అవార్డు సినిమా.. కథ రాసింది ఆటోవాలా

Update: 2015-10-12 01:30 GMT
విసారణై.. ఈ కోలీవుడ్ సినిమా పేరు కొంత కాలంగా మార్మోగిపోతోంది. తన బేనర్ నుంచి ‘కాకా ముట్టై’ లాంటి గొప్ప సినిమాను అందించిన హీరో ధనుషే ఈ సినిమాను కూడా నిర్మించాడు. ధనుష్ కు జాతీయ అవార్డు తెచ్చిపెట్టిన ‘ఆడుగళం’ సినిమాకు దర్శకత్వం వహించిన వెట్రిమారన్ ఈ సినిమాకు దర్శకుడు. ప్రతిష్టాత్మక వెనిస్ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శితమైన తొలి ఇండియన్ మూవీగా రికార్డులకెక్కడమే కాదు.. అక్కడ ‘మూవీ ఆన్ హ్యూమన్ రైట్స్’ విభాగంలో అవార్డు కూడా గెలుచుకుంది. త్వరలోనే ఈ సినిమా భారతీయ ప్రేక్షకుల ముందు రాబోతోంది. ‘కాకా ముట్టై’ లాగే ఈ సినిమా కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని ధనుష్, వెట్రిమారన్ కాన్ఫిడెంటుగా ఉన్నారు.

ఈ సినిమాకు సంబంధించి చాలామందికి తెలియని పెద్ద విశేషం ఏంటంటే..  ఈ కథ రాసింది ఓ ఆటో డ్రైవర్. అతడి పేరు చంద్రకుమార్. ఓ ఆటోవాలా ఇంత గొప్ప కథ రాయడమేంటి అని సందేహం కలుగుతోందా? అతను ఆటోవాలానే కానీ.. అజ్నాని కాదు. బోలెడంత పుస్తక పరిజ్నానం ఉంది. అదంతా బడికెళ్లి చదువుకున్నది కాదు. సొంత ఆసక్తి ద్వారా తెచ్చుకున్న జ్నానమిది. తమిళనాడుకు చెందిన చంద్రకుమార్.. ఇంట్లో వాళ్లపై అలిగి గుంటూరుకు వచ్చి అక్కడ హోటళ్లలో పని చేస్తూ గడిపేవాడట. అలా చాలా ఏళ్లు గడిచాక ఓసారి లోకల్ పోలీసులు ఓ కేసులో ఇరికించి.. అతడితో పాటు మరో నలుగురు అమాయకుల్ని స్టేషన్ కు తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టారట. ఈ కేసు విషయంలో నాలుగు నెలల జైలు కూడా అనుభవించాడట చంద్రకుమార్. చివరికి అతను నిర్దోషి అని వదిలిపెట్టారు. ఆ తర్వాత అతను తిరిగి తమిళనాడుకు వెళ్లిపోయి.. మధురైలో ఆటో డ్రైవర్ గా మారాడు. ఐతే తనకు ఒకప్పుడు ఎదురైన చేదు అనుభవాల నేపథ్యంలో చంద్రకుమార్ ‘లాకప్’ అనే పుస్తకం రాశాడు. ఆ పుస్తకం చదివిన వెట్రిమారన్.. దాన్నే సినిమాగా తీయడానికి పూనుకున్నాడు. దీంతో చంద్రకుమార్ కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. చంద్రకుమార్ వెనిస్ చిత్రోత్సవాలకు కూడా హాజరై అక్కడ అందరి ప్రశంసలు అందుకోవడం విశేషం.
Tags:    

Similar News