ‌ర‌.. 1 పీఎం-స‌ర్దార్ పాపారాయుడు.. 4పీఎం-స్వ‌ప్న‌.. 7పీఎం- రాముడు కాదు కృష్ణుడు చిత్రాల్ని టెలీకాస్ట్ చేస్తున్నారు.  
    
    
    

Tags:    

Similar News