కామెంట్: డెబ్యూలకు దెబ్బ పడేది ఇందుకే

Update: 2016-08-02 04:26 GMT
75 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన జాగ్వార్ మూవీతో ప్రేక్షకుల ముందుకు కొత్త హీరో వస్తున్నాడు. ఓ మాజీ ప్రధాని మనవడు.. మాజీ సీఎం కొడుకు కావడంతో ఇంత గ్రాండ్ లాంఛింగ్ లభించడం పెద్ద విషయమేమీ కాదు. నిజానికి ఇలా వారసులు న్యూ కమర్స్ గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వడం పలు ఇండస్ట్రీలలో చాలాసార్లే జరిగింది.  

తమిళ హీరో కార్తీక్ కొడుకు గౌతమ్.. ఏకంగా మణిరత్నం దర్శకత్వంలో కడలి అంటూ వచ్చినా ఫెయిల్ అయ్యాడు. దీని బడ్జెట్ అక్షరాలా యాభై కోట్లు. బాలీవుడ్ లో హీరో అంటూ ఆదిత్య పంచోలి కుమారుడు సూరజ్ పంచోలి రంగప్రవేశం చేశాడు. దీనికి కూడా 45 కోట్లకు పైగానే పోశారు. టాలీవుడ్ లో అయితే బెల్లంకొండ శ్రీనివాస్ కోసం కూడా ఇంతే బడ్జెట్ పెట్టి.. స్టార్ హీరోయిన్.. మరో స్టార్ హీరోయిన్ తో ఐటెమ్ సాంగ్ చేయించి.. అల్లుడు శీను తీశారు. ఇక అక్కినేని నాగార్జున కుమారుడు అఖిల్ తో.. అఖిల్ మూవీని కూడా 45 కోట్ల భారీ బడ్జెట్ తోనే తెరెకెక్కింది. వీటన్నిటి రిజల్ట్ మాత్రం కామన్. అన్నీ డిజాస్టర్లే.

ఎన్నెన్నో అంచనాలు.. రెడీమేడ్ గా అభిమానులు.. స్టార్ హీరోయిన్లు.. పెద్ద డైరెక్టర్లు.. ఇన్ని ఉన్నా ఒక్కరంటే ఒక్క వారసుడు కూడా అరంగేట్రంలో సత్తా చాటలేకపోతున్నారు. ఇందుకు కారణంగా చివరకు కొత్త మొహాలు అనే ఓ కుంటి సాకు వెతికేసుకోవడం అలవాటయింది. సినిమా ఫెయిల్యూర్ కాదు.. కాస్ట్ ఫెయిల్యూర్ అంతే అనే సమర్ధింపులు కూడా వినిపిస్తాయి.

అసలు హ్యారీ పోటర్ సినిమా చూసేవరక డానియెల్ రాడ్ క్లిఫ్ ఎవరో ఎవరికీ తెలీదు. స్పైడర్ మ్యాన్ చూసేవరకు టోబీ మాగ్వైర్ ఎవరో అంతకంటే తెలీదు. రీసెంట్ గా జంగిల్ బుక్ లో చూసి నీల్ సేథి అనే కుర్రాడితో కూడా జనాలకు పరిచయం లేదు. ఇక ట్రాన్స్ ఫార్మర్స్ లో పాత్రధారులు కానీ.. కింగ్ కాంగ్ లో కనిపించే గొరిల్లా-  హీరోయిన్ నయోమీ వాట్స్ తో మిగిలిన ప్రపంచానికి పెద్దగా పరిచయం లేదు. అయినా సరే ఆ సినిమాలన్నీ భారీ భారీ బ్లాక్ బస్టర్స్ సాధించాయంటే కారణం.. వారంతా కథను నమ్ముకోవడమే. ఆయా సినిమాల్లో కథే హీరో. స్టోరీలో హీరో కూడా ఒక పార్ట్ అంతే.

మన ఇండియాలో సినిమాల లెక్క ఇలా ఉండదు. అంతా హీరోయిజం బేస్డ్ గానే నడుస్తూ ఉంటుంది. హీరో పంచ్ డైలాగ్స్ పేలుస్తాడు.. పదులు-ఇరవైల కొద్దీ రౌడీలను ఒంటి చేత్తో ఉతికి ఆరేస్తాడు.. ఒళ్లు విరిచేసుకుని డ్యాన్సులు చేస్తూ ఉంటాడు. అంటే హీరోయిజం చూపించడం తప్ప.. హీరోలకు వేరే ఏ క్వాలిఫికేషన్ అక్కర్లేదు. సినిమాల్లో కథ అంటే అసలు ఉండనక్కర్లేదు. అందరూ ఓవర్ నైట్ లో సూపర్ స్టార్ అయిపోదామని ట్రై చేసేవాళ్లే.

కృష్ణ వారసుడైనా.. చైల్డ్ యాక్టర్ గా విపరీతమైన క్రేజ్ ఉన్నా.. సూపర్ స్టార్ అనిపించుకోవడానికి మహేష్ బాబుకి 10 ఏళ్లు పట్టింది. ఎంత హ్యాండ్సమ్ హంక్ అయినా.. కృష్ణం రాజు వారసుడైనా.. బిగ్ స్టార్ అయేందుకు ప్రభాస్ కు బాహుబలి వచ్చేవరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. కెరీర్ లో అందరికంటే ఎక్కువ హిట్స్ ఉన్నా.. సరైన హీరో అనిపించుకునేందుకు బన్నీ సరైనోడు వరకు వెయిట్ చేశాడు.

వీళ్లంతా ఒక్కో సినిమాకు ఒక్కో మెట్టు చొప్పున ఎక్కుతూ.. తప్పులు దిద్దుకుంటూ సినిమాలు చేసుకుని స్టార్ హీరోలయితే.. ఇప్పుడొచ్చే డెబ్యూ హీరోలంతా మొదటిమూవీతోనే 50 కోట్లు అందుకోవాలని.. సూపర్ స్టార్ లు అయిపోవాలని ట్రై చేస్తున్నారు. అదే వీళ్ల అసలు ప్రాబ్లెం. చివరకు జనాలు తిప్పి కొడితే.. మొహం చూపించడానికి ఏళ్లకేళ్లు పడుతోంది. కథను నమ్ముకుంటే ఇలాంటి సమస్యలుండవు డెబ్యూ హీరోలూ!
Tags:    

Similar News