బొమ్మరిల్లు తర్వాత ఊపిరి సినిమానేనట

Update: 2016-03-29 09:11 GMT
ఊపిరి.. ఇప్పుడు టాలీవుడ్లో ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చ. వినోదానికి వినోదంతో.. ఎమోషన్ కు ఎమోషన్ తో ప్రేక్షకుల్ని కట్టిపడేస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకులే కాదు.. ఇండస్ట్రీ ప్రముఖులు సైతం ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. రాజమౌళితో మొదలుపెట్టి.. మహేష్ బాబు.. వి.వి.వినాయక్.. విక్టరీ వెంకటేష్ లాంటి సెలబ్రెటీలెందరో ‘ఊపిరి’ గొప్ప చిత్రం అంటూ మెచ్చుకున్నారు. తెలుగులో కథాబలం ఉన్న.. వైవిధ్యమైన సినిమాలు రావాలని ఎప్పుడూ చెప్పే దాసరి నారాయణ రావుకు కూడా ‘ఊపిరి’ తెగ నచ్చేసింది. ఈ సినిమా గురించి మీడియాతో మాట్లాడుతూ.. నాగార్జున సహా యూనిట్ సభ్యులందరినీ ప్రశంసల్లో ముంచెత్తారాయన.

‘‘ఒక స్టార్ హీరో రెండు గంటలకు పైగా కుర్చీలోనే కనిపించే పాత్రతో సినిమా తీయడమనేది గొప్ప విషయం. నటుడికి నటించడానికి ముఖం కావాలి. కానీ కళ్లతో కూడా నటించవచ్చు అని చెప్పడానికి నిదర్శనమే ఈ చిత్రం. ఇలాంటి సబ్జెక్ట్ ఒప్పుకోవడం.. సినిమా చేయడం నాగార్జున సాహసం. అలాగే కార్తీ కూడా మంచి నటనను ప్రదర్శించాడు. ఈ సినిమాలో డిఫరెంట్ తమన్నాను చూస్తాం. చిన్న చిన్న పాత్రల్లో మెరిసిన అనుష్క, శ్రియ కూడా అద్భుతంగా నటించారు. బొమ్మరిల్లు తర్వాత నాకు సంపూర్ణంగా నచ్చిన సినిమా ‘ఊపిరి’నే. ఈ పదేళ్లలో ఇంత మంచి మేకింగ్.. పెర్ఫామెన్స్.. చూడలేదు. డిఫరెంట్ సినిమా అనడానికి అసలైన అర్థం ఊపిరి. నాతో ఎవరూ ఏకీభవించినా.. ఏకీభవించకపోయినా తెలుగులో ఇలాంటి సినిమా తీసే ప్రయత్నం ఎవ్వరూ ఇంతవరకూ చేయలేదు. ఈ సినిమాకు మూల కారణం డైరెక్టర్ వంశీపైడిపల్లి. సినిమాలో ప్రతి ఫ్రేమ్ లోనూ దర్శకుడు కనిపించాడు. ప్రతి క్యారెక్టర్నీ అద్భుతంగా మలిచాడు. చక్కటి ట్రీట్మెంట్.. ఎక్కడా మెలో డ్రామా లేదు.. కథలో భాగంగా కామెడీ వచ్చింది తప్ప ప్రత్యేకంగా లేదు. ఇంత మంచి చిత్రాన్ని అందించిన పీవీపీ సంస్థను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా’’ అని దాసరి అన్నారు.
Tags:    

Similar News