‘పద్మావతి’ ప్రీమియర్ కోసం చేతిలో చెయ్యేసి

Update: 2018-01-24 10:21 GMT
ఈ మధ్య కాలంలో ఏ సినిమాకు లేనన్ని వివాదాలలో తడిసి ముద్దైన పద్మావత్ ఎట్టకేలకు థియేటర్ స్క్రీన్స్ పైకి వచ్చేసింది. విడుదల రేపే అయినప్పటికీ నిన్నటి నుంచే మీడియాకు - ఇండస్ట్రీకి స్పెషల్ షోస్ వేసేసింది సినిమా యూనిట్. హైదరాబాద్ లో నిన్న సాయంత్రం ఆర్కె సినీ ప్లెక్స్ లో షో పూర్తయిపోయింది. వాటి నుంచి వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం పాజిటివ్ గానే ఉన్న పద్మావత్ స్పెషల్ ప్రీమియర్ షో నిన్న ముంబైలో కూడా సాయంత్రం అదే సమయంలో జరిగింది. పద్మావత్ లో నటించిన నటీనటులతో పాటు సాంకేతిక వర్గం - మీడియా ప్రతినిధులతో పాటు బాలీవుడ్ సెలెబ్రిటీస్ కూడా ఎందరో ఈ స్పెషల్ షోకు వచ్చిన వారిలో ఉన్నారు. ఎవరి సంగతి ఎలా ఉన్నా అందరి దృష్టి మాత్రం ఆ ఇద్దరి మీదే నిలిచింది. వారే దీపికా పదుకునే - రన్వీర్ సింగ్.

సినిమాలో బద్ధ శత్రువులుగా నటించిన దీపికా - రన్వీర్ మధ్య ఎప్పటి నుంచో ఘాడమైన ప్రేమ ఉందని బాలీవుడ్ మీడియా ముందు నుంచి కోడై కూస్తూనే ఉంది. త్వరలోనే ఈ ఇద్దరు శ్రీలంకలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అనే వార్తలు కూడా ప్రచారంలో ఉన్నాయి. జంటగా ప్రీమియర్ కు వచ్చిన ఈ ఇద్దరు బయటికి వచ్చేటప్పుడు మాత్రం చేతిలో చెయ్యి వేసుకుని ముసిముసినవ్వులు నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ బయటికి రావడం మీడియా దృష్టినే కాదు అక్కడ ఉన్న వారినందరినీ ఆకట్టుకుంది. అంటే వినిపిస్తున్నది గాసిప్ కాదు నిజమేనేమో అన్నంత చనువుగా ఇద్దరు నడిచి వెళ్ళడం చూసి అందరు చెవులు కోరుక్కోవడమే మిగిలింది.

పద్మావత్ సినిమాలో హీరో షాహిద్ కపూర్ అయినప్పటికీ తన టేరిఫిక్ పెర్ఫార్మన్స్ తో అందరిని డామినేట్ చేసాడు అల్లాయుద్దిన్ ఖిల్జీ గా నటించిన రన్వీర్ సింగ్. అతని తర్వాత ఖిల్జీ పొడ గిట్టని రాణి పద్మావతిగా దీపికా ఫుల్ మార్కులు కొట్టేసింది. సినిమాలో గిట్టని శత్రువులుగా మెప్పించిన ఈ జంట ఇప్పుడు బయట అందరికి నచ్చిన ప్రేమికులుగా త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అనే వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే ఇంకొంత కాలం వెయిట్ చేసి చూడక తప్పదు.

Tags:    

Similar News