మీడియాలో వచ్చిన పుకారు వల్ల సూపర్‌ స్టార్‌ ఇంటి అల్లుడయ్యాడు

Update: 2021-04-07 03:54 GMT
తమిళ సూపర్ స్టార్‌ రజినీకాంత్‌ పెద్ద కూతురు ఐశ్వర్య మరియు హీరో ధనుష్‌ లది ప్రేమ వివాహం అని అంతా అంటూ ఉంటారు. ఇద్దరు ప్రేమించుకుంటే పెద్దలు వారి పెళ్లి చేశారనే వార్తలు వచ్చాయి. అయితే ఇన్నాళ్లు ధనుష్‌ కాని ఐశ్వర్య కాని వారి అసలు ప్రేమ కథను మాత్రం బయటకు చెప్పలేదు. దాంతో ఎవరికి నచ్చిన విధంగా వారు కథలు అల్లేసుకున్నారు. కాని అసలు కథను హీరో ధనుష్‌ తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. తమ పెళ్లి విచిత్రమైన పరిస్థితుల నడుమ జరిగిందని.. ఒక మీడియా కథనం కారణంగా తమ పెళ్లి సంబంధం కుదిరింది అంటూ ధనుష్‌ చెప్పుకొచ్చాడు.

ధనుష్‌ మాట్లాడుతూ.. నా మొదటి సినిమా తల్లువదో ఇలమై సినిమా తర్వాత చాలా విమర్శలు ఎదుర్కొన్నాను. చాలా మంది చాలా రకాలుగా నా గురించి మాట్లాడారు. ఆ తర్వాత నేను అన్నయ్య సెల్వ రాఘవన్‌ దర్శకత్వంలో చేసిన రెండవ సినిమా కాదల్‌ కొండేన్‌ సినిమా తో సక్సెస్‌ దక్కించుకున్నాను. ఆ సినిమా నాకు మంచి పేరు తెచ్చి పెట్టింది. ఆ సినిమానే నాకు రజినీ గారి కూతురితో పరిచయం అయ్యేలా చేసింది. కాదల్‌ కొండేన్‌ సినిమాను చూసిన ఐశ్వర్య నాకు బొకే పంపించారు. బొకేతో పాటు కంగ్రాట్స్‌.. బాగా నటించారు కలుద్దాం అంటూ మెసేజ్ కూడా పంపించారు. ఆ తర్వాత ఇద్దరి మద్య మాటలు కొనసాగాయి. ఒక సారి మేము కాఫీ షాప్‌ లో కలిశాము.

కాఫీ షాప్‌ లో ఉన్న విషయం బయటకు వచ్చింది. మా ఇద్దరి గురించి పుకార్లు షికార్లు చేశాయి. ఇద్దరం ప్రేమలో ఉన్నట్లుగా మీడియాలో వార్తలు వచ్చాయి. నా వల్ల రజినీకాంత్‌ గారి కూతురుకి చెడ్డ పేరు వచ్చింది.. ఆయన కూడా ఇబ్బంది పడుతున్నారంటూ బాధ పడ్డాను. ఆ సమయంలోనే రజినీ గారు మా కుటుంబ సభ్యులు కలిసి మాట్లాడుకుని ఇద్దరికి పెళ్లి చేస్తే తప్పేముంది అంటూ నిర్ణయించుకుని మా పెళ్లి చేశారని ధనుష్ చెప్పుకొచ్చాడు. మేము ఊహించని విధంగా మా పెద్దలు పెళ్లి నిర్ణయించడం జరిగింది. నాతో పెళ్లికి మొదట ఐశ్వర్య ఒప్పుకుంటుందా అనుకున్నాను. కాని తను నాతో పెళ్లికి అంగీకరించింది.

మా మద్య ఎక్కువ కాలం పెళ్లి ప్రేమ వ్యవహారం ఏమీ సాగలేదు. మేము మొదటి సారి కలుసుకున్న ఆరు నెలల్లోనే దంపతులం అయ్యాము అంటూ ధనుష్‌ తమ పెళ్లి గురించి క్లారిటీగా చెప్పేశాడు. అయితే పెళ్లికి ముందు ఐశ్వర్యను మీరు ప్రేమించారా అంటూ ప్రశ్నించగా ధనుష్‌ స్పష్టమైన సమాధానం చెప్పలేదు. అంటే పెళ్లికి ముందే వీరు ప్రేమించుకున్నారు.. మీడియాలో వచ్చిన కథనంతో పెళ్లి చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు అని తమిళ మీడియా జనాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News